Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kerala: NEET పరీక్ష రాయాలంటే అమ్మాయిలు లోదుస్తులు తొలగించాల్సిందేనన్న నిర్వాహకులు.. పోలీసులకు ఓ తండ్రి ఫిర్యాదు

girl
, మంగళవారం, 19 జులై 2022 (16:48 IST)
నీట్ పరీక్ష సందర్భంగా ఆదివారం కేరళ రాష్ట్రం కొల్లాం జిల్లాలోని ఓ పరీక్షా కేంద్రంలో పలువురు విద్యార్థినులను లోదుస్తులు తొలిగించాల్సిందిగా కోరినట్లు ఒక ఉదంతం వెలుగులోకి వచ్చింది. కొల్లాంలోని ఒక విద్యాసంస్థలో పరీక్ష రాసేందుకు విద్యార్థినులు రాగా, లోదుస్తులు తొలిగించిన తర్వాతే మీరు పరీక్షకు హాజరు కాగలరని వారితో నిర్వాహకులు చెప్పారు.

 
కొల్లాం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఒక విద్యార్థిని తండ్రి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన బయటకు వచ్చింది. పరీక్షా కేంద్రంలో ఎదురైన ఈ ఇబ్బందికరమైన సంఘటన కారణంగా తన కూతురు బాగా ఏడ్చిందని, పరీక్షకు ముందు ఆమె గందరగోళ స్థితిని ఎదుర్కొందని ఆయన తెలిపారు. విద్యార్థిని తండ్రి గోపకుమార్ సూరనద్, బీబీసీ హిందీతో ఈ ఘటన గురించి మాట్లాడారు. ''చదివినదంతా మర్చిపోయానని మా అమ్మాయి నాతో చెప్పింది. ఎలాగోలా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాశానంది'' అని తెలిపారు.

 
గోపకుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. ''పరీక్షా కేంద్రంలో లోదుస్తులను తొలిగించాలని నా కూతుర్ని అడిగారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించిన డ్రెస్ కోడ్‌లో ఈ అంశం లేదు. లోదుస్తులు తీసేయడానికి మా అమ్మాయి నిరాకరించగా, ఆమెను పరీక్ష రాయడానికి అనుమతించబోమని చెప్పారు. ఒక గది మొత్తం లోదుస్తులే ఉన్నాయని, అక్కడ చాలా మంది అమ్మాయిలు ఏడుస్తున్నారని నా కూతురు చెప్పింది. చాలామంది అమ్మాయిలు తమ బ్రాలు తొలిగిస్తున్నారని తెలిపింది. నీట్ అనేది ఒక కీలక ప్రవేశ పరీక్ష. ఇలాంటి అసభ్యకరమైన ప్రవర్తన, పిల్లల్ని మానసికంగా కుంగదీస్తుంది'' అని పేర్కొన్నారు.

 
'అవమానకరం'
ఆ విద్యార్థిని అంకుల్ అజిత్ కుమార్ దీని గురించి బీబీసీతో మాట్లాడారు. ''మొదట లోదుస్తులు తొలిగించాలని ఆమెకు చెప్పారు. దీంతో ఆమె ఏడ్చింది. ఆ తర్వాత తనను మరో గదికి తీసుకెళ్లారు. చుట్టుపక్కల ఇతర అబ్బాయిలు, అమ్మాయిలు ఉన్నప్పుడు లోదుస్తులు తొలిగించాల్సిన అవసరమేంటి?'' అని ఆయన ప్రశ్నించారు. కొల్లాం రూరల్ పోలీస్ స్టేషన్ సూపరింటెండెంట్ కార్యాలయానికి చెందిన ఒక అధికారి, బీబీసీతో మాట్లాడుతూ.. ''అమ్మాయి వాంగ్మూలాన్ని రికార్డ్ చేశాం. మాకు అందిన ఫిర్యాదుపై తగిన చర్య తీసుకుంటాం. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తాం'' అని చెప్పారు.

 
ఆ పరీక్షా కేంద్రానికి వచ్చిన ఇతర విద్యార్థినుల తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వస్తున్నారని గోపకుమార్ చెప్పారు. కేరళ సామాజిక న్యాయ వ్యవహారాల మంత్రి ఆర్ బిందు ఈ ఘటనపై స్పందించారు. ''ఇది వ్యక్తి గౌరవానికి అవమానకరం కాబట్టి దీని గురించి కేంద్ర ప్రభుత్వంతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి లేఖ రాస్తాం. ఇలాంటి ఘటనలు విద్యార్థులు మనసుపై, హృదయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు'' అని అన్నారు.

 
ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు...
నీట్ పరీక్ష సందర్భంగా ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. 2017లో కేరళలోని కన్నూర్ జిల్లాలో ఈ తరహా ఘటనే జరిగింది. నలుపు రంగు ప్యాంట్ ధరించినందుకు తనను పరీక్ష రాయకుండా ఆపేశారని అప్పుడు ఓ విద్యార్థిని ఫిర్యాదు చేశారు. తన తల్లితో కలిసి వెంటనే మరో ప్యాంట్ కొనుక్కోవడం కోసం దాదాపు రెండు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లానని ఆమె చెప్పారు. ఆదివారం కావడంతో దుకాణాలన్నీ మూసి ఉన్నాయని, దీంతో పరీక్షా కేంద్రానికి తిరిగి వచ్చినట్లు చెప్పారు.

 
అయితే, ఈసారి ప్రవేశద్వారం వద్ద మెటల్ డిటెక్టర్ నుంచి శబ్ధం రావడంతో తనను మళ్లీ ఆపేశారని, బ్రా హుక్ కారణంగా బీప్ శబ్దం వచ్చిందని తెలిపారు. బ్రాను తొలిగించి దాన్ని తన తల్లికి ఇచ్చిన తర్వాతే తనను పరీక్షకు అనుమతించినట్లు వివరించారు. ఆ తర్వాతి ఏడాది పాలక్కాడ్ జిల్లాలో మరో విద్యార్థినికి ఇదే అనుభవం ఎదురైంది. లోదుస్తులు తొలిగించాలని చెప్పడంతో బ్రా తొలగించిన ఆమె తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత, ఇన్విజిలేటర్ తన ఛాతీనే తదేకంగా చూస్తున్నట్లు గుర్తించిన ఆ అమ్మాయి మరింత అవమానకరంగా ఫీలయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదు.. అది ముగిసి చాప్టర్ : హోం శాఖ