Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒమిక్రాన్: 15 నుంచి 18 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏమిటి? కోవాక్జిన్ టీకా మాత్రమే ఎందుకు?

ఒమిక్రాన్: 15 నుంచి 18 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏమిటి? కోవాక్జిన్ టీకా మాత్రమే ఎందుకు?
, సోమవారం, 3 జనవరి 2022 (22:44 IST)
అనేక నెలల చర్చల తరువాత, ఎట్టకేలకు 2022 జనవరి 3 నుంచి భారతదేశంలో 15 నుంచి 18 సంవత్సరాల యువతకు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో, ఇది కీలక నిర్ణయం. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను ఎదుర్కోవడానికి, టీకా ప్రచారాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది.

 
టీనేజి పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభించిన వారం తరువాత, 2022 జనవరి 10 నుంచి ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు బూస్టర్ డోస్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారతదేశంలో ఇప్పటివరకు 146 కోట్లకు పైగా వ్యాక్సీన్‌ డోసులు వేశారు. 80 కోట్లకు పైచిలుకు మొదటి డోసు వేయించుకున్నారు. రెండు డోసులూ వేయించుకున్నవారు 60 కోట్లకు పైనే. ఈ దశలో ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల మంది పిల్లలకు టీకా రెండు డోసులూ అందించగలరని అంచనా.

 
పిల్లల వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏమిటి?
15 నుంచి 18 సంవత్సరాల కౌమారదశలో ఉన్న పిల్లలకు భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్ టీకా మాత్రమే అందిస్తారు. వ్యాక్సీన్ డోసు కోసం 15 లేదా అంతకంటే ఎక్కువ వయసు గల యువత కోవిన్ వెబ్‌సైట్‌ (www.cowin.gov.in) లో తమ పేరు నమోదు చేసుకోవాలి. 2007 లేదా అంతకన్నా ముందు పుట్టినవారు వ్యాక్సినేషన్ కోసం రిజిస్టర్ చేసుకోగలరు. కోవిన్ సైటులో ఇంతకుముందే రిజిస్టర్ అయి ఉన్న ఖాతాను ఉపయోగించి తమ పేరు నమోదు చేసుకోవచ్చు. అంటే తమ కుటుంబ సభ్యుల అకౌంట్ నుంచి పిల్లలు రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదా కొత్త ఖాతా తెరవవచ్చు.

 
ఇది కాకుండా, నేరుగా టీకా కేంద్రానికి వెళ్లి తమ పేరు నమోదు చేసుకోవచ్చు. వ్యాక్సీన్ వేయించుకునే రోజు, సమయాన్ని కోవిన్ సైట్‌లో లేదా టీకా కేంద్రంలో పొందవచ్చు. 15, 16, 17 వయసు పిల్లలు పెద్దలుగా మారడానికి సమీపంలో ఉన్నట్టు లెక్క. అందుకే వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించడం ముఖ్యమని లాన్సెట్ కోవిడ్ 19 కమిషన్ ఇండియా టాస్క్ ఫోర్స్ సభ్యురాలు డాక్టర్ సునీలా గార్గ్ అభిప్రాయపడ్డారు. డాక్టర్ సునీలా గార్గ్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ జాతీయ అధ్యక్షురాలు. "అందుకే 18 ఏళ్లు దాటినవారికి ఇచ్చే మోతాదులోనే వీరికీ టీకాలు వేస్తారు. 15 నుంచి 18 వయసు మధ్య పిల్లలకూ రెండు డోసులు వేస్తారు. రెండింటికీ మధ్య ఆరు వారాల అంతరం ఉంటుంది" అని ఆమె వివరించారు.

 
కోవాగ్జినే ఎందుకు?
కోవాగ్జిన్ పిల్లలపై ప్రభావంతంగా పనిచేస్తుందని, సురక్షితమని రెండవ, మూడవ దశ అధ్యయనాల్లో తేలినట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది. 2021 జూన్, సెప్టెంబర్ మధ్య 525 మంది పిల్లలపై కోవాగ్జిన్ ట్రయల్స్ నిర్వహించారు. 2 నుంచి 18 సంవత్సరాల లోపు వారిపై ఈ పరీక్షలు జరిపారు. ట్రయల్‌లో పిల్లలను మూడు కేటగిరీలుగా విభజించారు.. 2 నుంచి 6 ఏళ్ల పిల్లలు, 6 నుంచి 12 ఏళ్ల వారు, 12 నుంచి 18 ఏళ్ల వారు. ట్రయల్స్ ఫలితాలను 2021 అక్టోబర్‌లో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌కు అందజేశారు.

 
ఇటీవలే, ఈ టీకాను 12 నుంచి 18 సంవత్సరాల వయసు గల వారికి ఇచ్చేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అత్యవసర అనుమతిని మంజూరు చేసింది. ట్రయల్స్‌లో ఎలాంటి ప్రతికూల ఫలితాలు వెలువడలేదని భారత్ బయోటెక్ తెలిపింది. 374 మంది పిల్లల్లో తేలికపాటి, మద్యస్థ లక్షణాలు కనిపించాయని, అందులో 78.6 శాతం కేసులను ఒక రోజులోపే పరిష్కరించారని వెల్లడించింది. పెద్దలకూ, పిల్లలకూ అందించగలిగేలా కోవాగ్జిన్‌ను ప్రత్యేకంగా తయారుచేశామని భారత్ బయోటెక్ పేర్కొంది.

 
ఒమిక్రాన్ కారణంగానే అత్యవసరంగా ఈ నిర్ణయం తీసుకున్నారా?
ఒమిక్రాన్ వలన పిల్లలకు అదనంగా ఎలాంటి ముప్పూ ఉండదని ప్రజారోగ్య నిపుణుడు డాక్టర్ చంద్రకాంత్ లహరియా చెప్పారు. "ఇంతకుముందు పిల్లలకు ఎంత రిస్క్ ఉందో, ఇప్పుడూ అంతే ఉంది. కాబట్టి ఈ వ్యాక్సినేషన్ నిర్ణయాన్ని ఒమిక్రాన్‌తో లింక్ చేయలేం" అని ఆయన అన్నారు. కోవిడ్ కారణంగా పిల్లల్లో తీవ్ర అనారోగ్యం అరుదు, కానీ పిల్లల నుంచి వ్యాధి సంక్రమించకుండా నిరోధించాలని లహరియా అన్నారు.

 
"పిల్లలకు వ్యాక్సీన్ వేయడంపై ఏకాభిప్రాయం లేదు. దానర్థం ఎప్పటికీ వారికి టీకాలు అందించలేమని కాదు. ఏ వయసు పిల్లలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నదే ప్రశ్న. 12 నుంచి 17 వయసు గల పిల్లలకు ముందు టీకాలు వేయడమే మేలు. అంతకన్నా చిన్న పిల్లలతో పోల్చుకుంటే వీరికే రిస్క్ ఎక్కువ" అని ఆయన వివరించారు. ఒమిక్రాన్ వ్యాప్తితో ఇది మరింత క్లిష్టంగా మారిందని డాక్టర్ సునీలా గార్గ్ అభిప్రాయపడ్డారు.

 
"మొదట్లో పిల్లలకు కూడా వ్యాక్సీన్ వేయాలని గొడవ చేశారు. ఇప్పుడు అది ప్రారంభించేసరికి సంకోచిస్తున్నారు. 80వ దశకంలో వ్యాక్సినేషన్ ప్రారంభించినప్పుడు కూడా ఇలాంటి సంకోచాలే ఉండేవి. కో మార్బిడీస్‌తో బాధపడే పిల్లలకు వ్యాక్సీన్ ఉపయోగకరంగా ఉంటుంది." "పిల్లలలో ఊబకాయం సమస్య పెరుగుతోందని తాజాగా విడుదలైన జాతీయ పోషకాహార సర్వే డేటా చెబుతోంది. ఈ గణాంకాల ప్రకారం, భారతదేశంలో ప్రతి 100 మంది పిల్లలకూ నలుగురు ఊబకాయంతో బాధపడుతున్నారు. పైగా, ఈ ఊబకాయం సమస్య చిన్న పిల్లల్లో కంటే పెద్ద పిల్లలలో ఎక్కువగా ఉంది" అని డాక్టర్ సునీలా వివరించారు.

 
భవిష్యత్తు ఏమిటి?
తరువాతి దశలో 15 ఏళ్ల లోపు పిల్లలకు కూడా టీకాలు వేసే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. 12 ఏళ్ల నుంచి పిల్లలకు వ్యాక్సీన్ ఇవ్వవచ్చని డాక్టర్ సునీలా అంటున్నారు. ముందు ముందు నాసల్ వ్యాక్సీన్ (ముక్కులో వేసేది) వస్తుందని, ఇది పిల్లలను సంక్రమణ నుంచి, వ్యాధి నుంచి కూడా రక్షిస్తుందని డాక్టర్ లహరియా తెలిపారు.

 
"కొన్ని దేశాల్లో 12 ఏళ్ల లోపు పిల్లలకు కూడా టీకాలు వేస్తున్నారు. కొన్ని దేశాలు దీనిపై ఇంకా ఆలోచిస్తున్నాయి. దేశాలు, వారి పరిస్థితి బట్టి నిర్ణయాలు తీసుకుంటున్నాయి" అని ఆయన అన్నారు. జైకోవ్-డీ, కోర్బెవాక్స్, నాసల్ వ్యాక్సిన్ వచ్చిన తరువాత 15 ఏళ్ల లోపు పిల్లలకు టీకాలు వేయడం గురించి ఆలోచించవచ్చని డాక్టర్ సునీలా గార్గ్ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనాలో ఏం జరుగుతోంది? షియాన్ నగరంలో ప్రజలను అర్థరాత్రి క్వారంటైన్‌‌కు ఎందుకు తరలిస్తున్నారు?