ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. మొత్తం 336 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇరు జట్లూ 1-1తో సమంగా ఉన్నాయి. ఈ మ్యాచ్ కెప్టెన్ శుభమన్ గిల్ ముందుండి నడిపించాడు.
రెండు ఇన్నింగ్స్‌లలో వరుసగా డబుల్ సెంచరీ, సెంచరీ బాది జట్టుకు భారీ స్కోరు అందించడంలో కీలకపాత్ర పోషించాడు. బౌలింగ్‌లో యువ పేసర్ ఆకాశ్ దీప్ అద్భుతం చేశాడు. మ్యాచ్ మొత్తంలో 10 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. అతనికి తోడుగా మహమ్మద్ సిరాజ్ 7 వికెట్లతో రాణించాడు.
ఎడ్జ్ బాస్టన్ మైదానంలో టెస్టు క్రికెట్‌లో భారత్‌కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. దీంతో 58 యేళ్ళ భారత నిరీక్షణకు తెరపడింది. ఇదిలావుంటే, అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ రేటింగ్‌లో అంటే పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా, శ్రీలంక, ఇంగ్లండ్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
తాజా విజయంతో భారత్ నాలుగో స్థానానికి ఎగబాకింది. కాగా, ఈ మ్యాచ్ అనతరం జట్టు కెప్టెన్ శుభమన్ గిల్ స్పందిస్తూ, జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా బౌలర్లు అద్భుతంగా రాణించారని ప్రశంసించాడు. "ఆకాశ్ దీప్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.
కొత్త బంతితో రెండు వైపులా స్వింగ్ చేస్తూ ఇంగ్లండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. అతని బౌలింగ్ అమోఘం" అని గిల్ కొనియాడాడు. ఫీల్డింగ్, బౌలింగ్ జట్టు ఎంతో మెరుగుపడిందని అన్నాడు.