ఆదాయన్ను రిటర్న్స్ దాఖలు కోసం కేంద్ర ఆర్థిక శాఖ సరికొత్త పోర్టల్‌ను తీసుకొచ్చింది. అయితే, ఈ పోర్టల్‌లో అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. వీటిని పరిష్కరించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఫలితంగా ఈ సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేసిన ఇన్ఫోసిస్‌పై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ మేరకు వివరణ కోరుతూ ఇన్ఫోసిస్ ఎండీ, సీఈవో సలీల్ పరేఖ్‌కు ఆదివారం నోటీసులు జారీ చేసింది. జూన్ 7న కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ పోర్టల్ (www.incometax.gov.in)ను ప్రారంభించారు. అయితే రెండున్నర నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకూ ఇందులో ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉంది. దీనిపై సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది ట్యాక్స్ పేయర్లు ఫిర్యాదు చేశారు.
వీటిని పరిష్కరించాల్సిందిగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. ఇన్ఫోసిస్‌ను కోరారు. ఈ పోర్టల్‌ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా చేయాలని ఆదేశించారు. యూజర్లకు పని సులువు చేయడానికి ఈ కొత్త పోర్టల్ తీసుకొచ్చినా.. ఇందులోని అవాంతరాలను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉన్నదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
మరోవైపు, యూజర్లకు ఎదురవుతున్న సాంకేతిక సమస్యలపై ఇన్ఫోసిస్ స్పందించింది. దీనిపై తాము పని చేస్తున్నామని, సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని వెల్లడించింది. గత వారం వ్యవధిలో కొన్ని సమస్యలను పరిష్కరించినట్లు తెలిపింది. పోర్టల్‌లో ఇప్పటి వరకూ లక్ష ఐటీ రిటర్న్స్ దాఖలైనట్లు సంస్థ వెల్లడించింది.