నాగపట్నంలో ఘోరం జరిగింది. ప్రేమించుకుని ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు. పెద్దలు అందుకు అంగీకరించారు. నిశ్చితార్థం పెట్టుకున్నారు. మరో రెండు నెలల్లో పెళ్లి జరుగుతుందనగా ప్రియురాలిపై అనుమానంతో ప్రియుడు అత్యంత పైశాచికంగా హత్య చేసాడు.
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. తమిళనాడులోని నాగపట్నంలో నివాసం వుంటున్న యువతి, దినేష్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ సంగతులను సోషల్ మీడియాలో సైతం పోస్ట్ చేస్తుండేవారు. దినేష్ చదువు ముగిసినా ఉద్యోగం రాలేదు. కానీ దినేష్ ప్రియురాలికి ఉద్యోగం వచ్చేసింది. ఆమె తన డ్యూటీకి వెళ్లి వస్తోంది. ఈ క్రమంలో మనిద్దరం పెళ్లి చేసుకుందామంటూ దినేష్ తన ప్రియురాలి వద్ద చెప్పాడు. అందుకు ఆమె అంగీకరించింది. పెద్దలు సైతం ఒప్పుకున్నారు. మరో రెండు నెలల్లో పెళ్లి జరగాల్సి వుంది.
ఇంతలో దినేష్ తన ప్రియురాలికి ఎప్పుడు ఫోన్ చేసినా ఎంగేజ్ వస్తుండటంపై నిలదీశాడు. అందుకామె.. ఉద్యోగం అన్నాక సవాలక్ష ఫోన్లు వస్తాయి. మాట్లాడితే తప్పేంటి అంటూ దినేష్ మాటలు కొట్టిపారేసింది. దీనితో దినేష్ ఆమెను చాటుగా ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఆఫీసులో ఓ యువకుడితో ఆమె కాస్తంత సన్నిహితంగా వున్నట్లు చూసాడు. ఈ విషయంపై మరోసారి ఆమెను నిలదీశాడు. దాంతో చిర్రెత్తిపోయిన యువతి, మాట్లాడితే అనుమానం, ఆఫీసులో ఎవరితో మాట్లాడినా అనుమానం.. అలాగైతే మనిద్దరం పెళ్లి చేసుకోవద్దు అంటూ ముఖం మీదే చెప్పేసింది.
దీనితో మరింత ఆగ్రహానికి గురైన దినేష్ ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఓ సుత్తి, రాడ్డు తీసుకుని ఆమె వుంటున్న గదికి వెళ్లి.. నువ్వు అందంగా వున్నావనే కదా నీకు అహంకారం అయితే చావు అంటూ రాడ్డుతో ముఖంపై అత్యంత దారుణంగా కొడుతూ, ఆమెను ఛిత్రవధ చేసి హత్య చేసాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపి, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.