Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్ 2023 : లక్నో - చెన్నై మ్యాచ్ వర్షార్పణం

Advertiesment
ipl2022
, బుధవారం, 3 మే 2023 (20:05 IST)
లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఇరు జట్లు చెరో పాయింట్‌ను పంచుకున్నాయి. వర్షం కారణంగా మ్యాచ్‌ను నిలిపివేసే సమయానికి టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో... 19.2 ఓవర్లలో 125/7 స్కోరు చేసింది. ఆయుష్‌ బదోని (59) నాటౌట్‌గా ఉన్నాడు. పతిరాణ వేసిన ఆఖరి ఓవర్‌లో రెండో బంతికి కృష్ణప్ప గౌతమ్ (1) రహానెకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరగానే వర్షం మొదలైంది. దీంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. తర్వాత వర్షం ఎక్కువై మ్యాచ్‌ నిర్వహణ సాధ్యం కాకపోవడంతో రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. 
 
బౌలింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై తొలుత చెన్నై స్పిన్నర్లు చెలరేగిపోయారు. కైల్ మేయర్స్ (10)ని నాలుగో ఓవర్‌లో మొయిన్‌ అలీ ఔట్‌ చేయగా.. ఆరో ఓవర్‌లో మహీశ్ తీక్షణ వరుస బంతుల్లో మనన్‌ వోహ్రా (10), కృనాల్ పాండ్య (0)లను పెవిలియన్‌కు పంపాడు. తర్వాత ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టాయినిస్‌ (6)ను జడేజా అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. కరన్‌ శర్మ (9) మొయిన్ అలీకి రిటర్న్‌ క్యాచ్‌ ఇవ్వడంతో లక్నో 10 ఓవర్లకు 44/5 స్కోరుతో నిలిచి కష్టాల్లో పడింది.
 
అనంతరం క్రీజులోకి వచ్చిన నికోలస్‌ పూరన్‌, ఆయుష్‌ బదోని నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. 15వ ఓవర్‌ నుంచి బదోని దూకుడు పెంచాడు. తీక్షణ వేసిన ఆ ఓవర్‌లో బదోని సిక్స్‌ బాదాడు. మ్యాచ్‌లో నమోదైన తొలి సిక్సర్‌ అదే కావడం విశేషం. తీక్షణ వేసిన 17వ ఓవర్‌లో బదోని ఓ సిక్స్, ఫోర్‌ రాబట్టాడు. 
 
మరోవైపు, నెమ్మదిగా ఆడుతున్న నికోలస్‌ పూరన్‌.. పతిరాణ వేసిన 18 ఓవర్‌లో మొయిన్‌ అలీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీపక్ చాహర్‌ వేసిన 19 ఓవర్‌లో బదోని రెచ్చిపోయాడు. వరసగా ఫోర్‌, సిక్స్‌ బాది 30 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ ఓవర్‌లో చివరి బంతిని కూడా నేరుగా బౌండరీ అవతలికి పంపి మొత్తం 20 పరుగులు రాబట్టాడు. చెన్నై బౌలర్లలో మొయిన్‌ అలీ, పతిరాణ, తీక్షణ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జడేజా ఒక వికెట్ తీశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా చివరి ఐపీఎల్‌ అంటూ మీరు నిర్ణయించుకున్నారు.. నేను కాదు.. ధోనీ