Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 17 April 2025
webdunia

చేతులెత్తేసిన కోహ్లీ సేన... వరల్డ్ టెస్ట్ టైటిల్ కివీస్‌దే

Advertiesment
New Zealand
, గురువారం, 24 జూన్ 2021 (07:50 IST)
రెండేళ్లపాటు సాగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో అద్భుత విజయాలు సాధించి ఫైనల్‌కు చేరుకున్న భారత జట్టు ఫైనల్ మెట్టు వద్ద బోల్తాపడింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైన కోహ్లీ సేన న్యూజిలాండ్‌కు టైటిల్ అప్పగించి రన్నరప్‌గా సరిపెట్టుకుంది. 
 
ఆట ప్రారంభం నుంచి అడ్డుకున్న వరుణుడు రిజర్వుడే నాడు ఆటంకం కలిగిస్తాడని, పరాజయాన్ని తప్పిస్తాడని భావించిన టీమిండియా అభిమానులకు నిరాశే ఎదురైంది.
 
బుధవారం భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే కుప్పకూలింది. దీంతో కివీస్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పోనూ ఆ జట్టు విజయ లక్ష్యం 139 పరుగులు అయింది. 
 
ఈ స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్ 45.5 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఐసీసీ తొలి టెస్టు చాంపియన్‌షిప్ ట్రోఫీ అందుకుంది. కెప్టెన్ విలియమ్సన్ 52 పరుగులు, రాస్ టేలర్ 47 పరుగులు చేసి జట్టుకు అపురూప విజయాన్ని అందించారు.
 
నిజానికి స్వల్ప లక్ష్యం కోసం బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు లాథమ్‌ (9), కాన్వే (19) శుభారంభం అందించారు. అయితే, వీరిద్దరినీ 10 పరుగుల తేడాతో పెవిలియన్‌ చేర్చిన అశ్విన్‌.. భారత శిబిరంలో ఆశలు రేపాడు. కానీ, విలియమ్సన్‌, రాస్‌ టేలర్‌ జోడీ నిలవడంతో మ్యాచ్‌ కివీస్‌ వైపు మొగ్గింది. 
 
ఒక దశలో టీమిండియా బౌలర్లు ఒత్తిడి పెంచినా.. వీరిద్దరూ సంయమనంతో బ్యాటింగ్‌ చేస్తూ స్కోరు బోర్డును నడిపించారు. బుమ్రా బౌలింగ్‌లో 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టేలర్‌ ఇచ్చిన క్యాచ్‌ను పుజారా నేలపాలు చేశాడు. 
 
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న టేలర్‌.. వడివడిగా పరుగులు సాధిస్తూ టీమ్‌ స్కోరు సెంచరీ మార్క్‌ దాటించాడు. మరోవైపు విలియమ్సన్‌ కూడా కూల్‌గా ఆడుతూ అర్థ శతకంతో లక్ష్యాన్ని కరిగించాడు. టేలర్‌ విన్నింగ్‌ ఫోర్‌తో కివీస్‌ సంబరాలు చేసుకొంది. 
 
కాగా, ఐసీసీ మెగా ఈవెంట్లలో కోహ్లీ విఫలమవడం ఇది మూడోసారి. 2017 చాంపియన్స్‌ ట్రోఫీలో, 2019 వరల్డ్‌క్‌పలోనూ విరాట్‌ రాణించలేక పోయాడు. ఈ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రెండు ఇన్నింగ్స్‌లోనూ కోహ్లీ అర్థ శతకం కూడా చేయలేకపోయాడు. వరుసగా ఆరు ఇన్నింగ్స్‌ల్లో భారత్‌ను 250 కంటే తక్కువ స్కోరుకే కెప్టెన్‌గా విలియమ్సన్‌ సేన కట్టడి చేయడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో భారత్‌కు ఓటమి తప్పదా? కివీస్ టార్గెట్ 139