రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని గ్రీన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో సోమవారం కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే పట్టణ ప్రజలతో పాటు ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని పలు గ్రామాల నుంచి ప్రజలు స్వచ్చందంగా కరోనా పరీక్షలు చేయించుకునేందుకు ఫంక్షన్ హాల్‌కి బారులు తీరారు.
ఈ నేపథ్యంలో ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని చిల్కమర్రి గ్రామానికి చెందిన ఓ మహిళ కరోనా పరీక్షల కోసం అక్కడికి చేరుకుంది. క్యూలైన్ పెద్దగా ఉండటంతో చివరి వరకు లైన్లోనే ఉండింది. తన వరకు వచ్చేసరికి కరోనా పరీక్షల కిట్స్ అయిపోయాయని, రేపు రావాలని సిబ్బంది చెప్పడంతో చేసేది లేక ఇంటి ముఖం పట్టింది.
కానీ సాయంత్రానికి ఇంటికి చేరుకున్న ఆ మహిళకు సిబ్బంది నీకు పాజిటివ్ వచ్చిందని చెప్పడంతో బిత్తరపోయిoది. సోమవారం సుమారు రెండు వందల మందికి పైగా కరోనా పరీక్షలు చేయగా సుమారు 48 మందికి పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే 50 మందిలో చిలకమర్రి గ్రామానికి చెందిన మహిళ పేరు ఉండటం సిబ్బంది నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
అసలు ఆ మహిళకు పరీక్షలు నిర్వహించకుండా కరోనా పాజిటివ్ అని ఎలా నిర్ధారించారో ఆ దేవుడికే తెలియాలి. ఇప్పటికే షాద్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా 240 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8 మంది మృతి చెందారు.