Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్పీడ్‌ డేట్: ప్రేమికుల రోజుని వ్యతిరేకించే వారికి నిరసనగా మొదలైన ఈ కొత్త ట్రెండ్ ఏంటి?

Love

బిబిసి

, బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (14:32 IST)
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల రోజు జరుపుకుంటారు. అయితే, ఇస్లాం దేశాలతో పాటు భారత్ వంటి దేశాల్లో ఈ ప్రేమికుల రోజుపై వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంటుంది. ప్రేమికుల రోజున పార్కులు, థియేటర్లు, పర్యాటక ప్రదేశాల వంటి చోట్ల కనిపించిన పెళ్లికాని యువ జంటలకు బలవంతంగా వివాహాలు చేయడం, ప్రేమికులపై దాడులు చేయడం వంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి 14ని 'కౌ హగ్' డేగా జరుపుకుంటామంటూ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా కొన్ని నెలల క్రితం ప్రకటించింది. దీనిపై నిరసనలు వెల్లువెత్తడంతో ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది.
 
ఆర్‌ఎస్‌ఎస్‌ విభాగాలైన బజరంగ్ దళ్, హిందూ పీపుల్స్ పార్టీ, హిందూ ఫ్రంట్, ఏబీవీపీ వంటి సంస్థలు ప్రేమికుల దినోత్సవాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే, ఈ టెక్నాలజీ యుగంలో ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తున్న వారికి నిరసనగా, ప్రేమికులకు మద్దతుగా 'స్పీడ్ డేట్స్' వంటి కొత్త ట్రెండ్‌ కూడా నడుస్తోంది. ఇటీవల తమిళనాడులోని ఈరోడ్‌ ప్రాంతంలో ప్రేమికుల రోజుకి వ్యతిరేకంగా కుల సంఘాలు సమావేశం పెట్టి మహిళలతో ప్రతిజ్ఞలు చేయిస్తే, అక్కడికి సమీపంలోని కోయంబత్తూర్‌లో 'స్పీడ్ డేట్' జరిగింది.
 
స్పీడ్ డేట్ అంటే..
ఆధునిక టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లు కొత్త తరహా కార్యక్రమాలను చేపడుతున్నాయి. ప్రేయసీ ప్రియులను దగ్గర చేసేందుకు, సామాజిక సంబంధాలను పెంచుకునేందుకు 'స్పీడ్ డేటింగ్' నిర్వహిస్తున్నారు. ఈ స్పీడ్ డేటింగ్‌లో ఒకరితో మరొకరికి పరిచయం లేని వ్యక్తులు కలిసి మాట్లాడుకుంటారు. ఇద్దరూ కలిసి వారికి నచ్చిన విషయాలను చర్చించుకుంటారు. ఆటలు ఆడుకోవడం, కలిసి తినడం, టీ తాగడం వంటివి చేస్తారు. అలాగే, కొత్త వ్యక్తులతో కలిసి టీ తాగడం (టీ డేట్), కళ్లకు గంతలు కట్టుకుని ఇతరులతో మాట్లాడడం (బ్లైండ్ డేట్), పెయింటింగ్ వంటివి నిర్వహిస్తారు. విదేశాల్లో ఇలాంటివి నిర్వహిస్తూ ఉంటారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఇప్పుడు బెంగళూరు, చెన్నై పుదుచ్చేరి వంటి నగరాలు, పట్టణాల్లో పెద్ద సంఖ్యలో నిర్వహిస్తున్నారు.
 
ఇటీవల కోయంబత్తూర్‌లోనూ ఇదే జరిగింది. మత, కుల వ్యవస్థలను వ్యతిరేకిస్తూ ప్రేమికుల రోజును జరుపుకోవడంపై యువత నుంచి మద్దతు పెరుగుతోంది, అదే సమయంలో వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. ఇదే తరహాలో కేరళలలోనూ ప్రేమికుల రోజు వ్యతిరేకతపై నిరసన వ్యక్తమైంది.
 
కేరళ 'కిస్ ఆఫ్ లవ్' నిరసన
ప్రేమికుల రోజు జరుపుకునే వారిపై మతం పేరుతోనో, కులం పేరుతోనే వ్యతిరేకత చూపుతున్నారని ప్రేమికులు ఆరోపిస్తున్నారు. తమపై ఉన్న అడ్డంకులను ఎదుర్కోవడంతో పాటు ప్రేమను పెంపొందించుకునేందుకు వారు అనేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రత్యేకంగా చెప్పాలంటే, 2014లో కేరళలోని కొచ్చిలో ఫేస్‌బుక్ సోషల్ నెట్‌వర్క్ ద్వారా కనెక్ట్ అయిన ప్రేమికులు 'కిస్ ఆఫ్ లవ్ - అన్బిన్ ముత్తమ్' పేరుతో నిరసనకు దిగారు. ప్రేమను, ప్రేమికుల దినోత్సవాన్ని వ్యతిరేకిస్తున్న వారిని నిరసిస్తూ వీధుల్లోకి వచ్చి ఒకరినొకరు ముద్దులు పెట్టుకుని నిరసన తెలిపారు. కేరళలో మొదలైన ఈ నిరసన ఆ తర్వాత దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలకు విస్తరించింది.
 
వ్యతిరేక సంస్కృతి'
ఇటీవల తమిళనాడులో కుల పట్టింపులేని ప్రేమ వివాహాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కుల సంఘాలు తమ కులానికి చెందిన వారి కోసం ప్రత్యేక వివాహ సమావేశాలను ఏర్పాటు చేసి వధూవరులను ఎంపిక చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈరోడ్‌లో జరిగిన 'వల్లికుమ్మి' కార్యక్రమంలో తమ కులానికి చెందిన వారినే పెళ్లి చేసుకుంటామంటూ ఆ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలతో కొంగునాడు పీపుల్స్ నేషనల్ పార్టీ కోశాధికారి కేకేసీ బాలు ప్రతిజ్ఞ చేయించారు.
 
ఒకవైపు కుల సంఘాల కార్యక్రమాలు, మరోవైపు 'స్పీడ్ డేటింగ్' వంటివి పెరుగుతుండడాన్ని ఎలా చూస్తారని తమిళ కొంగు పీపుల్స్ నేషనల్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఈశ్వరన్‌ను ప్రశ్నించినప్పుడు, “భారతదేశం విభిన్న వర్గాల ప్రజలకు నిలయం. ప్రతి ఒక్కరికీ ఒక నమ్మకం, ఒక సంప్రదాయం, సంస్కృతి ఉంటాయి. పిల్లలకి సలహాలు ఇవ్వడంలో తప్పు లేదు, కానీ ఎవరినైనా బలవంతం చేయడం తప్పే'' అని ఆయన బీబీసీతో చెప్పారు. ''నా వరకు, 'స్పీడ్ డేటింగ్' వంటివి మన సంస్కృతికి విరుద్ధం. ఇలాంటి పేరుతో తప్పులు జరిగే అవకాశం ఎక్కువ. తమిళనాడులో ఎక్కడో చిన్న స్థాయిలో 'స్పీడ్ డేట్' వగైరాలు జరుగుతున్నాయనుకుంటున్నా. పెద్ద ఎత్తున జరిగినట్లు వినలేదు. దీన్ని వాటిని అతిగా చూపించి పాపులర్ చేయాల్సిన అవసరం లేదని భావిస్తున్నా'' అని ఈశ్వరన్ అన్నారు. 'స్పీడ్ డేట్'ను హిందూ పీపుల్స్ పార్టీ నాయకుడు అర్జున్ సంపత్ ఖండించారు.
 
''మేం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. 'స్పీడ్ డేట్' వంటి వాటి ద్వారా భారత సంస్కృతిని, సంప్రదాయాన్ని, కుటుంబ వ్యవస్థను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. 'స్పీడ్ డేట్', 'హ్యాపీ స్ట్రీట్' వంటి ఈ షోలన్నీ పాశ్చాత్య సంస్కృతికి చెందినవి. ఇవి మన సంస్కృతిని పాడు చేస్తున్నాయి. ఈ షోలలో మహిళలు కూడా లైంగిక వేధింపులకు గురవుతున్నారు. అపరిచితులతో కలవడం, మద్యం తాగడం, టీ తాగడం ఇవన్నీ దిగజారుడు ప్రయత్నాలే'' అని అర్జున్ సంపత్ అభిప్రాయపడ్డారు.
 
'ఉద్దేశం అలాగే ఉంటే మంచిదే'
'స్పీడ్ డేట్' గురించి ఫాదర్ పెరియార్ ద్రవిడర్ కజగం ప్రధాన కార్యదర్శి కోవై రామకృష్ణన్ బీబీసీ తమిళ్‌తో మాట్లాడుతూ, "కులం, మతం సంబంధిత అభ్యంతరాలు ఉన్నప్పటికీ, ప్రేమను పంచుకోవడానికి స్పీడ్ డేట్ నిర్వహించడం స్వాగతించదగినదే' అన్నారు. కానీ, ఈ కార్యక్రమాల ఉద్దేశం అదే అయి ఉండాలి, అంతే క్రమశిక్షణతో నిర్వహించాలి. ఎందుకంటే కులం, మతం వంటి సమస్యలు తలెత్తకూడదు. "టెక్నాలజీ పెరుగుతోంది, ప్రతిదీ మారుతోంది, ప్రపంచం చాలా చిన్నదైపోయింది. అయినా కులం, మతం పేరుతో కొట్టడం, హింసించడం, ప్రేమను వ్యతిరేకించడం ఇంకా కొనసాగుతోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా తలెత్తుతున్న ఇలాంటి ఇబ్బందులను నివారించేందుకు, సామాజిక పరిచయాలను పెంచుకునేందుకు అనేక నగరాల్లో స్పీడ్ డేటింగ్ నిర్వహిస్తున్నారు'' అని స్పీడ్ డేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు, పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక ఐటీ ఉద్యోగి అభిప్రాయపడ్డారు.
 
''స్పీడ్ డేట్ అనేది కేవలం ప్రేమికులకు మాత్రమే అని భావించకూడదు. చాలా మంది స్నేహపూర్వకంగా ఉంటారు. ఉపాధి, నైపుణ్యాభివృద్ధి గురించి కూడా చర్చించుకుంటారు'' అని ఆయన చెప్పారు.

Share this Story:

వెబ్దునియా పై చదవండి

తెలుగు వార్తలు ఆరోగ్యం వినోదం పంచాంగం ట్రెండింగ్..

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాలో కాల్పులు కలకలం.. దండుగుల చేతిలో ఐదుగురి హతం