పుత్రోత్సాహం అనేది మనకు తెలిసిందే. ఐతే ఇపుడు తండ్రులు పుత్రికోత్సాహంతో నిండిపోతున్నారు. సహజంగా అమ్మాయిలు ఇంట్లో పనులు చేసేందుకే అనే వాదన వుండేది. దాన్ని నేటితరం మహిళలు చెరిపేస్తున్నారు. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ కన్నవారు గర్వపడేలా ముందుకు సాగుతున్నారు.
తాజాగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చిన్న కుమార్తె అంజలి బిర్లా ఐఏఎస్‌కు సెలెక్ట్ అయ్యారు. భారత పరిపాలనా సేవకు ఆమె ఎంపికయ్యారు అని తెలిసిన వెంటనే సోమవారం కోటశక్తిగర్ నివాసంలో పండుగ వాతావరణం ఏర్పడింది. తన విజయాల పరంపరలో అక్క ఆకాంక్ష బిర్లాకు అంజలి బిర్లా ఘనత ఇచ్చింది. పరిపాలనా సేవలో చేరిన తరువాత, మహిళా సాధికారత రంగంలో పని చేయాలని ఆమె కోరుకుంటుంది.
ఈ శుభవార్త వచ్చిన వెంటనే, కుటుంబ సభ్యులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా భార్య అమితా బిర్లా కూడా తన కుమార్తె సాధించిన విజయాలపై సంతోషం వ్యక్తం చేశారు. మొదటి నుండి భిన్నంగా ఏదైనా చేయాలని తాను నిశ్చయించుకున్నాననీ, మొదటిసారే ఐఎఎస్ పరీక్షకు ఎంపికైనందుకు ఆనందంగా వుందన్నారు అంజలి.
అదే సమయంలో శరద్ పవార్ కుమార్తె, ఎన్‌సిపి ఎంపి సుప్రియా సులే కూడా ట్వీట్ చేసి అంజిలి బిర్లా విజయం సాధించినందుకు అభినందించారు.
డ్యూటీలో కుమార్తెకి సెల్యూట్ చేసిన తండ్రి
పోలీసు డిపార్ట్‌మెంట్‌లో తన ఉన్నతాధికారికి సెల్యూట్ చెయ్యటం మామూలు విషయం. కానీ ఇక్కడ ఆ ఉన్నతాధికారి తన గారాలపట్టి అయితే? ఆ తండ్రి చేసే సెల్యూట్ లో ఆనందంతోపాటు ప్రేమ - గర్వం రెండూ కలగలిపి ఆ పోలీసు అధికారి కంట్లో కనిపించింది.
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత ఏపి పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా తిరుపతిలో నిర్వహిస్తున్న మొట్ట మొదటి పోలీస్ డ్యూటీ మీట్ 2021కి 'ఇగ్నైట్ అని పేరు పెట్టారు. ఇలా కూతురికి తండ్రి సెల్యూట్ చేస్తున్న అరుదైన దృశ్యానికి "ఇగ్నైట్" వేదికయ్యింది.
2018 బ్యాచ్‌కి చెందిన జెస్సి ప్రశాంతి గుంటూరు అర్బన్ సౌత్ డిఎస్పి చార్జ్ తీసుకున్నారు. ప్రస్తుతం తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్లో "దిశ" విభాగంలో భాద్యతలు నిర్వహిస్తున్నారు జెస్సి ప్రశాంతి. తిరుపతి కళ్యాణి డ్యామ్‌లో పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో సర్కిల్ ఇంస్పెక్టర్‌గా పని చేస్తున్నారు శామ్ సుందర్.
తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్లో డ్యూటిలో ఉన్న తన కూతురిని చూస్తూ మురిసిపోయారు శామ్. తన కూతురు తనకంటే పెద్ద ర్యాంకులో తన కంటి ముందు ఉన్నతాధికారులతో మాట్లాడుతూ.. డ్యూటీ చేస్తుండటం దూరం నుండి చూస్తూ ఆనందంగా దగ్గరకెళ్ళి నమస్తే మేడం అంటూ సెల్యూట్ చేశారు.
తను కూడా వెంటనే సెల్యూట్ చేసి 'ఏంటి నాన్నా...' అంటూ గట్టిగా నవ్వేశారు. పిల్లలు ప్రయోజకులు అయినప్పుడు తండ్రికి ఇంతకంటే సంతోషం మరొకటి ఉండదు, నా బిడ్డ నీతి నిజాయితీగా ప్రజలకి సేవచేస్తుందని నాకు నమ్మకం ఉందని అన్నారు సిఐ శామ్ నుందర్.
పోలీస్ తండ్రి పోలీస్ కూతురిని చూసి స్పందించిన తిరుపతి ఎస్పి రమేష్ రెడ్డి "ఇలాంటి సన్నివేశం సహజంగా నినిమాలో చూస్తుంటాం. తిరుపతి డ్యూటీ మీట్లో తండ్రీకూతురు ఇలా యూనీఫామ్ ధరించి ప్రజాసేవ చెయ్యటం నాకు వ్యక్తిగతంగా చాలా గర్వంగా ఉంది ఆల్ ది బెస్ట్ ప్రశాంతి" అని డిఎస్పి ప్రశాంతిని అభినందించారు ఎస్పి.