Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పరాగ్ అగర్వాల్ ట్విటర్ సీఈవో అయితే, పాకిస్తాన్‌ ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శిస్తున్నారు?

పరాగ్ అగర్వాల్ ట్విటర్ సీఈవో అయితే, పాకిస్తాన్‌ ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శిస్తున్నారు?
, గురువారం, 2 డిశెంబరు 2021 (11:55 IST)
పరాగ్ అగర్వాల్ ట్విటర్‌ సీఈవో కావడానికి, పాకిస్తాన్‌ ప్రభుత్వం విమర్శల పాలవ్వడానికి సంబంధమేంటి? సుష్మా స్వరాజ్ వీడియోను పాక్ ప్రజలు ఎందుకు ట్వీట్ చేస్తున్నారు? అమెరికాకు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్‌.. 37 ఏళ్ల పరాగ్ అగర్వాల్‌ను సీఈవోగా నియమించింది. భారతీయ మూలాలున్న పరాగ్, 2005లో ఐఐటీ బాంబే నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో బీటెక్ చేశారు.

 
ఆయన 2011లో ట్విటర్‌లో చేరారు. 2017లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఎదిగారు. రెండు రోజుల క్రితమే కంపెనీ సీఈవోగా నియమితులయ్యారు. ట్విటర్‌ కంటే ముందు ఆయన మైక్రోసాఫ్ట్, యాహూ, ఏటీ&టీ ల్యాబ్స్‌లో పనిచేశారు. ట్విటర్‌కు పరాగ్ సీఈవోగా నియమితులవ్వడం గురించి ప్రపంచమంతటా చర్చ జరుగుతోంది. కానీ, పొరుగుదేశమైన పాకిస్తాన్‌లో ప్రజలు పరాగ్‌ను ప్రశంసిస్తూ తమ వ్యవస్థ గురించి, ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు.

 
పరాగ్ సీఈవో అయ్యాక నవంబర్ 29న ఐరీష్-అమెరికా ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ స్ట్రైప్ సీఈవో ప్యాట్రిక్ కోలీషన్ ఒక ట్వీట్ చేశారు. ''గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, పాలో ఆల్టో నెట్‌వర్క్స్ తర్వాత ఇప్పుడు ట్విటర్‌ సారథ్యం కూడా భారత్‌లో పెరిగిన ఒక సీఈవో చేతిలో ఉంటుంది. టెక్నాలజీ ప్రపంచంలో భారతీయుల విజయగాథ అద్భుతం. అలాగే అమెరికా, వలసదారులకు అవకాశాలు ఇస్తోందని ఇది తెలుపుతుంది. కంగ్రాచ్యులేషన్స్ పరాగ్'' అని ఆయన ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌కు స్పందిస్తూ టెస్లా మోటార్స్ సీఈవో ఎలాన్ మస్క్ ''భారతీయ టాలెంట్ వల్ల అమెరికాకు చాలా ప్రయోజనం ఉంటుంది'' అని వ్యాఖ్యానించారు.

 
పాకిస్తాన్‌లో చర్చ
ప్యాట్రిక్ చేసిన ట్వీట్‌ను పాకిస్తాన్‌లోని సర్వే ఆటో ఇన్‌కార్పొరేషన్ సీఈవో ఒమర్ సైఫ్ రీట్వీట్ చేశారు. ''ప్రియమైన పాకిస్తాన్, పోటీపడటానికి ఇది చాలా చక్కటి రంగం'' అని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ''ట్విటర్‌ పగ్గాలు పరాగ్ అగర్వాల్ చేతికి వచ్చాయి. గూగుల్‌కు సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్‌కు సత్య నాదెళ్ల, ఐబీఎమ్‌కు అర్వింద్ కృష్ణ, అడోబ్‌కు శాంతను నారాయణ్, క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ వీఎంవేర్‌కు రంగరాజన్ రఘురామ్, ఆన్‌లైన్ వీడియో ప్లాట్‌ఫామ్‌ వీమియోకు అంజలీ సూద్, గూగుల్ క్లౌడ్ చీఫ్ థామస్ కురియన్, నెట్‌ఆప్‌కు యజమానిగా జార్జ్ కురియన్, పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌కు నికేశ్ అరోరా సారథ్యం వహిస్తున్నారు'' అని ఆయన మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

 
ఫేస్‌బుక్ ఓనర్ మార్క్ జుకర్‌బర్గ్ స్థానంలో మరో భారతీయుని కోసం ఎదురుచూస్తున్నా అని ఒమర్ సైఫ్ రాసుకొచ్చారు.
''ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ కంపెనీలకు సీఈవోలుగా వ్యవహరిస్తోన్న భారతీయులంతా ఐఐటీల్లో చదువుకున్నారు. పాకిస్థాన్‌లో ఐఐటీల్లాంటి ప్రభుత్వ యూనివర్సిటీలు ఎందుకు లేవని చాలామంది పాకిస్థానీలు అడుగుతున్నారు. ఇక్కడ చిల్లర రాజకీయాలు, పోటీతత్వలేమి అనేవి ప్రబలంగా ఉన్నాయి. ఐఐటీల్లాంటి విద్యాకేంద్రాలు జాతీయ సంపదగా నిలుస్తాయి. ప్రపంచ స్థాయిలో పోటీపడేందుకు సహాయపడతాయి'' అని ఆయన రాసుకొచ్చారు.

 
ముబషిర్ అనే మరో పాకిస్థానీ యూజర్‌లో ట్విట్టర్‌లో ఒకవైపు ప్రముఖ భారతీయ సీఈవోలు, మరోవైపు పాకిస్థాన్ కరుడుగట్టిన ఉగ్రవాదులున్న చిత్రాన్ని పోస్ట్ చేశారు. దీనికి '' ఇండియా వర్సెస్ పాకిస్తాన్'' అనే వ్యాఖ్యను జోడించారు.
మరోవైపు పాకిస్తాన్ ప్రముఖ జర్నలిస్ట్ వసీమ్ అబ్బాసీ, ఎలాన్ మస్క్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ''గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐబీఎం, పాలో ఆల్టో నెట్‌వర్క్స్ ఇప్పుడేమో ట్విట్టర్ కూడా భారతీయుల చేతుల్లోనే ఉంది'' అని రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌ను ముబషిర్ కూడా షేర్ చేశారు.

 
''ఒకవైపేమో భారత్, ప్రపంచానికి గొప్ప మేథస్సును అందజేస్తూ దాని గుర్తింపును చాటిచెప్తోంది. మరోవైపేమో మేం ఇలా ఉన్నాం'' అని అద్నాన్ సిద్ధిఖీ అనే మరో ట్విట్టర్ యూజర్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌కు చెందిన అలీ అజర్ మరో యూజర్, భారత్‌కు చెందిన సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, పరాగ్ అగర్వాల్‌లతో పాటు పాకిస్తాన్‌కు చెందిన మరికొందరు వ్యక్తుల చిత్రాల సమాహారాన్ని ట్విట్టర్‌లో పంచుకుంటూ '' శత్రువులు మరియు మేము'' అని వ్యాఖ్య రాశారు.

 
సుష్మా స్వరాజ్ ప్రసంగం
ట్విటర్‌కు పరాగ్ అగర్వాల్ సీఈవోగా నియమితులయ్యారనే వార్త పాకిస్థాన్‌లోని మీడియాలో కూడా ప్రముఖంగా కనిపించింది. ఆ తర్వాత పాకిస్తాన్‌కు చెందిన కొందరు ట్విట్టర్ యూజర్లు భారత మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తోన్న ఒక వీడియో క్లిప్‌ను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటున్నారు.

 
పాకిస్తానీ యూజర్ సొహైల్ నూర్ ఖాన్ ట్విట్టర్‌లో సుష్మా స్వరాజ్ వీడియో క్లిప్‌ను షేర్ చేశారు. ''భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉన్న తేడా ఇదే. భారత్‌లో జన్మించిన పరాగ్ అగర్వాల్ ట్విటర్‌ సీఈవో అయ్యారు. ఆయన ఐఐటీ బాంబేలో చదువుకున్నారు. పాకిస్తాన్ దగ్గర ఉగ్రవాద శిక్షణ పొందిన తాలిబాన్లు, అఫ్గానిస్తాన్‌కు పాలకులు అయ్యారు'' అని సొహైల్‌లో ట్వీట్‌లో పేర్కొన్నారు.

 
2017 సెప్టెంబర్‌లో సుష్మా స్వరాజ్ ఈ ప్రసంగం ఇచ్చారు. ఈ ప్రసంగంలో ''పాకిస్తాన్ నుంచి ఉగ్రవాద సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ, భారత్ ఎప్పుడు కూడా దేశీయ అభివృద్ధిని ఆపలేదు. 70 ఏళ్లలో ఎన్నో పార్టీలు భారత్‌లో అధికారంలోకి వచ్చాయి. కానీ ప్రతీ ప్రభుత్వం కూడా అభివృద్ధిని ముందుకే తీసుకెళ్లింది.''

 
''మేం ఐఐటీలు, ఐఐఎంలను ఏర్పాటు చేసుకున్నాం. ఎయిమ్స్ లాంటి ఆసుపత్రుల్ని నిర్మించాం. అంతరిక్ష రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థలను తయారు చేసుకున్నాం. కానీ పాకిస్థానీలు, మీరు ఏం చేశారు? హిజ్బుల్ ముజాహిదీన్, హక్కానీ నెట్‌వర్క్, జైష్-ఎ-మొహమ్మద్, లష్కర్-ఎ-తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహించారు. మేం పండితులను, శాస్త్రవేత్తలను, వైద్యులను తయారు చేస్తే, మీరు మాత్రం జీహాదీలను సృష్టించారు'' అని సుష్మా స్వరాజ్ పాకిస్తాన్‌ను ఎండగట్టారు.

 
హంజా బలూచ్ అనే మరో పాకిస్తానీ, భారతీయ సీఈవో పేరు రాస్తూ... ఇండియా వీరిని ఇచ్చింది, మరీ మనం? అని ప్రశ్నించారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్త యువ కెర‌టం కాంతి రాణా టాటా... విజయవాడ సీపీగా నియామ‌కం