జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో మళ్లీ క్లౌడ్ బరస్ట్ అయింది. ఈ కారణంగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఏడుగురు మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలోని కిశ్త్‌వాడ్ జిల్లాలో ఇటీవల సంభవించిన క్లౌడ్ బరస్ట్.. పెను విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ ఉపద్రవాన్ని మరువక ముందే కథువా జిల్లాలోని ఘాటీ గ్రామంలో మేఘ విస్ఫోటం సంభవించింది. ఈ విపత్తులో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారని అధికారులు తెలిపారు.
ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ విస్ఫోటం సంభవించిందని స్థానిక పోలీసు అధికారి తెలిపారు. సహాయక చర్యల నిమిత్తం ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం ఆ ప్రాంతానికి చేరుకుందని వెల్లడించారు. ఘాటీ సమీపంలోని జుతానా జోడ్ అనే ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో శిథిలా కింద ఒక కుటుంబం చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
భారీ వర్షాల కారణంగా సహాక్ ఖాద్, ఉజ్ నదులలో నీటి శాతం అమాంతంగా పెరిగిపోయిందని అధికారులు తెలిపారు. రైలు పట్టాలు దెబ్బతినడంతో పాటు ఆ ప్రాంతంలోని జాతీయ రహదారితో సహా ప్రధాన మార్గాలపై వాహనాలు నిలిచిపోయాయన్నారు. కథువా పోలీస్ స్టేషన్‌లోకి కూడా వరదనీరు చేరింది.
ఈ ఘటనపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఎక్స్ వేదికగా వివరాలు వెల్లడించారు. మేఘ విస్ఫోటంపై సమాచారం అందగానే కథువా పోలీసు అధికారి శోభిత్ సక్సేనాతో మాట్లాడినట్లు తెలిపారు. సహాయక సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకున్నారన్నారు. మృతులకు సంతాపం తెలిపారు.
మరోవైపు జిల్లా అధికారులు వాతావరణ హెచ్చరికలు జారీ చేశారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున అలాంటి ప్రదేశాలకు దూరంగా వెళ్లాలని కోరారు.
ఇటీవల మచైల్ మాతా దేవి దర్శనానికి వెళ్తున్న యాత్రికులపై మేఘ విస్ఫోటం విరుచుకుపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో సహా ఇప్పటి వరకు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 82 మంది గల్లంతైన విషయం తెల్సిందే.