ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు ఆతిథ్య జట్టుతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో విజయభేరీ మోగించింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి భారత పేసర్ ఆకాశ్ దీప్ ఏకంగా పది వికెట్లు నేలకూల్చాడు.
తొలి ఇన్నింగ్స్‌లో (4/88), రెండో ఇన్నింగ్స్‌లో (6/99) ప్రదర్శన చేసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇంగ్లండ్‌లో అతడికిది తొలి టెస్టు మ్యాచ్ కావడం విశేషం. మ్యాచ్ తర్వాత ఆకాశ్ దీప్ విలేకరులతో మాట్లాడుతూ, తన ప్రదర్శనను కేన్సర్‌తో బాధపడుతున్న సోదరికి అంకితమిస్తున్నట్లు తెలిపాడు.
'నా సోదరికి కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. గత రెండు నెలలు చాలా కష్టంగా గడిచాయి. నేను ఈ మ్యాచ్‌ను ఆమెకు అంకితం ఇస్తున్నా. ఆమె చిరునవ్వును చూడాలనుకుంటున్నాను. నేను బౌలింగ్ చేయడానికి పరిగెత్తిన ప్రతిసారీ ఆమె ముఖాన్ని నా మనస్సులో చూసుకున్నాను' ఆకాశ్ దీప్ పేర్కొన్నాడు.
మరోవైపు, రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 407 పరుగులకు ఆలౌట్ అయింది. సిరాజ్ 6, ఆకాశ్ 4 వికెట్లు పడగొట్టారు. షోయబ్ బషీర్‌ను ఔట్ చేసి సిరాజ్ ఆరో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. అయితే, ఈ వికెట్ పడగొట్టడానికి ముందు ఆకాశష్‌కు ఐదు వికెట్ల ఘనత సాధించే అవకాశముంది.
దీంతో ఐదో వికెట్ తీసే ఛాన్స్ ఇస్తానని ఆకాశ్‌తో చెప్పినట్టు సిరాజ్ తెలిపాడు. అందుకు ఆకాశ్.. 'వద్దు భయ్యా.. నువ్వు వికెట్ తీసుకో.. ఒకవేళ నాకు రాసిపెట్టి ఉంటే ఆ వికెట్ నాకే దక్కుతుంది' అని అని పేర్కొన్నాడట. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో ఆకాశ్ ఐదు వికెట్ల కల నెరవేరింది.