ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ టోర్నీలో భాగంగా భారత్ తొలిసారి టెస్ట్ సిరీస్ ఓటమిని చవిచూసింది. పైగా, గత దశాబ్దకాలంలో టెస్ట్ సిరీస్‌లో వైట్ వాష్ కావడం ఇదే తొలిసారి. ఇలాంటి చెత్త రికార్డు గతంలో నమోదు కాలేదు. మరోవైపు, ఈ వైట్ వాష్ తర్వాత ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు పాయింట్ల పట్టికలో ఏకంగా మూడో స్థానానికి ఎకబాకింది. కివీస్ ఖాతాలో 180 పాయింట్లు చేరాయి. అలాగే, భారత్ మాత్రం తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ప్రస్తుతం టీమిండియా ఖాతాలో 360 పాయింట్లు ఉండగా, రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా 64 పాయింట్లు భారత్ కంటే తక్కువగా ఉన్నాయి.
కాగా, న్యూజిలాండ్ జట్టు 60 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండేది. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో 80 పాయింట్లను రాబట్టుకుంది. ఇపుడు భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ ద్వారా 60 పాయింట్లను సంపాదించుకోవడంతో కివీస్ ఖాతాలో 180 పాయింట్లు చేరాయి. ఫలితంగా ఏకంగా మూడు స్థానాలు ఎగబాకింది.