తమ కుమార్తె ప్రేమను వ్యతిరేకించిన ఇంటి యజమానిని కుటుంబ సభ్యులంతా కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బోదాన్ జిల్లా వాజిర్‌గంజ్ ఏరియాలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వాజిర్‌గంజ్ ఏరియా హత్రా గ్రామానికి చెందిన అమిర్ అనే వ్యక్తికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తె అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయం తెలుసుకున్న తండ్రి.. కుమార్తెను నిలదీశాడు. ఇటువంటి పనులు చేసి, గ్రామాంలో తనకు తలవంపులు తీసుకురావద్దని చెప్పాడు.
అంతే... ఆ కుటుంబంలో గొడవ చెలరేగాయి. కుమార్తె ప్రేమను వ్యతిరేకించిన కన్నతండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఆయనను ఆసుపత్రిలో చేర్పించగా, 30 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అయితే, అప్పటికే కుటుంబ సభ్యులు పారిపోయారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.