వన్డే క్రికెట్ మ్యాచ్‌లకు మరో కొత్త నిబంధనను అమలు చేయాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భావిస్తుంది. మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో ఒకే బంతిని వాడాలని ఐసీసీ తాజాగా ప్రతిపాదించింది. అయితే, దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం వన్డే మ్యాచ్‌లో ఒక్కో ఎండోకు రెండు బంతులు చొప్పున నాలుగు కొత్త బంతులు వాడుతున్నారు. మ్యాచ్‌లో 25 ఓవర్ల తర్వాత బంతిని మారుస్తున్నారు. గతంలో మ్యాచ్ మొత్తం ఒకే బంతిని ఉపయోగించేవారు. దీనివల్ల బంతి పాతబడిన కొద్దీ బౌలర్లకు మరింత పట్టు లభించేది.
రివర్స్ స్వింగ్‌తో పాటు స్పిన్నర్లకు కూడా బంతి అనుకూలించేది. ఈ రూల్ మార్చేశాక బ్యాటర్ల ఆధిపత్యం మొదలైంది. తాజాగా దీనికి అడ్డుకట్ట వేసేందుకు సౌరభ్ గంగూలీ నేతృత్వంలోని ఐసీసీ క్రికెట్ కమిటి ఓ కీలక ప్రతిపాదన చేసింది. ఒక్కో ఎండ్‌లో కొత్త బంతి కాకుండా ఒక జట్టు ఇన్నింగ్స్ పూర్తయ్యే వరకు ఒకే బంతిని ఉపయోగించాలని సూచించింది. దీనిపై జింబాబ్వేలో జరుగనున్న ఐసీసీ సమావేశాల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.