Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చైనాలో ఏం జరుగుతోంది? షియాన్ నగరంలో ప్రజలను అర్థరాత్రి క్వారంటైన్‌‌కు ఎందుకు తరలిస్తున్నారు?

Advertiesment
చైనాలో ఏం జరుగుతోంది? షియాన్ నగరంలో ప్రజలను అర్థరాత్రి క్వారంటైన్‌‌కు ఎందుకు తరలిస్తున్నారు?
, సోమవారం, 3 జనవరి 2022 (22:35 IST)
చైనాలోని షియాన్ నగరంలో అర్థరాత్రి పూట కొంతమందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించడంపై సోషల్ మీడియాలో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. చైనాలో ప్రస్తుతం వ్యాపిస్తున్న కోవిడ్ మహమ్మారికి షియాన్ నగరం కేంద్రం కావడంతో అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. నగరంలోని మొత్తం కోటీ 30 లక్షల మందిని ఇళ్లకే పరిమితం చేశారు, ఆహారం, లేదా సరుకుల కోసం వారిని బయటకు రానివ్వడం లేదు.

 
వచ్చే నెలలో లూనార్ న్యూ ఇయర్ ఉండడం, బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌ కూడా జరగబోతుండడంతో ఆ లోపే మహమ్మారిని నియంత్రించాలని అధికారులు భావిస్తున్నారు. షియాన్‌లో ప్రస్తుత పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీస్తోంది. అధికారుల చర్యలపై సోషల్ మీడియాలో చాలామంది ఫిర్యాదు చేశారు. సిటీ అధికారులు ఇళ్లలో ఉన్నవారికి ఉచితంగా ఆహారం అందిస్తున్నారు.

 
కానీ కొందరు మాత్రం తమ దగ్గర ఉన్న ఆహారం, సరుకులు అయిపోతున్నాయని, తమకు సాయం అందడం లేదని చెబుతున్నారు. తాజాగా షియాన్ నగరంలోని మింగ్డే 8 యింగిల్ అనే కాలనీ వాసులను జనవరి 1న అర్థరాత్రి తర్వాత వారి ఇళ్ల నుంచి బయటకు రప్పించి, క్వారంటైన్ కేంద్రాలకు తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. ఆ కాలనీలో వారికి ఇన్ఫెక్షన్ ఉన్నట్టు ఇటీవల తేలడంతో అధికారులు ఇలా చేశారని భావిస్తున్నారు. ఈ కాలనీ నుంచి ఎంతమందిని కోవిడ్ కేంద్రాలకు తరలించారు అనేది కచ్చితంగా తెలీడం లేదు. కానీ సోషల్ మీడియాలో ఒక యూజర్ కాలనీ బయట తాను 30 బస్సులు చూస్తున్నట్లు చెప్పాడు.

 
అక్కడ నుంచి వెయ్యి మందిని క్వారంటీన్ కేంద్రాలకు తరలించినట్లు మరో యూజర్ తెలిపాడు. బస్సుల్లో తాము ఎన్నో గంటలపాటు వేచిచూడాల్సి వచ్చిందని ఆ కాలనీ ప్రజలు చాలామంది చెప్పారు. క్వారంటైన్ కేంద్రాలకు తరలించిన వారిలో వృద్ధులు, పిల్లలు, గర్భిణులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తరలిస్తున్న సమయంలో ఒక వృద్ధుడు రాత్రి చలిలో వేచిచూస్తున్న ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చాలామంది ఆయనపై జాలిపడ్డారు.

 
ఐసొలేషన్ కేంద్రాల్లో ఉన్న సౌకర్యాల గురించి కొందరు ఫొటోలు పోస్ట్ చేశారు. అక్కడ వసతులు సాదాసీదాగా ఉన్నాయని, చాలా చలిగా ఉందని, తమకు ఆహారం కూడా ఇవ్వలేదని చెప్పారు. "ఇక్కడ ఏమీ లేవు. మామూలు వసతులే ఉన్నాయి. మమ్మల్ని చెక్ చేయడానికి ఎవరూ రావడం లేదు. ఇదేం క్వారంటీన్. వాళ్లు మమ్మల్ని భారీగా తరలించారు. రాత్రి చలిలో వెయ్యి మందికి పైనే ఇక్కడకు తీసుకువచ్చారు. మాలో చాలా మంది వృద్ధులు, పిల్లలు ఉన్నారు. అధికారులు సరైన ఏర్పాట్లు కూడా చేయలేదు. నిర్లక్ష్యంగా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి పడేశారు" అని బాధితుల్లో ఒకరు పోస్ట్ చేశారు.

 
దీనిపై సోషల్ మీడియా ప్లాట్‌ఫాం వీబోలో తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. "కాలనీ వారందరూ రెండు వారాల పాటు తమ ఇళ్లలోనే క్వారంటీన్లో ఉన్నప్పుడు, వారిని తరలించాల్సిన అవసరం ఏముంది" అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. నగర ప్రజలకు మొదట్లో ఆహారం కొనుగోలు చేయడానికి బయటకు వెళ్లడానికి అనుమతించారు. కానీ గత వారం నుంచి అధికారులు షియాన్‌ అంతటా నిబంధనలు మరింత కఠినతరం చేశారు. కోవిడ్ పరీక్షలు చేయించుకోడానికి మాత్రమే ఇళ్ల నుంచి బయటకు రావాలని ఆదేశించారు.

 
ఇది ఒకటి మాత్రమే
డిసెంబర్ 9 నుంచి 1600 కొత్త కరోనా కేసులు నమోదైన షియాన్‌ నగరంలో గత కొన్ని రోజులుగా నెలకొన్న పరిస్థితులకు సంబంధించి సోషల్ మీడియాలో కనిపిస్తున్న దయనీయ ఘటనల్లో ఇది ఒకటి మాత్రమే. గత వారం చివర్లో బ్రెడ్ కొనడానికి తన ఇంటి నుంచి బయటికొచ్చిన ఒక వ్యక్తిని కరోనా నియంత్రణ చర్యల్లో ఉన్న సిబ్బంది కొడుతున్న వీడియో వైరల్ అయ్యింది. తర్వాత ఆ సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు నగర అధికారులు చెప్పారు.

 
మరో ఘటనలో పీజీ ప్రవేశ పరీక్ష రాయడానికి వచ్చిన కొంతమంది విద్యార్థులు దయనీయ పరిస్థితుల్లో షియాన్‌లోనే చిక్కుకుపోయారు. నేను రెండు వారాలుగా ఇన్‌స్టంట్ నూడుల్సే తింటున్నా, అవి కూడా ఇక 5 పాకెట్లే మిగిలాయి" అని వారిలో ఒక విద్యార్థిని బాధపడ్డారు. నగరంలో ప్రజలందరికీ ఆహారం అందేలా చేస్తామని గత వారం ప్రభుత్వం హామీ ఇచ్చింది.

 
కానీ, ఆ తర్వాత నుంచి తమకు ఏమేం అందాయో ఆ ఆహారం, సరుకుల ఫొటోలను చాలా మంది సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తున్నారు. "ప్రభుత్వం ఇన్‌స్టంట్ నూడుల్స్‌ పంపించినందుకు థాంక్స్… భోంచేస్తున్నాం" అని ఒక యూజర్ వీచాట్‌లో రాశాడు. కానీ, నగర ప్రజల్లో చాలా మంది తమకు నిత్యావసరాలు సమస్య ఉందని చెబుతున్నారు. నగరంలో కోవిడ్ రోగులను ఉంచడానికి అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. చైనా అధికార మీడియా వివరాల ప్రకారం షియాన్‌లో ఇప్పటికే మూడు ఆస్పత్రులు నిర్మించారు. మరొకటి నిర్మాణంలో ఉంది. కొత్త హాస్పిటళ్లలో కోవిడ్ రోగుల కోసం 3000 పడకలు ఏర్పాటుచేశారు. "మాకు కొన్ని సానుకూల మార్పులు కనిపించడం ప్రారంభమైంది" అని చైనా ఇన్ఫెక్షియస్ డిసీజ్ కంట్రోల్ ఏజెన్సీకి చెందిన ఝాంగ్ కాన్యూ చైనా మీడియాతో అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ నుంచి భారతదేశపు మొదటి ఆటో ఇటిఎఫ్ నిప్పన్ ఇండియా నిఫ్టీ ఆటో ఇటిఎఫ్‌