Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అతిగా ఆలోచించి.. చేతులెత్తేశారు.. ఓటమిపై విరాట్ కోహ్లీ

webdunia
, సోమవారం, 2 మార్చి 2020 (19:23 IST)
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు ఆడిన రెండు టెస్ట్ మ్యాచ్‌లలో చిత్తుగా ఓడింది. భారత ఆటగాళ్ల బ్యాటింగ్ వైఫల్యంతో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఘోరంగా ఓడిపోయింది. తద్వారా టీమిండియా ఓ చెత్త రికార్డును మూట గట్టుకుంది. ఎనిమిదేళ్ల తర్వాత టెస్టుల్లో భారత్ వైట్‌వాష్‌ను తన ఖాతాలో వేసుకుంది. 2012లో ఆస్ట్రేలియా చేతిలో 0-4తో చిత్తుగా ఓడిన తర్వాత సుదీర్ఘ ఫార్మాట్లో వైట్‌వాష్‌ అవడం ఇదే మొదటిసారి. అలాగే, విరాట్‌ కోహ్లీ కూడా టెస్టు కెప్టెన్‌గా తొలిసారి వైట్‌వాష్‌ ఓటమి రుచి చూశాడు. 
 
ఈ ఓటమిపై కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. కివీస్‌లో పరిస్థితుల గురించి అతిగా ఆలోచించి బ్యాట్స్‌మెన్‌ తప్పు చేశారని అన్నాడు. తమ ఆలోచనల్లో సంఘర్షణ వల్లే సిరీస్‌లో ఓడిపోయామని అన్నాడు. ఇక్కడ ఎలా ఆడాలో బ్యాట్స్‌మెన్‌కు ఓ క్లారిటీ లేకపోవడం తమను దెబ్బకొట్టిందని అన్నాడు.
 
గతంలో ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో బాగా ఆడామని గుర్తుచేశాడు. అప్పుడు తామంతా ఓ స్పష్టమైన ఆలోచనా దృక్పథంతో ఉన్నామన్నాడు. ఈ సిరీస్‌లో అది లోపించిందన్నాడు. టెస్టులు ఆడుతున్నప్పుడు ప్రతి రోజు, ప్రతి సెషన్‌, ప్రతి పరిస్థితిలో సానుకూలంగా ఆలోచించాల్సి ఉంటుందని అన్నాడు. 
 
కానీ, తమ బ్యాటింగ్ విభాగం మొత్తం ఫెయిలైందని, తొలి టెస్టు తొలి రోజు నుంచే పరిస్థితుల గురించి ఎక్కువగా ఆలోచించి తప్పు చేశామని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఈ ఓటమి తమకు ఓ పాఠం లాంటిదన్నాడు. సిరీస్‌లో చేసిన తప్పిదాలను సమీక్షించుకొని.. వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటామని తెలిపాడు.
 
కాగా, భారత్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను ఆతిథ్య న్యూజిలాండ్‌ 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. రెండో టెస్టులో భారత్‌ నిర్ధేశించిన 132 పరుగుల లక్ష్య సాధనలో బరిలోకి దిగిన కివీస్‌.. 36 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి, 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 
 
లక్ష్యం చిన్నదైనప్పటికీ.. కివీస్‌ ఓపెనర్లు తేలికగా తీసుకోలేదు. ఓపికగా ఆడుతూ.. స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ, వీలు చిక్కిప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఓపెనర్లు టామ్‌ లాథమ్‌( 74 బంతుల్లో 52: 10 ఫోర్లు), టామ్‌ బ్లండెల్‌(113 బంతుల్లో 55: 8 ఫోర్లు, 1 సిక్సర్‌) అర్ధసెంచరీలతో చెలరేగి, జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 103 పరుగులు జోడించారు. 
 
దూకుడుగా ఆడిన లాథమ్‌.. ఉమేష్‌ వేసిన బంతిని ఫ్లిక్‌ చేయబోయి, కీపర్‌ పంత్‌కు దొరికిపోయాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ కేన్‌.. ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. 5 పరుగులకే అతడిని బుమ్రా పెవిలియన్‌ పంపించాడు. 
 
అప్పటికే కివీస్‌ విజయం ఖాయమవడంతో.. అతడు నింపాదిగా పెవిలియన్‌కు చేరుకున్నాడు. రాస్‌టేలర్‌(5 నాటౌట్‌), హెన్రీ నికోల్స్‌(5 నాటౌట్‌) లాంఛనాన్ని పూర్తి చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు తీయగా, ఉమేష్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. 
 
అంతకు ముందు ఓవర్‌నైట్‌ 96-6తో మూడో రోజు ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇండియా.. కేవలం 8 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేసి.. 28పరుగులు మాత్రమే జోడించి, మిగితా వికెట్లను చేజార్చుకుంది. కివీస్‌ బౌలర్ల ధాటికి భారత బ్యాట్స్‌మెన్‌ క్రీజులో నిలవడానికి ఆపసోపాలు పడ్డారు. కివీస్‌ బౌలర్లలో బౌల్ట్‌ 4 వికెట్లతో చెలరేగగా.. సౌథీ 3 వికెట్లు పడగొట్టాడు. 
 
గ్రాండ్‌హోమ్‌, వాగ్నర్‌ తలో వికెట్‌ తీశారు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టి, మ్యాచ్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన కైల్‌ జెమీసన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. 14 వికెట్లు పడగొట్టిన కివీస్‌ బౌలర్‌ టిమ్‌ సౌథీ ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐసీసీ టెస్ట్ ఛాంపియన్... పాయింట్ల పట్టికలో భారత్ స్థానమేంటి?