బిర్యానీ ఓ ప్రాణాన్ని బలిగొంది. తనకు బిర్యానీ కొనివ్వలేదన్న మనస్తాపంతో భర్తపై అలిగి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన చెన్నై, మహాబలిపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చెంగల్పట్టు జిల్లా మహాబలిపురం సమీపంలోని పూంజేరిలో మనోహరన్, శరణ్య దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 11 ఏళ్ల కుమారుడు, తొమ్మిదేళ్ల కుమార్తె ఉన్నారు.
మహాబలిపురంలోని శిల్ప తయారీ సంస్థలో మనోహరన్ పనిచేస్తున్నాడు. గురువారం తనకు బిర్యానీ తినాలని ఆశగా ఉందని, కొనివ్వమని భార్య అడిగింది. డబ్బు తక్కువగా వుందని.. మళ్లీ కొనిపెడతానని భర్త పని మీద బయటికి వెళ్లాడు.
ఇంతలో మనస్తాపానికి గురైన శరణ్య.. బైకులో వున్న పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో తీవ్రగాయాలైన శరణ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.