స్వదేశంలో పర్యాటక ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా, ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ వీర బాదుడు బాదాడు. ఫలితంగా 304 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని భారత్ ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ ఇన్నింగ్స్‌లో 7 సిక్స్‌లు, 12 ఫోర్లు ఉండగా, 90 బంతుల్లో 119 పరుగులు చేశాడు. చాలా రోజుల తర్వాత రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా బ్యాట్‌తో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ, బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేశానంటూ కామెంట్స్ చేశారు.
'ఈ రోజు మ్యాచ్ చాలా బాగనిపించింది. బ్యాటింగును ఎంజాయ్ చేశాను. జట్టు కోసం నిలబడటం, పరుగులు రాబట్టడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నేను చేయాల్సిన పరుగులను భాగాలుగా ఎంచుకొని రాబట్టాను. వన్డేల్లో పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. బ్యాటింగుకు దిగినప్పుడు వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలని నిర్ణయించుకున్నాను. ఇలాంటి పిచ్ బాల్ కొంచెం స్కిడ్ అవుతుంది.
ఇలాంటి తరుణంలోనే బ్యాట్ మధ్యలో బాల్ తగిలేలా ఫుల్ ఫేస్‌లో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రత్యర్థి బౌలర్లు నా శరీరాన్ని లక్ష్యంగా చేసుకొని బౌలింగ్ చేసినప్పుడు నా ప్రణాళికలు అమలు పరిచాను. గిల్, శ్రేయాస్ నాకు మద్దతుగా నిలిచారు. మేము బ్యాటింగును చాలా ఆస్వాదించాం. శుభన్ గిల్ చాలా క్లాసీ ప్లేయర్. నేను తనని దగ్గరి నుంచి చూశాను. పరిస్థితులకు అనుగుణంగా ఆడుతాడు. మిడిల్ ఓవర్లు చాలా కీలకం. ఆ ఓవర్లలో మ్యాచ్ ఎవరైనా గెలిచేందుకు అవకాశం ఉంటుంది.
ఒక వేళ ఆ ఓవర్లను మేనేజ్ చేసుకుంటే డెత్ ఓవర్లలో ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. గత మ్యాచ్‌తో పాటు ఈ మ్యాచ్‌లోనూ మిడిల్ ఓవర్లలో మేము చక్కగా బ్యాటింగ్ చేశాము. వీలైనన్ని ఎక్కువగా పరుగులు రాబట్టాం. ఒకవేళ మిడిల్ ఓవర్లలో వికెట్లు పడితే ప్రత్యర్థిని కట్టడి చేయవచ్చు. మేమంతా జట్టుగా బాగా మెరుగవ్వాలని అనుకున్నాం. ప్లేయర్, జట్టుగా ఇంకా ఉత్తమంగా మెరుగవ్వాలని గత మ్యాచ్ అనంతరం నేను చెప్పాను. బ్యాటర్లు తమ ఆటపై స్పష్టత ఉండి, కెప్టెన్, కోచ్ చెబుతున్న దాని ప్రకారం ప్రదర్శన చేస్తే మ్యాచ్ ఫలితాల గురించే పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు' అని రోహిత్ పేర్కొన్నాడు.