ఐసీసీ మహిళల ట్వంటీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా గురువారం ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుతో భారత క్రికెట్ జట్టు తలపడనుంది. ఇప్పటివరకు లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి టీ20 వరల్డ్‌కప్ సెమీఫైనల్‌కు దూసుకొచ్చిన భారత మహిళల జట్టు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది.
గురువారం జరిగే తొలి సెమీఫైనల్లో పటిష్ట ఇంగ్లండ్ జట్టుతో హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. సిడ్నీ గ్రౌండ్‌లో ఉదయం 9.30 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. భారత జట్టు అన్ని విభాగాల్లో బలంగా ఉంది.
యువ ఓపెనర్ షెఫాలీ వర్మ భీకరమైన ఫామ్‌లో ఉండడం జట్టుకు ప్లస్ పాయింట్. అలాగే, జెమీమా రోడ్రిగ్స్ కూడా బాధ్యతాయుతంగా ఆడుతోంది. బౌలర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు. స్పిన్నర్లు, పేసర్లు అద్భుతంగా రాణిస్తూ గ్రూప్ దశలో జట్టుకు విజయాలు కట్టబెట్టారు.
సెమీస్‌లోనూ అదే జోరు కొనసాగిస్తే తొలిసారి ఫైనల్ చేరడం పెద్ద కష్టమేం కాకపోవచ్చు. అయితే, సీనియర్ ప్లేయర్ల స్మృతి మంధాన, హర్మన్, వేదా కృష్ణ, ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఫామ్ అందుకోవాల్సి ఉంది.