భారత క్రికెట్ సీనియర్ క్రికెటర్ ఛతేశ్వర్ పూజారా అన్ని ఫార్మెట్లకు సంబంధించిన క్రికెట్ ఆటకు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల భారత క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన రిటైర్మెంట్‌పై పోస్టు పెట్టాడు. 'నయా వాల్‌గా పేరొందిన పుజారా భారత్ తరపున ఎన్నో విలువైన ఇన్నింగ్స్ ఆడి, జట్టుకు అమూల్యమైన విజయాలను అందించిన విషయం తెల్సిందే.
'భారత జెర్సీ ధరించడం, జాతీయ గీతం ఆలపించడం, జట్టు కోసం నా వంతు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించడం.. ఇవన్నీ కేవలం మాటల్లో చెప్పలేని అనుభవాలు. అయితే ఎప్పుడైనా సరే ఇలాంటి మంచి విషయాలకు ముగింపు పలకాల్సిందే. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నా. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రాజ్‌కోట్ పట్టణం నుంచి కుటుంబతో కలిసి వచ్చిన ఓ కుర్రాడు.. భారత క్రికెట్‌లోకి అడుగు పెట్టాలనే కలను నెరవేర్చుకున్నాడు. ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఎంతో అనుభవం సాధించా. నా రాష్ట్రం, దేశం కోసం ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తా.
ఈ సందర్భంగా బీసీసీఐ, సౌరాష్ట్ర క్రికెట్ అసోషియేషన్‌కు కృతజ్ఞతలు. క్రికెట్ కెరీర్ ఎదుగుదలకు తోడ్పాటు అందించారు. ఫ్రాంచైజీ, కౌంటీ క్రికెట్ ప్రతినిధులకూ ధన్యవాదాలు. నా మెంటార్లు, కోచ్‌లు, ఆధ్యాత్మిక గురు.. ఇలా ప్రతి ఒక్కరూ నా ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారు. సహచర క్రికెటర్లు, సపోర్ట్ స్టాఫ్, నెట్ బౌలర్లు, అనలిస్టులు, లాజిస్టిక్‌లు, అంపైర్లు, గ్రౌండ్ స్టాఫ్, స్కోరర్లు, మీడియా పర్సనల్, స్పాన్సర్లు, పార్టనర్స్, మేనేజ్మెంట్ సహకారం మరువలేనిది. కుటుంబ సభ్యులు, నా భార్య పూజ, నా కుమార్తె అదితి, స్నేహితులు.. ఇలా ప్రతి ఒక్కరూ కీలక పాత్ర పోషించారు. ఇక నుంచి మరింత సమయం నా కుటుంబానికి వెచ్చించేందుకు ప్రయత్నిస్తా' అని పుజారా వెల్లడించాడు.
కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లోకి 2010లో అడుగుపెట్టిన పుజారా 103 టెస్టులు ఆడాడు. మూడు డబుల్ సెంచరీలు, 19 సెంచరీలు, 35 అర్థ సెంచరీల సాయంతో 7195 పరుగులు చేశారు. కేవలం ఐదు వన్డేలే ఆడిన ఛతేశ్వర్ 51 పరుగులు చేశాడు. గత 2023లో ఆస్ట్రేలియాలో చివరిసారిగా భారత్ జట్టు తరపున టెస్ట్ మ్యాచ్ ఆడాడు.