దేశంలో గర్భాశయ మార్పిడితో తొలి కాన్పు విజయవంతం అయ్యింది. గతేడాది మే నెలలో గర్భాశయ మార్పిడి చేయించుకున్న మహిళకు గురువారం పండంటి ఆడబిడ్డ పుట్టింది. ఈ తరహా కాన్పు దేశంలో ఇదే మొదటిసారి కావడం విశేషం. బిడ్డ సాధారణ ప్రసవం ద్వారా జన్మించిందని.. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని వడోదరకు చెందిన మీనాక్షీ వాలన్ అనే 28 ఏళ్ల మహిళకు గతంలో గర్భస్రావం జరిగి ఆమె గర్భాశయాన్ని తొలగించారు. దీంతో ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేకుండా పోయింది. వైద్యుల సలహా మేరకు మీనాక్షి గర్భాశయ మార్పిడి చేయించుకోవాలని నిశ్చయించుకుంది. దీని కోసం ఆమె తల్లి గర్భాశయం దానం చేశారు.
అనంతరం ఆమె ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ విధానం ద్వారా గర్భం ధరించారు. వరుసగా మూడు సార్లు గర్భస్రావం జరిగిన అనంతరం ఇప్పుడు ఆమెకు ఆడబిడ్డ జన్మించింది.