తన ప్రియురాలి కోసం కట్టుకున్న భార్యను ఓ కిరాతక భర్త హత్య చేశాడు. ఈ దారుణానికి పాల్పడింది భారతీయ జనతా పార్టీకి చెందిన నేత కావడం గమనార్హం. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్‌లో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
అజ్మీర్‌కు చెందిన బీజేపీ నేత రోహిత్ సైనికి సంజు అనే మహిళతో కొంతకాలం క్రితం వివాహమైంది. అయితే, అదే ప్రాంతానికి చెందిన రీతూ సైనీ అనే మహిళతో కూడా ఆయన వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో తమ బంధానికి భార్య సంజు అడ్డుగా ఉందని భావించాడు.
ఇదిలావుంటే, ఈ నెల 10వ తేదీన సుంజు ఇంటిలోనే అనుమానాస్పదస్థితిలో చనిపోయి కనిపించింది. దీనిపై సమచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టగా రోహిత్ పొంతనలేని సమాధానాలు చెప్పాడు. ఇంట్లో దోపిడీకి వచ్చిన దొంగలు... తన భార్యను హత్య చేసి బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్టు పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే, అతని ప్రవర్తనను అనుమానించిన పోలీసులు... రోహిత్‌ను అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారించగా అసలు నేరాన్ని అంగీకరించాడు.
అతనివద్ద జరిపిన విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రియురాలు రీతూ ప్రోద్బలంతోనే రోహిత్ తన భార్యను హత్య చేసినట్టు అంగీకరించాడు. తమ మధ్య నుంచి సంజు అడ్డు తొలగించుకోవాలని రీతూ ఒత్తిడి చేయడంతో ఈ దారుణానికి పాల్పడినట్టు తెలిపాడు. ఈ ఘటన జరిగిన 24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులను ఆయన అభినందించారు. ఈ కేసులో రోహిత్‌తో పాటు ఆయన ప్రియురాలు రీతూ సైనీని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.