మహిళా జట్టు తమ ఖాతాలో క్రికెట్ తొలి ప్రపంచ కప్ వేసుకునేందుకు అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్... ఇలా అన్నింటిలోనూ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారు. మరీ ముఖ్యంగా జట్టుకు పంటి కింద రాయిలా మారిన వోల్వోర్డ్ కొట్టిన భారీ షాట్ బంతిని అద్భుతమైన క్యాచ్ పట్టిన అమన్ జ్యోత్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. బంతి చేజారిపోతున్నా... దాన్ని ఒంటి చేత్తో వడిసిపట్టుకుని ప్రపంచ కప్ విజయానికి ఆమె కారణమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారత మహిళా జట్టు తొలి ప్రపంచ కప్: రోహిత్ శర్మ ఎమోషనల్
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ భావోద్వేగానికి లోనయ్యాడు. భారత మహిళా జట్టు తమ తొలి ప్రపంచ కప్‌ను గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించింది. నవీ ముంబైలోని డాక్టర్ డి.వై. పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ను చూడటానికి భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా వచ్చారు. భారత విజయం తర్వాత, స్టేడియం అంతటా సంబరాల వాతావరణం నెలకొంది. విజయం తర్వాత, కెమెరాలు స్టాండ్స్‌లో కూర్చున్న రోహిత్ శర్మపై దృష్టి సారించాయి. మైదానంలో మహిళా జట్టు సభ్యులు విజయోత్సవంలో మునిగిపోయి వుండగా కెమెరాలు రోహిత్ ముఖంపై జూమ్ చేశాయి. స్టేడియంలోని బాణసంచా పేలుళ్ల మధ్య, మాజీ భారత కెప్టెన్ ఒకింత భావోద్వేగానికి లోనైనట్లు కనిపించింది. స్టేడియంలో అభిమానుల్లో చాలామంది ఉద్వేగానికి లోనైనట్లు కెమేరాల్లో కనబడుతున్నాయి.