గౌరవనీయ కేంద్ర పెట్రోలియం, సహజవాయు మరియు స్టీల్ శాఖామాత్యులు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ నేడు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టోరెంట్ గ్యాస్‌కు చెందిన 42 సీఎన్‌జీ స్టేషన్లు మరియు 3 సిటీ గేట్ స్టేషన్స్ (సీజీఎస్)ను సమాజసేవ కోసం అంకితం చేశారు. ఈ సీఎన్‌జీ స్టేషన్లు ఉత్తర్‌ప్రదేశ్‌లో 14, మహారాష్ట్రలో 8, గుజరాత్‌లో 6, పంజాబ్‌లో 4, రాజస్తాన్ మరియు తెలంగాణాలలో ఐదేసి చొప్పున ఉన్నాయి. సిటీ గేట్ స్టేషన్‌లు ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్‌లలో ఉన్నాయి.
ఈ 42 సీఎన్‌జీ స్టేషన్‌లతో టోరెంట్ గ్యాస్ అతి పెద్ద మైలురాయి అయినటువంటి 100 సీఎన్‌జీ స్టేషన్‌ల మార్కును అతి స్వల్పకాలంలోనే చేరుకుంది. దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 32 జిల్లాల్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) ఏర్పాటుచేసేందుకు అనుమతులను టోరెంట్ గ్యాస్ అందుకోవడంతో పాటుగా తమ సహచర సంస్ధలతో పోలిస్తే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న సీజీడీలలో ఒకటిగా నిలిచింది. అతి త్వరలోనే దేశంలో సీఎన్‌జీ మరియు పీఎన్‌జీ లభ్యంకానటువంటి ఒకే ఒక్క మెట్రో నగరమైన చెన్నైలో వీటిని టోరెంట్ గ్యాస్ అందించనుంది.
సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేటలలో ప్రస్తుతం ఉన్న 11 సీఎన్‌జీ స్టేషన్లు మార్చి 2021 నాటికి 14 చేరనున్నాయి. తద్వారా ఈ మూడు జిల్లాల్లో సీఎన్‌జీ విస్తృతంగా అందుబాటులోకి తీసుకురానుంది. దేశంలో సీఎన్‌జీ స్టేషన్స్ ఏర్పాటు మరియు సీజీడీ మౌలిక వసతులు సృష్టించడాన్ని ప్రత్యేకంగా అభినందించిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, ‘‘టోరెంట్ గ్యాస్ సాధించిన ఈ మైలురాయి ఎంతో విలువైనది. రెండేళ్లలోపుగానే 100సీఎన్‌జీ స్టేషన్స్ మైలురాయి చేరుకోవడం ప్రశంసనీయం.
సహజవాయువును మారుమూల ప్రాంతాలకు సైతం అందించడం ద్వారా వినియోగదారులు స్వచ్ఛమైన మరియు అతి చౌకైన ఇంధనం స్వీకరించడానికి ప్రోత్సాహం కలుగుతుంది. తద్వారా పర్యావరణంపై సానుకూల ప్రభావం కలిగి ప్రజలకు భారీ మొత్తంలో ప్రయోజనమూ చేకూరుతుంది. భారత ప్రభుత్వం దేశంలో సీఎన్‌జీ స్టేషన్‌ల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 3 వేల నుంచి రాబోయే 4 లేదా 5 సంవత్సరాలలో 10 వేలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.
గౌరవనీయ ప్రధానమంత్రి ఆశయాలకు అనుగుణంగా తరువాత తరం గ్యాస్ మౌలికసదుపాయాలను సృష్టించడంలో అత్యంత కీలకమైన పాత్రను సీజీడీ పరిశ్రమ పోషించనుంది. సీజీడీ పరిశ్రమకు మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి భారత ప్రభుత్వం పలు రకాల చర్యలను తీసుకుంటుంది మరియు సామాన్య ప్రజలకు సరసమైన ధర వద్ద గ్యాస్‌ను అందుబాటులో ఉంచుతుంది’’ అని అన్నారు.
గౌరవనీయ మంత్రివర్యులు ఈ సందర్భంగా సీజీడీ కంపెనీలు సమగ్రమైన ఇంధన రిటైలర్లగా మారడంతో పాటుగా తమ సేవలను మరియు చెల్లింపు వ్యవస్థను డిజిటలీకరణ చేయాల్సిందిగా సూచించారు. రాబోయే రోజులలో వినియోగదారుల ఇంటి ముంగిటనే ఇంధనం డెలివరీ చేసే అవకాశాలను చూడాల్సి ఉందన్నారు. ఇంధన రంగంలో డిజిటలీకరణ ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో పాటుగా దిగుమతులపై ఆధారపడటం కూడా తగ్గి ఆత్మనిర్భర్ భారత్‌కు మార్గం ఏర్పడుతుందన్నారు.
ఈ సందర్భంగా శ్రీ జినాల్ మెహతా, డైరెక్టర్, టోరెంట్ గ్యాస్ మాట్లాడుతూ, ‘‘దేశంలో విస్తృతస్థాయిలో సీఎన్‌జీ, పీఎన్‌జీ అందుబాటులో ఉంచేందుకు టోరెంట్ గ్యాస్ కట్టుబడి ఉంది. తద్వారా భారత ప్రభుత్వ లక్ష్యమైన సహజవాయువు వాటాను ప్రస్తుతమున్న 6.2%నుంచి 2030 నాటికి 15%కు వృద్ధి చేయనుంది. ఈ ప్రాంతాలో సామాజిక–ఆర్ధికాభివృద్ధికి సహజవాయు లభ్యత తోడ్పడనుందని అంచనా. టోరెంట్ గ్యాస్ 8వేల కోట్ల రూపాయలను రాబోయే ఐదేళ్లకాలంలో పెట్టుబడి పెట్టడం ద్వారా దేశంలో సీజీడీ మౌలిక వసతులను సృష్టించనుంది.
ఇప్పటికే దీనిలో 1050 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టింది. మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ అతి స్వల్పకాలంలోనే 100కు పైగా సీఎన్‌జీ స్టేషన్లను టోరెంట్ గ్యాస్ ఏర్పాటుచేసింది. మార్చి 2021 నాటికి 200 సీఎన్‌జీ స్టేషన్లను ఏర్పాటుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అలాగే 2023 నాటికి 500 సీఎన్‌జీ స్టేషన్‌లను ఏర్పాటుచేయనున్నాం’’ అని అన్నారు.