టీమిండియా ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా తండ్రి హిమాన్షు పాండ్యా ఇకలేరు. శనివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం సయ్యద్ ముస్తాఖ్ అలీ ట్రోఫీలో ఆడుతున్న కృనాల్ పాండ్యా బయో బబుల్‌ను వీడి ఇంటికి చేరుకున్నాడు. హార్దిక్ పాండ్యా.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ముగిశాక స్వదేశానికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో పాండ్యా సోదరులకు పితృవియోగం తప్పలేదు.
పాండ్యా సోదరులను క్రికెటర్లుగా చేయడంలో వారి తల్లిదండ్రుల పాత్ర ఎంతగానో ఉంది. పాండ్యా సోదరుల తండ్రి కూడా కొడుకులను క్రికెటర్లుగా చేయడానికి చాలానే కష్టపడ్డారు. సూరత్ లో కార్ ఫైనాన్స్ వ్యాపారం చేసే హిమాన్షు.. తన కుమారుల కెరీర్ కోసం ఆ వ్యాపారాన్ని వదిలేసి వడోదరకు మార్చారు. టీమిండియా మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరె క్రికెట్ అకాడమీలో ఇద్దరినీ చేర్పించి శిక్షణ ఇప్పించారు.
హిమాన్షు మరణంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేశాడు. ఆయనతో రెండుమూడు సార్లు మాట్లాడానని, ఎప్పుడూ ఎంతో సంతోషంగా ఉండేవారని అన్నాడు కోహ్లీ. జీవితంలో అన్నీ సాధించిన భావన ఆయనలో కనిపించేదని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.