తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి రసాయన పరిశ్రమలో సోమవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించగా, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 19కు చేరింది. మరో 22 మంది తీవ్రంగా గాయప్డడారు. వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. శిథిలాల కింద మరికొందరు చిక్కుకునివుంటారని భావిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం సిగాచి పరిశ్రమలోని రియాక్టర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ పేలుడు తీవ్రతకు ఉత్పత్తి విభాగం ఉన్న భవనం పూర్తిగా కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో మొత్తం 108 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. పేలుడు ధాటికి కొందరు కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఈ ఘటన జరిగిన వెంటనే ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 14 మంది తుదిశ్వాస విడిచారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 12 మందిని ఐసీయూలో ఉంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న కార్మికుల కుటుంబసభ్యులు, బంధువులు ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తుండటంతో అక్కడ హృదయవిదారక దృశ్యాలు నెలకొన్నాయి.
కాగా, ఈ దుర్ఘటనలో సిగాచి ప్లాంట్ వైస్ ప్రెసిడెంట్ ఎల్ఎన్ గోవన్ కూడా దుర్మరణం పాలయ్యారు. ఆయన తన కారులో ప్లాంట్లోకి ప్రవేశిస్తున్న సమయంలోనే పేలుడు సంభవించడంతో ఆ ప్రమాద ధాటికి ఆయన ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జయింది. దీంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు.