మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన క్రికెట్ కెరీర్‌లో నెలకొల్పిన రికార్డులన్నీ కనుమరుగైపోతున్నాయి. భారత పరుగుల యంత్రంగా పేరుగడించిన విరాట్ కోహ్లీ మైదానంలో దూకుడు చూపుతూ క్రికెట్ ప్రపంచంలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాస్తూ ముందుకుసాగిపోతున్నాడు.
నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో ఆ దేశానికే చెందిన మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ వన్డే చరిత్రలో అత్యంత వేగంగా 9 వేల పరుగులు పూర్తిచేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఖాతాలో ఉండేది. ఇపుడు ఈ రికార్డును కోహ్లీ బద్దలు కొడుతూ.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 9000 పరుగులు చేసిన సారథిగా ఘనత సాధించాడు.
రెండో వన్డేలో 22 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడు ఈ మైలురాయిని చేరుకున్నాడు. కోహ్లీ కెప్టెన్‌గా 159 ఇన్నింగ్స్‌ల్లో 9 వేలు పూర్తి చేస్తే.. పాంటింగ్ అందుకు 203 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 9000 పరుగులు చేసిన కెప్టెన్లలో కోహ్లీకి ముందు స్మిత్ (220 ఇన్నింగ్స్‌లు), ధోని (253), అలెన్ బోర్డర్ (257), ఫ్లెమింగ్ (272)లు ఈ జాబితాలో ఉన్నారు. అలాగే, ఈ మ్యాచ్‌లో కోహ్లీ తన 40వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఈ నేపథ్యంలో అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు భారత క్రికెట్ మాస్టర్, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ఈయన తన వన్డే కెరీర్‌లో మొత్తం 49 సెంచరీలు చేశాడు. దీంతో వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డు సచిన్ పేరిట ఉంది. ఇపుడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ రికార్డును బద్ధలు కొట్టేందుకు పరుగు తీస్తున్నాడు. నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో కోహ్లీ 40వ సెంచరీ చేశాడు. అంటే.. సచిన్ అత్యధిక సెంచరీల (49) రికార్డుకు ఇంకో తొమ్మిది శతకాల దూరంలో ఉన్నాడు.