చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషనుకు చేరుకునేటపుడు తమ బంధువులకు ఫోన్ చేసేందుకు ఓ యువకుడు తన జేబు లోపలి నుంచి ఫోన్ బైటకు తీసాడు. రైలు అప్పుడే ఫ్లాట్ ఫారమ్ పైకి వస్తోంది. యువకుడు ఫోన్ చేసి.. హలో మామయ్య అనే లోపు చేతి నుంచి గబుక్కున ఫోన్ లాక్కుని పరారయ్యాడు ఓ సెల్ ఫోన్ దొంగ. కదులుతున్న రైలు నుంచి దిగే సాహసం చేయలేక ఆ యువకుడు చేష్టలుడిగి చూస్తుండిపోయాడు.
కొత్త ఫోన్. మొన్ననే రూ. 30 వేలతో కొన్నాడు. పోలీసుల వద్దకు కంప్లైంట్ ఇచ్చేందుకు వెళితే... వాళ్లు ఓ పుస్తకం ముందు పెట్టి... చూడయ్యా బాబూ, నీలాగ ఫోన్లు పోగొట్టుకుని ఇప్పటికే 2 వేల మందికి పైగా ఫిర్యాదు చేసారంటూ షాకిచ్చారు. దీనితో అతడు ఫిర్యాదు ఇచ్చి అక్కడి నుంచి వెనుదిరిగాడు. ఇది కేవలం చెన్నై మాత్రమే కాదు.. పలు స్టేషన్లలో కూడా మనం మన హడావుడిలో వుంటే దొంగలు మాత్రం మన వస్తువులను ఎలా కొట్టేయాలో అని అదను కోసం చూస్తుంటారు. కనుక తస్మాత్ జాగ్రత్త మీ ఫోన్లు, మీ వస్తువులు.