Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వయసులో ఉన్న స్త్రీలు గర్భసంచులను ఎందుకు తీయించుకుంటున్నారు?

Advertiesment
వయసులో ఉన్న స్త్రీలు గర్భసంచులను ఎందుకు తీయించుకుంటున్నారు?
, బుధవారం, 10 జులై 2019 (14:44 IST)
మహిళా కార్మికుల రుతుస్రావానికి సంబంధించి ఇటీవలి కాలంలో రెండు కలవరపరిచే వార్తలు కనిపించాయి. నెలసరిని అపవిత్రంగా భావించే సంప్రదాయం ఈ దేశంలో మొదటి నుంచీ ఉంది. అందుకే నేటికీ నెలసరి సమయంలో సామాజిక, మత సంబంధమైన కార్యక్రమాల్లో మహిళలు పాల్గొనడం కొన్ని వర్గాల్లో నిషిద్ధం. అయితే, గత కొన్నేళ్లుగా ఈ పద్ధతిని ప్రశ్నించే విద్యావంతులైన పట్టణ మహిళల సంఖ్య బాగానే పెరుగుతోంది.

 
కానీ, ఇటీవల పత్రికల్లో వచ్చిన రెండు కథనాలు చదివితే రుతుస్రావంతో సరికొత్త రూపాల్లో మహిళలకు సమస్యాత్మకంగా మారుతున్నట్టు అర్ధమవుతోంది. మెజారిటీ మహిళలు, ముఖ్యంగా చదువుకోని పేద కుటుంబాలకు చెందిన స్త్రీలు నెలసరి ఇబ్బందుల పేరిట తమ ఆరోగ్యం మీద, జీవితాల మీద దీర్ఘకాలిక ప్రభావం చూపగల నిర్ణయాలను తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వస్తోంది.

 
మొదటి వార్త పశ్చిమ మహారాష్ట్రకు సంబంధించింది. అక్కడ గత మూడేళ్ళలో వేలాది మంది ఆపరేషన్ల ద్వారా గర్భసంచులను తీయించుకున్నట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. వారిలో ఎక్కువమంది చెరకు కోత కూలీలుగా పని సంపాదించుకునేందుకే ఈ ఆపరేషన్లు చేయించుకోవడం బాధాకరం. 'షుగర్ బెల్ట్'గా పేరు గాంచిన మహారాష్ట్ర పశ్చిమ జిల్లాల్లో ప్రతి సంవత్సరం ఆరు నెలల పాటు చెరకు కోత కూలీలుగా పని చేసేందుకు బీడ్, ఉస్మానాబాద్, సాంగ్లి, షోలాపూర్ జిల్లాల నుంచి వేలాది మంది వలస వెళతారు. వారిని కాంట్రాక్టర్లు ఎంత దోపిడీ చేయాలో అంతా చేస్తారు.

 
చెరకు కోత చాలా కష్టమైన పని కాబట్టి రుతుస్రావం సమయంలో వారు ఒకట్రెండు రోజులు పనికి రాకపోవచ్చనే కారణంతో అసలు ఆడవాళ్ళను ఆ పనికి తీసుకోవడానికే ఇష్టపడరు. ఒక్క రోజు పనికి రాకపోయినా వారు జరిమానా కట్టాల్సిన పద్ధతి కూడా ఉందక్కడ. కోత పనికి వెళ్లే కుటుంబాలన్నీ చెరకు తోటల దగ్గరే గుడిసెలు, గుడారాల్లో ఉండాల్సి ఉంటుంది. అక్కడ మరుగుదొడ్లు లాంటి సదుపాయాలేమీ ఉండవు. కొన్నిసార్లు రాత్రిపూట కూడా కోత పని ఉంటుంది. దాని వల్ల నిద్రకు నిర్ణీత వేళలంటూ ఉండవు. ఇటువంటి పరిస్థితుల్లో నెలసరి వచ్చినప్పుడు స్త్రీలకు సహజంగానే మరింత దుర్భరంగా ఉంటుంది.
webdunia

 
పారిశుధ్య లోపం వల్ల చాలామంది స్త్రీలకు ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ముఖ్యంగా పునరుత్పత్తి అవయవాలకు సంబంధించిన రుగ్మతల కోసం డాక్టర్ల దగ్గరకు వెళ్తే అది ఎంత చిన్న సమస్య అయినా, మందులతో తగ్గిపోయేదే అయినా అనవసరంగా ఆపరేషన్లు చేసేస్తున్నారని ఆ ప్రాంతంలో పని చేసే సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు.

 
ఈ ప్రాంతంలో మహిళలకు చాలా తొందరగా పెళ్లిళ్లైపోతాయి. పాతికేళ్లు వచ్చేసరికి ఇద్దరు ముగ్గురు పిల్లల తల్లులు కూడా అయిపోతారు. గర్భసంచి తీసేస్తే భవిష్యత్తులో రాగల సమస్యల గురించి డాక్టర్లు వారికి చెప్పరు. అందుకే, 'తీయించేసుకుంటావా?' అని అడిగినపుడు వారు అమాయకంగా ఒప్పుకుంటారు. చివరికి పరిస్థితి ఎలా అయిందంటే ఈ ప్రాంతంలోని అనేక పల్లెలకు 'గర్భసంచుల్లేని స్త్రీలున్న పల్లెలు'గా పేరు వచ్చేసింది.

 
గత నెలలో నీలం గోరె అనే శాసన సభ్యుడు అసెంబ్లీలో ఈ విషయం లేవనెత్తినప్పుడు... ఒక్క బీడ్ జిల్లాలోనే గత మూడేళ్ళలో 4,605 హిస్టరెక్టమీలు (గర్భసంచి ఆపరేషన్లు) జరిగాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఏకనాథ్ షిండే వెల్లడించారు. అయితే, అందరూ చెరకు కోత పని చేసే మహిళలు కారని, కొన్ని కేసులపై దర్యాప్తుకు ఒక కమిటీని నియమించామని మంత్రి తెలిపారు.

 
బీబీసీ ప్రతినిధి ప్రజక్తా ధులప్ ఇటీవల బీడ్ జిల్లాలోని వంజర్వాడి గ్రామాన్ని సందర్శించారు. ఏటా అక్టోబరు నుంచి మార్చి వరకు 80 శాతం మంది గ్రామస్థులు చెరకు తోటల్లో పనులు వెతుక్కుంటూ వలస వెళ్తారని తెలిసింది. ఆ ఊరిలో సగం మంది మహిళలకు ఇప్పటికే గర్భసంచి తొలగించే ఆపరేషన్లు అయ్యాయని, వారందరూ 40 ఏళ్ల లోపు వారేనని, కొందరైతే ఇంకా 20లలోనే ఉన్నారని ప్రజక్తా చెప్పారు. ఆపరేషన్ తర్వాత తమ ఆరోగ్యం బాగా దెబ్బ తిందని చాలామంది మహిళలు చెప్పారు.

 
వీపు, మెడ, మోకాలు భాగాల్లో నిరంతరం నొప్పి ఉంటోందని, రోజూ పొద్దున నిద్ర లేచేసరికి చేతులు, కాళ్లు, ముఖం వాచి ఉంటున్నాయని ఒక మహిళ వాపోయారు. నిరంతరం తల తిరుగుతున్నట్టు ఉంటోందని, చిన్న దూరాలు కూడా నడవలేకపోతున్నానని మరొక మహిళ చెప్పారు.
ఈ సమస్యల ఫలితంగా ఆ ఇద్దరూ పొలం పనులు చేయలేకపోతున్నారు.

 
రెండో వార్త తమిళనాడుకు సంబంధించినది. ఇదీ అంతే ఆందోళనకరమైనది. వస్త్ర పరిశ్రమలో పని చేసే మహిళలు తాము నెలసరి నొప్పి గురించి చెప్పినపుడు సెలవు ఇవ్వడానికి బదులు పేరు తెలియని మందులు ఇచ్చారని చెప్పారు. థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ వందమంది స్త్రీలను ఇంటర్వ్యూ చేసి వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ మందులను వారికి వైద్యులు ఇవ్వలేదు. పని చేసే చోటే ఇచ్చారు. వారంతా పేద బడుగు వర్గాలకు చెందినవారు. నెలసరి నొప్పి కారణంగా ఒకరోజు వేతనం కోల్పోయినా వారికి చాలా ఇబ్బందే.

 
తమకు మందులు ఇచ్చారని ఇంటర్వ్యూలో పాల్గొన్న 100 మంది మహిళలూ చెప్పారు. ఆ మందుల వల్ల తమ ఆరోగ్యం దెబ్బతిందని వారిలో సగం మందికి పైగా చెప్పారు. మందుల పేరు తమకు చెప్పలేదని, వాటివల్ల కలిగే దుష్ప్రభావాల గురించి కూడా తమకు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు చేయలేదని అత్యధికులు చెప్పారు. ఈ మందుల వల్ల తమకు రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చాయని చెప్పారు. కుంగుబాటు, మానసిక ఆందోళన, మూత్ర సంబంధ వ్యాధులు, గర్భాశయంలో గడ్డలు, గర్భస్రావాలు లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు.

 
ఇన్ని వివరాలు వెల్లడవడంతో అధికారులకు చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. మహారాష్ట్ర మహిళల పరిస్థితి 'చాలా దయనీయం, దుర్భరం' అని, ఇలాంటి 'దారుణాలు' పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ డిమాండ్ చేసింది. వస్త్ర పరిశ్రమల్లో పనిచేస్తున్న మహిళల ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుని అవసరమైన చర్యలు తీసుకుంటానని తమిళనాడు ప్రభుత్వం హామీ ఇచ్చింది.

 
లింగ సమానత్వ విధానాలతో కార్మికుల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రపంచమంతటా ప్రయత్నాలు జరుగుతున్న ఈ రోజుల్లో ఈ వార్తలు వెలువడడం నిజంగా ఆందోళనకరం. ఇంకో ఆందోళనకరమైన విషయం ఏమిటంటే 2005-06లో మహిళా శ్రామికుల భాగస్వామ్యం 36 శాతం ఉంటే, అది 2015-16 నాటికి 25.8 శాతానికి పడిపోయింది. మహిళల పని పరిస్థితులను చూస్తే ఈ తగ్గుదలకు కారణాలు అర్ధం చేసుకోవడం కష్టం కాదు.

 
నెలసరి సమయంలో ఒక రోజు సెలవు తీసుకోవడానికి ఇండోనేషియా, జపాన్, దక్షిణ కొరియా, ఇంకా కొన్ని దేశాలు అనుమతిస్తున్నాయి. చాలా ప్రైవేటు సంస్థలు కూడా ఆ వెసులుబాటు ఇస్తున్నాయి. "భారతదేశంలో కూడా 1992 నుంచే బిహార్ ప్రభుత్వం తన మహిళా ఉద్యోగులకు నెలలో రెండు రోజులు ఇందుకోసమే అదనంగా సెలవు ఇస్తోంది. అది మంచి ఫలితాలనే ఇస్తోంది" అని నీతి ఆయోగ్‌లోని భారత ప్రభుత్వ మేధో నిధి విభాగంలో పబ్లిక్ పాలసీ నిపుణురాలిగా పని చేస్తున్న ఊర్వశి ప్రసాద్ చెప్పారు.

 
దేశంలోని ప్రతి మహిళా ఉద్యోగికీ నెలకు రెండు రోజులు సెలవు ఇచ్చే 'నెలసరి ప్రయోజనాల బిల్లు'ను గత ఏడాది ఒక మహిళా సభ్యురాలు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. భారత్ లాంటి విశాల దేశంలో ఏ విధానాన్ని అమలు చేయాలన్నా అనేక సమస్యలు ఉంటాయని ఊర్వశి ప్రసాద్ అన్నారు. మరీ ముఖ్యంగా, మరింత పర్యవేక్షణ అవసరమయ్యే అసంఘటిత రంగంలో వీటిని అమలు చేయడం కష్టతరమని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే సంఘటిత రంగంలో ప్రారంభమంటూ జరిగితే మనుషుల ఆలోచనల్లో మార్పు వచ్చి, నెలసరి చుట్టూ ఉండే అపవిత్ర భావనలు తొలగిపోయేందుకు అది దోహదపడొచ్చని ఆమె అన్నారు.

 
"శక్తిమంతమైన సంఘటిత ప్రైవేటు రంగం, ప్రభుత్వం దీని పట్ల ఒక స్పష్టమైన వైఖరి తీసుకోవడం అవసరం. అలాగే అత్యున్నత స్థానాల్లోని వ్యక్తులు సరైన సంకేతాలు ఇవ్వాలి. ఎక్కడో ఒక చోట మొదలుపెడితే క్రమంగా అసంఘటిత రంగంలోనూ మార్పు రావడాన్ని మనం చూడొచ్చు" అని అన్నారామె.

 
'నెలసరి ప్రయోజనాల బిల్లు' ప్రైవేటు బిల్లు కాబట్టి అది చట్టంగా మారే అవకాశం తక్కువ. కానీ, అది చట్టం అయితే మాత్రం తమిళనాడులోని వస్త్ర పరిశ్రమలో పని చేసే స్త్రీల వంటి వారందరికీ ప్రయోజనం కలుగుతుంది. ఇటువంటి సంక్షేమ చర్యలు అరుదుగా తప్ప దేశంలోని విస్తారమైన అసంఘటిత రంగ సిబ్బంది దాకా చేరుకోవనేది తెలిసిందే. దాని అర్ధం మహారాష్ట్రలోని చెరకు తోటలలో పని చేసే మహిళా సిబ్బంది ఎప్పటికీ కాంట్రాక్టర్ల దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడి బతకాల్సి రావొచ్చు.

 
గీతా పాండే
బీబీసీ ప్రతినిధి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మనిషే పోయాడు.. మనం కూడా తోడులేకపోతే ఎలా? సీఎం జగన్