Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

World Snake Day : పాములు పగబడతాయా, నాగస్వరం విని నాట్యం చేస్తాయా? పాముల గురించి తెలుసుకోవాల్సిన తొమ్మిది విషయాలు

Snake
, మంగళవారం, 19 జులై 2022 (17:10 IST)
లక్షల ఏళ్ల నుంచి భూమ్మీద నివసిస్తున్న అతి పురాతనమైన సరీసృపాల్లో పాములు కూడా ఒకటి. ప్రతి ఏటా జులై 16వ తేదీని వరల్డ్ స్నేక్స్ డేగా జరుపుకుంటారు. పాముల గురించి మనలో ఉన్న అపోహలు ఏంటి? వాటి గురించిన వాస్తవాలేంటి? పాములు నాదస్వరాన్ని విని నిజంగానే నృత్యం చేస్తాయా? పాములు పగబడతాయా? పాము కరిస్తే ఏం చెయ్యాలి? ఏం చెయ్యకూడదు తొమ్మిది కీలక విషయాలు తెలుసుకుందాం.

 
1.పాములు ఎలా వింటాయి
ఎవరైనా చిన్న చిన్న శబ్దాలు కూడా వినగలిగితే వాళ్లకు పాము చెవులున్నాయని అంటుంటారు. దీనర్ధం పాములకు చెవులున్నాయని కాదు. నిజానికి పాముకి బయటికి కనిపించేలా చెవులుండవు. కానీ వాటి శరీరంలో చెవులకు సంబంధించిన నిర్మాణాలు మాత్రం ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. అయితే మానవులకు ఉండేలా వాటికి చెవులు లేకపోవడంతో అవి నేరుగా శబ్దాలను వినలేవు. కేవలం వాటి వైబ్రేషన్లు మాత్రం సున్నితంగా గ్రహించగలవు. మనిషి చెవిలో మూడు భాగాలుంటాయి. బయటకు కనిపించే భాగాన్ని బాహ్య చెవి అంటారు. ఇక కర్ణభేరి వెనుక ఉండే దానిని మధ్య చెవి అంటారు. ఇందులో మాలియస్‌, ఇన్‌కస్‌, స్టేపిస్‌ అనే మూడు చిన్న ఎముకలుంటాయి. మన శరీరంలో అతిచిన్న ఎముక కూడా ఇదే.

 
ఈ స్టేపిస్‌ వెనకాల మొత్తని మృదులాస్థితో లోపలి చెవి నిర్మాణం ఉంటుంది. దీనినుండి బయలుదేరిన శ్రవణనాడి మెదడుకు అనుసంధానమై ఉంటుంది. కర్ణభేరిని తాకి శబ్ద తరంగాలను ఈ శ్రవణనాడి మెదడుకు చేరవేస్తుంది. దీంతో మనం ఆ శబ్దాన్ని వినగలుగుతాము. కానీ పాము చెవి నిర్మాణం ఇందుకు భిన్నంగా ఉంటుంది. పాముకి బాహ్య చెవి ఉండదు. కానీ మిగిలిన రెండు భాగాలూ ఉంటాయి. ఇక కర్ణభేరి అనే నిర్మాణం కూడా పాము చెవుల్లో ఉండదు. కాబట్టి అది నేరుగా శబ్దాలను వినలేదు.

 
కానీ వెలుపలి చెవులు అదృశ్యమైన చోట కర్ణభేరీ రంధ్రం ఉంటుంది. అది మధ్య చెవి నుంచి లోపలికి దారి తీస్తుంది. మధ్య చెవిలో 'కాలుమెల్లా ఆరిస్‌' అనే ఒక సున్నితమైన ఎముక ఉంటుంది. ఇది ఒకవైపు లోపలి చెవికి కలిపి ఉండగా, మరో వైపు దాని దవడ కింద చర్మానికి కలిసి ఉంటుంది. పాము చర్మం నేలను తాకి ఉండడం వల్ల నేలలో ప్రయాణించే ధ్వని తరంగాలను ఈ కర్ణస్తంభిక ఎముక నిర్మాణం గ్రహించి చెవికి చేరుతుంది. అంటే పాములు నేలలో వచ్చే తరంగాలను (వైబ్రేషన్లను) మాత్రమే గ్రహించగలుగుతాయి. అయితే పాములు మనం వినే శబ్దాల్లో అతి తక్కువ భాగం మాత్రమే వినగలుగుతాయి.

 
రాయల్ పైథాన్ వంటి పాములు 80 నుంచి 160 హెర్జ్‌ల పౌన:పున్యాలను వినగలవు. మానవుని చెవులు మాత్రం 20 హెర్జ్‌ల నుంచి 20 వేల హెర్జ్‌ల వరకూ పౌన:పున్యాలను వినగలవని ఆంధ్రాయూనివర్సిటీలో జువాలజీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న మంజులత తెలిపారు. అందుకే సున్నితమైన శబ్దాల్ని వినగలిగే సామర్థ్యం ఉన్న వాళ్లను పాము చెవులు ఉన్న వాళ్లని పిలుస్తారని ఆమె అన్నారు.

 
2. నాగస్వరానికి అవి ఎందుకు నాట్యం చేస్తాయి?
వాస్తవంగా అయితే పాములు గాలిలో శబ్ద తరంగాలను గ్రహించలేవు. అంటే నాగస్వరం నుంచి వచ్చే శబ్దానికి పాములు స్పందించవు. కానీ సినిమాల్లో, ఇతర మాధ్యమాల్లో పాములు నాగస్వరాన్ని ఊదేటప్పుడు అవి వాటికి అనుగుణంగా నాట్యం చేసినట్లు కనిపించడానికి కారణం వేరే ఉంది. "నిజానికి పాముల వాళ్ళు నాగస్వరం ఊదేటప్పుడు నేల మీద చేతితో తడుతూ శబ్దం చేస్తారు. నేల ద్వారా ఆ వైబ్రేషన్లు పాము శరీరానికి చేరుతాయి. దీంతో అది వాటికి స్పందించి పడగ విప్పుతుంది. అయితే పాము కళ్ల ముందు నాగస్వరాన్ని కూడా అటూ ఇటూ కదుపుతూ ఊదుతూ ఉంటారు. దీంతో ఆ పాము కళ్లతో చూసి, ఆ కదిలే వస్తువు ఆగగానే.. దాన్ని కాటు వేయాలని అది కదులుతున్న దిశలో అటూ ఇటూ కదులుతుంది. కానీ చూసేవాళ్లకు మాత్రం పాము నాగస్వరానికి నాట్యం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది" అని మంజులత బీబీసీతో చెప్పారు.

 
"నిజానికి ఆ సమయంలో నాదస్వరానికి బదులుగా చేతిని అటూ ఇటూ ఆడించినా... పాము తన పడగను ఆడిస్తుంది. ఇక పామును ఆడించాలంటే నాగస్వరమే ఉండనక్కర్లేదు, కేవలం మనం నేలపై చేసే వైబ్రేషన్లు దాన్ని చేరి అది పడగ విప్పితే చాలు. ఆ తర్వాత దాని ముందు ఏ వస్తువును అటూ ఇటూ కదిపినా అది తలాడిస్తుంది" అని ఆమె అన్నారు.

 
3. నాలుకతో వాసన చూస్తాయి...
పాములు తమ కళ్లతో రెండు రంగుల్ని మాత్రమే చూడగలుగుతాయి. కానీ పాములు రెప్పవేయవు. ఎందుకంటే వాటికి కనురెప్పలు ఉండవు. కానీ వాటిపై 'ఐక్యాప్' అని పిలిచే కళ్లద్దాళ్లాంటి ఒక పొర ఉంటుంది. పాము కుబుసం విడిచినప్పుడు రెండు కళ్లపై ఉన్నఈ పొర కూడా ఊడి వచ్చేస్తుంది. దాని స్థానంలో అప్పటికే మరో కొత్త పొర ముందే సిద్ధమై ఉంటుంది. పాములకు తల భాగంలో ఇన్‌ఫ్రా రెడ్ సెన్సిటివ్ రిసెప్టర్లు ఉంటాయి. వాస్తవానికి పాములు శీతల రక్త జీవులు(కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్). ఈ రిసెప్టర్ల సాయంతోనే అవి ఎలుకలు, ఇతర చిన్న చిన్న కీటకాలను గుర్తిస్తాయి. ఇక చాలా వరకూ పాముల్లో నాలుక రెండుగా చీలి ఉంటుంది. ఈ నాలుక ద్వారానే అవి ఆహారం ఉన్న దిశను, వాసనను గుర్తిస్తాయి.

 
4. పాములు పగ బడతాయా?
పాములు పగబడతాయని చాలా మంది అనుకుంటారు. ఇదే అంశాన్ని ఇతివృత్తంగా చేసుకుని చాలా సినిమాలు కూడా వచ్చాయి. నిజానికి పాములకు జ్ఞాపకశక్తి చాలా తక్కువ. అవి ఒక వ్యక్తిని లేదా ఒక జీవిని గుర్తు పెట్టుకుని దాడి చేయడం ఉండదు. మిగిలిన జీవుల మాదిరిగానే పాములు కూడా ఆహారం కోసమో, సంతానోత్పత్తి కోసమో ఇతర జీవులపై దాడి చేస్తాయి. సాధారణంగా పాములు ఆహారం కోసం వేటాడేటప్పుడు వాసన గుర్తు పెట్టుకుంటాయి. అంతే తప్ప దాడి చేయాల్సిన జీవి రూపాన్ని గుర్తుపెట్టుకోవు. నిజానికి చాలా వరకూ పాములు పుట్ట నుంచి బయటకొచ్చి తిరిగి తమ పుట్ట ఎక్కడ ఉందన్నది కూడా మర్చిపోతాయని వెటర్నరీ వైద్యులు చెప్తున్నారు.

 
మనుషులను గుర్తుపెట్టుకుని దాడిచేసేంత జ్ఞాపక శక్తి పాములకు ఉండదు. ఒక వ్యక్తిపై పాములు పలు మార్లు దాడి చేసి కాటువేయడం యాధృచ్ఛికమే కావచ్చు. నిజానికి పాములు ఎప్పుడూ కావాలని మనుషుల మీద దాడి చేయవు. అవి ఎదురైనప్పుడు వాటికి దూరంగా వెళ్లిపోతే అవి కూడా వాటి దారిలో వెళ్లిపోతాయి. కానీ, తమకు ప్రమాదం కలుగుతుందన్న భావన కలిగిస్తే అవి ప్రాణ రక్షణ కోసం బుసలు కొడతాయి, లేదా కాటు వేస్తాయి. అంతే తప్ప... పాములు పగబట్టి ప్రాణాలు తీస్తాయన్నది కేవలం మూఢ నమ్మకం అంటున్నారు శాస్త్రవేత్తలు.

 
5. పాముల గురించి వింత సంగతులు...
పాములు తమ ఆహారాన్ని నమలేవు. కొరకలేవు. అందుకే అవి తమ ఆహారాన్ని నేరుగా మింగేస్తాయి. తమ తలకంటే పెద్ద పరిమాణం ఉన్న జంతువుల్ని కూడా మింగేయగలవు. వీటి దవడల నిర్మాణం అందుకు అనువుగా ఉంటుంది. ఐర్లాండ్, ఐస్‌ల్యాండ్, న్యూజీలాండ్ దీవుల్లో పాములు కనిపించవు. వాటి మనుగడకు అనువైన వాతావరణం లేకపోవడంతో అక్కడ పాములు ఉండవని జీవ శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇక అంటార్కిటికా ఖండంలో, హిమాలయాల్లో కూడా పాములు కనిపించవు. కొన్ని పాములు నీటి అడుగున నివసిస్తాయి. అవి తమ చర్మం ద్వారా శ్వాసిస్తాయి. నిజానికి పాము, ముంగిసలు జన్మత: శత్రువులు కావు. అయితే ఒకదానికొకటి ఎదురైనప్పుడు ఆత్మరక్షణార్థం అవి ఒకదానితో ఒకటి తలపడతాయి. అంతేకాదు.. పాములు పాలు తాగవు. వాటి నోటి నిర్మాణం పాలు తాగేందుకు అనువుగా ఉండదు.

 
కొన్నిదేశాల్లో పాముల్ని తింటారు. వాటి రక్తాన్ని లిక్కర్లో కలుపుకుని తాగుతారు. చైనా వంటి ఆసియా దేశాల్లో స్నేక్ వైన్ కూడా తయారు చేస్తారు. కొన్ని దేశాల్లో రోజుల వయసున్న పాముల్ని తెచ్చి పెంచుకుంటారని, ఇలా జాగ్రత్తగా పెంచుకుంటే అవి 40 ఏళ్ల వరకూ జీవిస్తాయని ప్రొఫెసర్ మంజులత చెప్పారు. పాము విషానికి కూడా చాలా ఔషధ గుణాలుంటాయని అన్నారు. యాంటీవీనమ్ వీటి నుంచే తయారు చేస్తారని, వీటితో పాటు, పెయిన్స్, క్యాన్సర్, ఆర్థరైటీస్, స్ట్రోక్స్, హార్ట్ డిసీజ్, హిమోఫిలియా, హైపర్ టెన్షన్ వంటి ఆరోగ్య సమస్యలను నివారించడానికి, శస్త్రచికిత్స సమయంలో రక్తస్రావం జరగకుండా నిరోధించడానికి అవసరమైన ఔషధాల్ని కూడా పాము విషంతో తయారు చేస్తారని ప్రొఫెసర్ మంజులత తెలిపారు.

 
6. పాము కాటు వేస్తే ఏం జరుగుతుంది?
పాము కాటు సమస్య భారత్‌తో పాటు చాలా దేశాల్లో తీవ్రంగా ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనేజేషన్ అంచనా ప్రకారం ఏటా 50 లక్షల మంది పాము కాట్లకు గురవుతున్నారు. పాము కాట్ల వల్ల మరణాలతో పాటు, అంధత్వం, అవయవాలను తొలగించడం వంటి వాటి బారిన పడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ, పేద జనాభాకు పాము కాట్ల ప్రమాదం ఎక్కువ. పాము కాటు విరుగుడు, ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం, నాటు చికిత్సలపై ఆధారపడటం దీనికి ప్రధాన కారణం. పాము కాటు వల్ల జరిగే నష్టాలను నివారించడానికి సాధ్యమైనంత వేగంగా యాంటీవీనమ్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ పాము కాట్లు ఎక్కువగా ఉండే దేశాల్లో యాంటీ వీనమ్ ఉత్పత్తి చేసే సదుపాయాలే లేవు.

 
పాములన్నీ కాటేస్తాయి. కానీ కాటేసే పాములన్నీ విషపూరితం కాదు. కొన్నిసార్లు విషసర్పాలు కాటు వేసినా విషం ఎక్కదు. కొన్ని పాములు ఆహారం తీసుకున్న నాలుగైదు గంటల వరకు విషం విడుదలవ్వదు. అలాంటప్పుడు ఆ పాము కాటు వేస్తే విషం ఎక్కదు. పాముల్ని సాధారణంగా రెండు రకాలుగా వర్గీకరించారు. ఒక రకం పాముల్లో కోరలు పటిష్టంగా ఉంటాయి. అవి నాడీ మండలం, శ్వాస వ్యవస్థలపై దుష్ప్రభావం చూపే న్యూరోటాక్సిక్ వీనమ్ కలిగి ఉంటాయి. ఇంకో జాతి పాముల్లో ముడుచుకునే కోరలుంటాయి. ఇవి తమ కోరలను తాము వేటాడేటపుడు, దాడి చేసేటపుడు ఉపయోగిస్తాయి. ఈ తరహా పాముల విషం.. మామూలుగా చర్మ కణజాలాన్ని ధ్వంసం చేసి, అంతర్గత రక్తస్రావం కలిగిస్తుంది.

 
పాము కాటు వేస్తే ఏం చేయాలి, ఏం చేయకూడదు?
 
చేయాల్సినవి
ఎవరినైనా పాము కాటు వేసినపుడు ఈ చర్యలు చేపట్టాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
పాము కాటు వేసిందని ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండి, తక్షణమే వైద్య చికిత్స పొందాలి.
శరీరంలో కాటు ప్రభావిత ప్రాంతాన్ని సాధ్యమైనంత మేరకు కదిలించకుండా ఉంచాలి. నగలు, వాచీల వంటి వాటిని తొలగించాలి.
దుస్తులను వదులు చేయాలి.. కానీ విప్పేయవద్దు.

 
చేయకూడనివి
పాము కాటు ప్రాంతం నుంచి విషాన్ని నోటితో లాగివేయటం
పాము కాటు ప్రాంతాన్ని కోసివేసి విషాన్ని తొలగించటం లేదా రక్తస్రావం జరిగేలా చేయటం
పాము కాటు గాయానికి ఐస్, వేడి లేదా రసాయనాల వంటి పూతలు పూయటం
పాము కాటు వ్యక్తిని వదిలి వెళ్లటం
కాటు వేసిన ప్రాంతం నుంచి రక్తప్రసరణను నిలిపివేస్తూ కట్టుకట్టటం వంటివి చేయరాదు. అలా చేయటం వల్ల విషం వ్యాపించకుండా ఆగదు. పైగా వాపు మరింత విషమించటానికి, ఆ అవయవం తొలగించాల్సిన పరిస్థితికి దారితీయవచ్చు.

 
విషపూరితమైన పామును పట్టుకోవటానికి ప్రయత్నించకుండా ఉండటం కూడా ముఖ్యం. చనిపోయిన పాములతో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పామును చంపేసిన కొంతసేపటి వరకూ దాని నాడీ మండలం క్రియాశీలంగానే ఉండొచ్చు.. దానివల్ల అది కాటు వేయవచ్చు.

 
7. అత్యంత ప్రమాదకరమైన విష సర్పాలు ఇవే
భూమి మీద సంచరించే పాములన్నిటిలోకీ, ఆస్ట్రేలియాలో కనిపించే ఇన్‌లాండ్ తాయ్‌పాన్ పాము అత్యంత విషపూరితమైనది. ఒక్క కాటుతో వంది మందిని చంపగలిగేంత విషపూరితమైనది ఈ పాము అని చెబుతారు. అయితే.. ఈ జాతి పాము కాట్ల వల్ల మనుషులు చనిపోయిన దాఖలాలు ఇంతవరకూ లేవు.

 
చాలా భయస్తులు, బిడియస్తులు అయిన ఈ పాములు మారుమూల ప్రాంతాల్లో ఏకాంతంలో జీవిస్తుండటంతో పాటు ఆస్ట్రేలియాలో యాంటీవీనమ్ విస్తృతంగా అందుబాటులో ఉండటం దీనికి కారణం. సముద్ర పాములు కూడా చాలా విషపూరితమైనవి. కానీ అవి మనుషులకు తారసపడటం చాలా అరుదు కాబట్టి, మనుషులు ఈ పాము కాట్లకు గురవటం కూడా అత్యంత అరుదుగా ఉంటుంది.

 
తక్కువ విషపూరితమైనవే అయినా.. బ్లాక్ మాంబా, కోస్టల్ తైపాన్‌ (ఆస్ట్రేలియా) పాముల నుంచి మనుషులకు ఎక్కువ ప్రమాదం ఉంది. ఈ రెండు పాములదీ ఒకే జాతి కుటుంబం. వీటి విషం ఇతర పాముల విషాలకన్నా వేగంగా ప్రభావం చూపుతుంది. అంటే, ఈ పాములు కాటువేసినపుడు తక్షణమే చికిత్స అందించకపోతే అర గంటలోనే మరణం సంభవిస్తుంది. బ్లాక్ మాంబా అని పిలిచే పాము నిజానికి గోదుమ రంగు లేదా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అయితే ఆ పాము నోరు లోపలి రంగు నల్లగా ఉండటం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. సహారాకు దక్షిణంగా ఉండే ఆఫ్రికా దేశాల్లో చాలా చోట్ల ఇది కనిపిస్తుంది. మూడు మీటర్ల పొడవు వరకూ పెరుగుతుంది. ఇక ఇన్‌లాండ్ తాయ్‌పాన్‌తో పోలిస్తే కోస్టల్ తాయ్‌పాన్ చాలా దుందుడుకు స్వభావం గలది.

 
8. ఏ పాముల వల్ల మరణాలు ఎక్కువ?
పాము కాటు కేసులు, మరణాల సంఖ్యల విషయంలో.. చిన్నదిగా కనిపించే పింజరి (సా-స్కేల్డ్ వైపర్) అత్యంత ప్రాణాంతకమైన వాటిలో ఒకటి. పశ్చిమ ఆఫ్రికా మొదలుకుని భారత ఉపఖండం వరకూ చాలా ప్రాంతాల్లో ఇది కనిపిస్తుంది. చీకట్లో ఎక్కువగా కాటు వేస్తుంటుంది. ప్రపంచంలో దాదాపు సగం పాము కాట్లు సంభవిస్తున్నట్లుగా భావించే భారతదేశంలో మనుషుల మరణాలకు అత్యధికంగా కారణమయ్యే నాలుగు రకాల పాముల్లో పింజరి ఒకటి.

 
ప్రమాదకరమైన నాలుగు పాముల్లో మిగతా మూడు ఇవీ...
కట్ల పాము (ఇండియన్ క్రెయిట్): పగటిపూట బెరుకుగా కనిపించే ఈ పాము.. రాత్రిపూట చాలా దూకుడుగా దాడి చేస్తుంది. ఇది 1.75 మీటర్ల (5 అడుగుల 9 అంగుళాల) వరకూ పొడవు ఉంటుంది.

 
రక్త పింజర (రసెల్స్ వైపర్): ఇది మామూలుగా దూకుడు స్వభావమున్న పాము. ఇండియా, దక్షిణాసియా అంతటా విస్తరించి ఉంది. ఎలుకలను ఆహారంగా తీసుకుంటుంది. అందువల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మానవ ఆవాసాల వద్ద తరచుగా కనిపిస్తుంటుంది. ఈ పాము కాటు వల్ల అంతర్గత రక్త స్రావం ఎక్కువై ప్రాణాపాయం సంభవిస్తుంది.

 
నాగు పాము/ తాచు పాము (ఇండియన్ కోబ్రా): నాగు పాము భారత ఉపఖండమంతటా కనిపిస్తుంది. ఆధునిక వైద్య సదుపాయాలు లేని ప్రాంతాల్లో విస్తరించి ఉంది. చీకట్లో ఇది ఎక్కువగా దాడి చేస్తుంది. అంతర్గత రక్తస్రావం కలిగిస్తుంది.

 
కింగ్ కోబ్రా/ రాచనాగు/ కాళింద సర్పం: ఇది పాముల అన్నింట్లోనూ అత్యంత పొడవుగా పెరుగుతుంది. ఇది దాదాపు 20 అడుగులు పెరుగుతుంది. ప్రపంచంలో విషపూరితమైన పాముల్లో ఒక్క కాటులో ఎక్కువ పరిణామంలో విషాన్ని చిమ్మేది కూడా ఈ పామే. ఇది ఒక్కసారి కాటు వేసేటప్పుడే 10 నుంచి 20 మిల్లీ లీటర్ల విషాన్ని చిమ్ముతుంది. దీని విషం నాడీ వ్యవస్థ మీద తీవ్రంగా ప్రభావం చూపుతుంది.

 
9. పాములు అంతరించిపోతే ఏమవుతుంది?
పాములు అంతరించిపోతే జీవసమతుల్యం దెబ్బతింటుంది. ఇప్పటికే చాలా దేశాల్లో పాముల్ని ఆహారం కోసం, వాణిజ్య అవసరాల కోసం వేటాడుతున్నారు. పాముల చర్మంతో తయారు చేసే వస్తువులకు చాలా గిరాకీ ఉంది. దక్షిణ భారత దేశంలో ఇలారు అనే జాతికి చెందిన వారు ఎక్కువగా పాముల్ని పట్టి వాటి చర్మాలను అమ్ముతుంటారు. తమిళనాడులో డాక్టర్ రోములస్ విటకర్ అనే హెప్టాలజిస్ట్ నేతృత్వంలో స్నేక్ కన్జర్వేషన్ కోసం పనిచేస్తున్న సంస్థ వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పాముల్ని పట్టి ఇచ్చిన వారికి డబ్బులిచ్చి, ఆ పాముల నుంచి విషాన్ని సేకరించి, తిరిగి వాటిని అడవిలో వదిలేస్తారు. ఇలా వాటిని సంరక్షిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోలవరం ప్రాజెక్టు గడువును పెంచిన కేంద్రం