అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రస్తుతం ట్వీట్ మొనగాడిగా మారిపోయాడు. ట్వీట్ చేయడంలో, ట్వీట్ ద్వారా సెటైర్లు వేయడంలో దిట్ట అయిన వీరేంద్ర సెహ్వాగ్.. ప్రస్తుత క్రికెటర్ల నుంచి మాజీ క్రికెటర్ల వరకు తనదైన శైలిలో ట్విట్టర్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంటాడు.
అలా సోమవారం ఆర్యభట్ట పుట్టినరోజుని పురస్కరించుకుని సెహ్వాగ్ తనదైన శైలిలో ట్విట్టర్‌లో స్పందించాడు. ఎనిమిదేళ్ల క్రితం భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన విషయాన్ని ఈ ట్వీట్ ద్వారా సెహ్వాగ్ ప్రస్తావించాడు. బర్మింగ్‌హామ్‌లో జరిగిన మూడో టెస్టులో తాను రెండు ఇన్నింగ్స్‌ల్లో డకౌటయ్యాను. ఈ విషయాన్ని సెటైరికల్‌గా సెహ్వాగ్ "నేను కింగ్ పెయిర్ స్కోరు" చేశానంటూ ట్వీట్ చేశాడు.
సరిగ్గా ఇదే రోజు అంటే ఆగస్టు 12వ తారీఖున ఆడిన ఇన్నింగ్స్‌లో అవుట్‌తో వెనుదిరిగాడు. దీనిని వ్యంగ్యంగా చెప్పుకున్న సెహ్వాగ్, ఎనిమిదేళ్ల క్రితం టెస్టు మ్యాచ్‌లో తాను సున్న కొట్టానని చెప్పాడు. ఇంగ్లండ్‌లు రెండు రోజుల పాటు పర్యటించిన తాము 188 ఓవర్లలో ఫీల్డింగ్ చేశామని, ఇష్టం లేకపోయినా ఈ రికార్డును (జీరోను) ఆర్యభట్టకు అంకితం చేయాల్సి వచ్చిందని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
ఈ ఘనత భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు ఆర్యభట్టకే దక్కుతుంది. మనం ఫెయిల్యూర్ కావడానికి జీరో చాన్స్ మాత్రమే ఉంటే ఇంకేమి చేస్తామని ట్వీట్ ద్వారా తన మీద తానే సెటైర్లు వేసుకున్నాడు. కాగా టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్‌లో ఒక బ్యాట్స్‌మన్ డకౌట్‌గా పెవిలియన్ చేరితే కింగ్ పెయిర్‌గా పిలుస్తామనే సంగతి తెలిసిందే.
సోమవారం ఆగస్టు 12న అది జరగడంతో, ఆ సందర్భాన్ని సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. ఇక అప్పటి ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా పేలవ ప్రదర్శన చేసింది. దీంతో ఆ సిరిస్‌ను 4-0తో కోల్పోయింది. మొదటి రెండు టెస్టులకు దూరమైన సెహ్వాగ్ ఆ తర్వాత జరిగిన మూడో టెస్టులో ఆడి రెండు ఇన్నింగ్స్‌ల్లో పరుగులేమీ చేయకుండా ఔటయ్యాడు.