శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 276 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 49.1 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించి సత్తా చాటింది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో ధావన్ సేన లంకపై మూడు వికెట్ల తేడాతో గెలిచింది.
శ్రీలంకపై రెండో వన్డే విజయం తర్వాత టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ డ్రెస్సింగ్ రూంలోఆటగాళ్లకు దిశానిర్దేశం చేశాడు. ఈ విజయం చాలా గొప్పదని.. మ్యాచ్‌లో అందరు మంచి ప్రదర్శన కనబరిచారని తెలిపాడు. ద్రావిడ్ ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్ వైరల్‌గా మారింది. ద్రావిడ్ వ్యాఖ్యలను బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసుకుంది.
ద్రావిడ్ మాట్లాడుతూ.. ''వాళ్లు ఈ మ్యాచ్‌లో బాగా ఆడారు.. కానీ సరైన సమయంలో మనం ఒక చాంపియన్ టీమ్‌లా ఆడాం. ఓటమి కోరల్లో నుంచి బయటపడేందుకు దృడ సంకల్పంతో గోడకు కొట్టిన బంతిలా తిరిగి ఫుంజుకున్నాం. ఇది గొప్ప విజయం.. వెల్‌డన్ బాయ్స్. ఒక దశలో ఒత్తిడి లోనైన నేను మ్యాచ్ ఎటు పోతుందో అర్థం చేసుకోలేకపోయా. కానీ ఈ విజయం మనకు ఇంకో పది మ్యాచ్‌ల వరకు మంచి బూస్టప్ ఇస్తుంది. ఇక ఒత్తిడిని తట్టుకుంటూ చాహర్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి భువనేశ్వర్ సహకరించిన తీరు కూడా బాగుంది. దీనిని ఇలాగే కంటిన్యూ చేద్దాం" అంటూ చెప్పుకొచ్చాడు.
అంతకుముందు టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ కాస్త ఆందోళన చెందినట్టు కనిపించింది. వెంటనే డ్రస్సింగ్ రూమ్ నుంచి డగౌట్‌కు చేరుకున్నాడు. బ్యాటింగ్ చేస్తున్న దీపక్ చహర్‌కు తమ్ముడు రాహుల్ చహర్‌తో సందేశం పంపించాడు. అప్పటికే 3 వికెట్లు తీసిన లెగ్‌స్పిన్నర్ హసరంగ ప్రమాదకరంగా బౌలింగ్ చేస్తున్నాడు. దాంతో అతడి బౌలింగ్‌లో షాట్లు ఆడొద్దని ద్రావిడ్ సూచించాడు.
47వ ఓవర్లో దీపక్‌కు తిమ్మిర్లు రావడంతో ఫిజియోతో పాటు రాహుల్ చహర్ అక్కడికి చేరుకొన్నాడు. ద్రవిడ్ సందేశాన్ని తన సోదరుడికి అందించాడు. ఆ తర్వాత హసరంగ వేసిన రెండు ఓవర్లలో భారత్ షాట్లు ఆడలేదు. మిగతా వారి బౌలింగ్‌లో పరుగులు రాబట్టి విజయం సాధించింది.