ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు తేరుకోలేని షాకిచ్చింది. వాన్‌పిక్ ప్రాజెక్టు వ్యవహారంలో మనీలాండరింగ్ అంశంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరే (ఈడీ) ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. సెప్టెంబర్ 22న విచారణకు హాజరుకావాలని జగన్‌ను ఆదేశించింది.
అలాగే, ఈ కేసులో సహ నిందితులైన రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యే మోపిదేవి వెంకటరమణ, ఐఆర్‌టీఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డి, పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్, నిమ్మగడ్డ ప్రకాష్, ఐఏఎస్ అధికారులు శామ్యూల్, మన్మోహన్ సింగ్, జగతి పబ్లికేషన్స్ సహా 12 కంపెనీలకు సీబీఐ కోర్టు సమన్లు పంపింది.
వాన్‌పిక్ వ్యవహారంలో చేతులు మారిన సొమ్ముపై మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈడీ విచారణ జరిపింది. వివిధ కంపెనీల ద్వారా సొమ్ము చలామణి అయినట్లు ఈడీ గుర్తించింది.
కాగా ఈ కేసులో జగన్, నిమ్మగడ్డ ప్రసాద్ సంస్థలకు చెందిన సుమారు రూ.863 కోట్ల ఆస్తులను 2016లోనే ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది. జగన్ కంపెనీలకు చెందిన సుమారు రూ.538 కోట్ల విలువైన ఆస్తులతో పాటు వాన్‌పిక్ భూములు సహా నిమ్మగడ్డ కంపెనీలకు చెందిన రూ.325 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే.