Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆస్ట్రేలియన్లను కంగారుపెట్టి.. కివీస్ చేతిలో చతికిలపడ్డారు...

ఆస్ట్రేలియన్లను కంగారుపెట్టి.. కివీస్ చేతిలో చతికిలపడ్డారు...
, గురువారం, 24 జూన్ 2021 (08:09 IST)
ప్రపంచంలోనే మేటి జట్టుగా ఉన్న ఆస్ట్రేలియాను భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సేన కంగారు పెట్టింది. కానీ, న్యూజిలాండ్ వద్దకు వచ్చేసరికి చతికిలపడింది. రోహిత్ శర్మ, పుజారా, విరాట్‌ కోహ్లీ, రహానె వంటి ప్రపంచ అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌ ఉన్నప్పటికీ.. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ఐసీసీ వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూటీసీ) ఫైనల్లో చేతులేత్తేసింది. 
 
గత ఆస్ట్రేలియా పర్యటనలో మేటి బ్యాట్స్‌మెన్‌, బౌలర్లు లేకుండానే కంగారూలను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన భారత్‌ ఇప్పుడు ప్రముఖ ఆటగాళ్లు ఉండి కూడా ‘ఫైనల్లో’ ఓటమి చవిచూసింది. రెండేళ్ల పాటు సాగిన ఈ చాంపియన్‌షి్‌పలో 520 పాయింట్లతో అగ్రభాగాన నిలవడం ద్వారా ఫైనల్‌కు సగర్వంగా అడుగుపెట్టిన కోహ్లీసేన కీలక సమరంలో అదే ప్రదర్శన చేయడంలో విఫలమైంది. 
 
దీనికితోడు రెండురోజులు పూర్తిగా వర్షార్పణమైనా.. మ్యాచ్‌ను కోల్పోవడం ద్వారా అవమానకర ఓటమిని ఎదుర్కొంది. మరో సెషన్‌పాటు ప్రధాన బ్యాట్స్‌మెన్‌ ఓపిగ్గా, తెలివిగా ఆడివుంటే మ్యాచ్‌ ఖచ్చితంగా డ్రా గా ముగిసేది. కానీ కివీస్‌ బౌలర్లు స్వింగ్‌, బౌన్స్‌తోపాటు మన అగ్రగామి బ్యాట్స్‌మెన్‌ వికెట్ల ఆవలిగా వేసే బంతులను ఆడలేని బలహీనతను సొమ్ము చేసుకొని దెబ్బ కొట్టారు. తమ జట్టు తొలిసారి ఐసీసీ ట్రోఫీ అందుకోవడంలో కీలక భూమిక పోషించారు.
 
మరీ ముఖ్యంగా ఆఫ్‌స్టంప్‌ ఆవలిగా వేసే బంతులను వేటాడి అవుటవడం లేదంటే వాటిని సరిగా ఆడలేకపోయే కోహ్లీ బలహీనతను బాగా కివీస్ బౌలర్ జేమిసన్ బాగా సద్వినియోగం చేసుకుని విజయం సాధించాడు. ఆఫ్‌స్టంప్‌ ఆవలిగా వేసిన బంతితోనే పుజరా వికెట్‌ కూడా పడగొట్టాడు. ఇక ఓవర్‌ ద వికెట్‌తో లెగ్‌స్టంప్‌ ఆవలిగా బౌల్ట్‌ సంధించిన బంతిని ఫ్లిక్‌ చేయబోయి రహానె వికెట్‌ పారేసుకున్నాడు. 
 
ఆదుకుంటాడనుకున్న పంత్‌ కూడా అనసరంగా భారీషాట్‌ కొట్టబోయి వికెట్‌ సమర్పించుకున్నాడు. మొత్తంగా కివీస్‌ పేసర్ల తెలివైన బౌలింగ్‌ను మన బ్యాట్స్‌మెన్‌ అంతే తెలివిగా ఆడలేక ఔట్‌కావడం గమనార్హం. భారత బౌలర్ల విషయానికొస్తే.. ప్రత్యర్థి లోయరార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ను త్వరగా అవుట్‌ చేయలేకపోవడం మినహా మ్యాచ్‌లో తమ పాత్ర సమర్థంగా నిర్వర్తించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చేతులెత్తేసిన కోహ్లీ సేన... వరల్డ్ టెస్ట్ టైటిల్ కివీస్‌దే