భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం రోజువారీ కేసులు 42వేలకు చేరగా.. బుధవారం మళ్లీ పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 50,848 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,28,709 కి చేరింది. ఇందులో 2,89,94,855 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 6,43,1941 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.
ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 1,358 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 3,90,660 మంది కరోనాతో మృతి చెందారు. ఒక్క రోజులో దేశంలో 68,817 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో రికవరీ రేటు 96.56%కు చేరింది.
మరోవైపు మంగళవారం దేశవ్యాప్తంగా 19,01,056 కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. అలాగే ఇప్పటిదాకా 29,46,39,511 మందికి వ్యాక్సినేషన్ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. కాగా, కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో పలు రాష్ట్రాలు అన్‌లాక్ ప్రక్రియను మొదలుపెట్టాయి. ఎక్కువ పాజిటివిటీ రేట్ ఉన్న ప్రాంతాల్లో కట్టుదిట్టమైన లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నాయి.
అలాగే దేశవ్యాప్తంగా కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో 40కి పైగా కేసులు నమోదు అయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ఎనిమిది రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసింది. మంగళవారం నాలుగు రాష్ట్రాలలో ఈ కేసులు నమోదైన నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేసారు. ఇక తాజాగా మరో నాలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు పంపించింది.