కాసుల వర్షం కురిపించే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి)- లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జి) జట్ల మధ్య సోమవారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, లక్నో మెంటార్ గౌతమ్ గంభీర్‌ల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.
ఈ క్రమంలో విరాట్ కోహ్లీ- గంభీర్‌ల మధ్య పరుష పదజాలం, సైగలతో వార్, కోహ్లీ రివ్యూకు గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేయడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరిద్దరి మధ్య వైరం ఈనాటిది కాదు. ఇక, తాజా వివాదానికి వస్తే, గత నెలలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు-లక్నో మధ్య మ్యాచ్ జరిగింది.
ఆ మ్యాచ్‌లో బెంగళూరును ఓడించిన తర్వాత లక్నో మెంటార్ అయిన గంభీర్ క్రేజీ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. బెంగళూరు ప్రేక్షకుల వైపు చూస్తూ నోటికి తాళాలు వేసుకోమన్నట్టుగా పెదవులపై వేలిని ఉంచాడు. దీనిని కోహ్లీ మనసులో పెట్టుకున్నాడు. నిన్న లక్నోను సొంతగడ్డపై ఓడంచిన కోహ్లీ.. గంభీర్‌పై ప్రతీకారం తీర్చుకున్నాడు.
లక్నో ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ బౌలింగులో కృనాల్ పాండ్యా అవుటయ్యాడు. కృనాల్ క్యాచ్‌ను అందుకున్న కోహ్లీ.. ప్రేక్షకుల వైపు తిరిగి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. అంతేకాకుండా వికెట్ పడిన ప్రతిసారీ రెచ్చిపోయి సంబరాలు చేసుకున్నాడు.
మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలో గంభీర్ వద్దకెళ్లిన కోహ్లీ వాగ్వివాదానికి దిగాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆర్సీబీ ఆటగాళ్లు కోహ్లీని సముదాయించి అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. దీంతో కోహ్లీ కోపంగానే అక్కడి నుంచి వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.