కోవిడ్ మహమ్మారి వంటిది ఒకటి ప్రపంచపైన విరుచుకుపడే అవకాశం వుందని ఆయన 2015లోనే హెచ్చరించాడు. ఆయన భయపడినట్లే కరోనా వైరస్ ప్రపంచం పైన విరుచుకుపడింది. తాజాగా మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మళ్లీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్‌ల కంటే కొత్త వేరియంట్... ఇంకా ఎక్కువ ట్రాన్స్‌మిసివ్, మరింత ప్రాణాంతకం అయినటువంటి వైరస్ వచ్చే ప్రమాదం వుందని హెచ్చరించాడు. పరిస్థితిని ముందుగానే అంచనావేసి దాని నిరోధానికి ప్రపంచ నిఘా పెంచాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
ఫైనాన్షియల్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గేట్స్ ఇలా అన్నాడు,"మరింత తీవ్రమైన వేరియంట్ ఉద్భవించే ప్రమాదం 5% కంటే ఎక్కువగా ఉంది. మనం ఇంకా కరోనా మహమ్మారి వేరియంట్‌ను అడ్డు తొలగించుకునే మార్గాలకోసమే ప్రయత్నిస్తున్నాము. ఐతే దీనికి మించిన మహమ్మారి, మరింత వ్యాప్తి చెందుతుంది, మరింత ప్రాణాంతకం అవుతుంది" అని పేర్కొన్నారు.
మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు భవిష్యత్తులో ముప్పులను అంచనా వేయడానికి, అంతర్జాతీయ సమన్వయాన్ని మెరుగుపరచడానికి ఎపిడెమియాలజిస్ట్‌లు, కంప్యూటర్ మోడలర్‌లను కలిగి ఉన్న అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయవచ్చని సూచించారు.
అలాగే, పరిస్థితిని చాలా ముందుగానే పరిష్కరించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ మరింత పెట్టుబడి పెట్టాలి. పగడ్బందీ చర్యలు తీసుకోనట్లయితే ఆ విషాదాన్ని మనం చూడలేము, అంతేకాదు ప్రపంచ పౌరుల కోసం పెట్టుబడులు పెట్టలేమని కూడా నాకు భయం అనిపిస్తుంది" అని బిల్ గేట్స్ చెప్పారు.