Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

58 యేళ్ళ నిరీక్షణకు తెరదించిన భారత్.. ఇంగ్లండ్‌పై చారిత్రక విజయం

Advertiesment
Gill

ఠాగూర్

, ఆదివారం, 6 జులై 2025 (22:31 IST)
ఎట్టకేలకు 58 యేళ్ల నిరీక్షణకు భారత్ తెరదించింది. ఇంగ్లండ్‌పై చారిత్రక విజయం సాధించింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. అదీ కూడా 336 పరుగుల భారీ స్కోరు తేడాతో విజయభేరీ మోగించింది ఫలితంగా ఎడ్జ్‌బాస్టన్ గడ్డపై భారత్ 58 యేళ్ల తర్వాత తొలిసారి గెలుపు రుచిచూసింది. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లలో కెప్టెన్ శుభమన్ గిల్ సెంచరీతో కదంతొక్కి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే, భారత పేసర్ ఆకాశ్ దీఫ్ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి ఏకంగా 10 వికెట్లు పడగొట్టాడు. 
 
మొత్తం 608 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్, భారత బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది. ముఖ్యంగా యువ పేసర్ ఆకాశ్ దీప్ నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లీష్ బ్యాటింగ్ ఆర్డరు కుప్పకూల్చాడు. రెండో ఇన్నింగ్స్‌లో 99 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తమ్మీద ఆకాశ్ దీప్ ఈ మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్ దీప్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీయడం తెలిసిందే. ఇంగ్లండ్ జట్టులో వికెట్ కీపర్ జేమీ స్మిత్ (88) ఒంటరి పోరాటం చేసినప్పటికీ, మిగతా బ్యాటర్లు విఫలమవడంతో ఆ జట్టు 68.1 ఓవర్లలో 271 పరుగులకే ఆలౌట్ అయింది.
 
ఈ మ్యాచ్ ఆద్యంతం భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా, కెప్టెన్ శుభ్ మన్ గిల్ (269) డబుల్ సెంచరీతో పాటు రవీంద్ర జడేజా (89), యశస్వి జైస్వాల్ (87) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ హ్యారీ బ్రూక్ (158), జేమీ స్మిత్ (184) శతకాలతో పోరాడినప్పటికీ, మహ్మద్ సిరాజ్ (6/70) విజృంభణతో 407 పరుగులకు పరిమితమైంది.
 
తొలి ఇన్నింగ్స్ 180 పరుగుల ఆధిక్యం సాధించిన భారత్, రెండో ఇన్నింగ్స్‌ను 427/6 వద్ద డిక్లేర్ చేసింది. ఈ ఇన్నింగ్స్‌లోనూ కెప్టెన్ గిల్ (161) అద్భుత శతకంతో కదం తొక్కగా, పంత్ (65), జడేజా (69 నాటౌట్) రాణించారు. బౌలింగ్ లో ఆకాశ్ దీప్ మ్యాచ్ మొత్తంలో 10 వికెట్లు, సిరాజ్ 7 వికెట్లతో సత్తా చాటారు. తొలి టెస్ట్ ఓటమి తర్వాత కీలక బౌలర్ బుమ్రా లేకుండా ఇంతటి చారిత్రక విజయం సాధించడం గిల్ సేన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఇక కెప్టెన్‌గా గిల్‌కు ఇదే తొలి టెస్ట్ విజయం కావడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ - బంగ్లాదేశ్ క్రికెట్ వన్డే సిరీస్ వాయిదా