Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హోల్ సేల్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్న ఆప్కో

హోల్ సేల్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్న ఆప్కో
విజ‌య‌వాడ‌ , బుధవారం, 19 జనవరి 2022 (15:20 IST)
సరికొత్త మార్కెటింగ్ వ్యూహాలతో చేనేత పరిశ్రమ ఇపుడు హోల్ సేల్ వ్యాపారం లోకి అడుగు పెడుతోంది. పోటీ మార్కెట్ లోకి దీటుగా అడుగు పెట్టి, విశేష కృషి చేస్తున్న ఆప్కో పనితీరు ప్రశంసనీయమని రాష్ట్ర వాణిజ్యం, పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అన్నారు. జాతీయ స్ధాయిలో టోకు వ్యాపారాన్ని అందిపుచ్చుకునేలా ఆప్కో చరిత్రలోనే తొలిసారిగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేయటం శుభపరిణామమన్నారు. 
 
 
ఆప్కో వస్త్ర శ్రేణికి సంబంధించిన జాబితా ప్రతులను (క్యాటలాగ్)ను మంత్రి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ, హోల్‌సేల్ మార్కెట్ల ఆలంబనతో చేనేత వస్త్రాల మార్కెటింగ్‌ను ప్రోత్సహించగలిగితే రాష్ట్రంలోని చేనేత కార్మికులు అందరికీ పూర్తిస్ధాయిలో పని లభిస్తుందన్నారు. ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మోహనరావు మాట్లాడుతూ సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, కర్నాటక, చత్తీస్ ఘడ్ తో పాటు ఉత్తర భారతదేశంలోని మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల నుండి ఆర్డర్‌లను పొందడానికి ఆప్కో రాష్ట్రంలోని చేనేత వస్త్రాల జాబితాను సిద్దం చేసిందన్నారు. చేనేత జౌళి శాఖ సహకారంతో ప్రస్తుత ట్రెండ్ కు అనుగుణంగా విభిన్న చేనేత ఉత్పత్తులను అభివృద్ది చేస్తున్నామన్నారు. 

 
నూతనత్వం ఉట్టి పడేలా డోర్, విండో కర్టెన్లు ఇప్పటికే వినియోగదారులకు అందుబాటులో ఉంచామని, టర్నీ టవల్స్ ను తలదన్నే రీతిలో తేనేగూడు తువ్వాలు, చేతి రుమాళ్లను త్వరలోనే ఆవిష్కరించనున్నామని చేనేత జౌళి శాఖ సంచాలకురాలు, ఆప్కో వైస్ ఛైర్మన్, ఎండి చదలవాడ నాగరాణి మంత్రికి వివరించారు. సహజసిద్దమైన కూరగాయల రంగులతో ముద్రించిన కలంకారి చేనేత వస్త్రాలు ప్రస్తుతం వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయన్నారు. 

 
రాజమండ్రి, బందరు చీరలకు ప్రింటెడ్ డిజైన్లతో అదనపు విలువను జోడించామన్నారు. విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, కడప, ఒంగోలులో ఆప్కో మెగా షోరూమ్‌లను కలిగి ఉందని, అన్ని ప్రధాన నగరాల్లో ఇదే తరహా షోరూమ్‌లను ప్రారంభించాలని భావిస్తున్నామని నాగరాణి పేర్కొన్నారు. కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ సంయిక్త సంచాలకులు కన్నబాబు, నాగేశ్వరరావు, ఆప్కో సీనియర్ మార్కెటింగ్ అధికారి రమేష్ బాబు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డికి కరోనా