Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనావైరస్‌తో కొత్త సమస్య: ‘తినేవి కంపు కొడుతున్నాయి, చెత్త పదార్థాల వాసన కమ్మగా ఉంటోంది, ఎందుకిలా?'

Advertiesment
కరోనావైరస్‌తో కొత్త సమస్య: ‘తినేవి కంపు కొడుతున్నాయి, చెత్త పదార్థాల వాసన కమ్మగా ఉంటోంది, ఎందుకిలా?'
, శుక్రవారం, 29 జనవరి 2021 (12:45 IST)
కోవిడ్ వ్యాధి బారినపడ్డవారిలో చాలా మంది వాసన చూసే సామర్థ్యాన్ని తాత్కాలికంగా కోల్పోతున్నారు. అయితే, కోలుకున్నకొద్దీ వారికి ఆ సామర్థ్యం తిరిగివస్తుంది. కానీ, కొందరిలో మాత్రం ఆ వాసన సామర్థ్యం భిన్నంగా మారిపోతుంది. అంటే ఆహారం, పూలు ఇలా సువాసన ఇచ్చేవి కూడా వారికి దుర్గంధంలా అనిపిస్తున్నాయి. తమకు ఇష్టమైన వ్యక్తుల వాసనను కూడా వారు భరించలేకపోతున్నారు. ఈ పరిస్థితిని పారోస్మియా అంటారు. ఈ సమస్య బారినపడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది.

 
ఈ సమస్య ఎందుకు వస్తోంది? దీన్ని ఎలా నయం చేయాలి? అనే విషయంపై మాత్రం శాస్త్రవేత్తలు స్పష్టంగా ఏమీ చెప్పలేకపోతున్నారు. తన కుటుంబం కోసం వంట చేస్తున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటూ వంట చేస్తున్నానని క్లేర్ ఫ్రీయర్ అనే ఆవిడ చెప్పారు. ‘‘ఆ వాసనలకు నా తల తిరిగిపోతోంది. ఓవెన్ ఆన్ చేయగానే భరించలేని కంపు వాసన వ్యాపించినట్లు అనిపిస్తోంది’’ అని ఆమె వివరించారు. క్లేర్‌ వయసు 47 ఏళ్లు. బ్రిటన్‌లోని సటన్ కోల్డ్ ఫీల్డ్‌లో ఆమె ఉంటున్నారు.

 
ఏడు నెలలుగా క్లేర్ పారోస్మియాతో బాధపడుతున్నారు. రోజూ వచ్చే సాధారణ వాసనలు కూడా ఆమెకు భరించలేని దుర్గంధాలుగా మారిపోయాయి. ఉల్లిగడ్డలు, కాఫీ, మాంసం, పండ్లు, మద్యం, టూత్ పేస్ట్, క్లీనింగ్ ఉత్పత్తులు, పెర్ఫ్యూమ్... ఇవన్నీ ఆమెకు వాంతి తెప్పించేలా కంపుగా అనిపిస్తున్నాయి. కుళాయి నుంచి వచ్చే నీటి వాసనను కూడా ఆమె భరించలేకపోతున్నారు. ఫిల్టర్ నీళ్లతో మాత్రం ఈ సమస్య లేదని ఆమె చెప్పారు.

 
పారోస్మియా సమస్య కారణంగా తన భాగస్వామిని కనీసం ముద్దు పెట్టుకోలేకపోతున్నానని ఆమె వాపోయారు. క్లేర్‌కు గత ఏడాది మార్చిలో కరోనావైరస్ సోకింది. అప్పుడే ఆమె వాసన చూసే సామర్థ్యాన్ని కోల్పోయారు. జూన్ కల్లా సామర్థ్యం తిరిగివచ్చింది. కానీ, ఆమెకు అన్నీ దుర్గంధాల్లా అనిపించడం మొదలైంది. తనకు ఇష్టమైన ఆహార పదార్థాలు కూడా పాడైపోయినట్లుగా వాసన వచ్చేవి.

 
ఇప్పుడు ఆమె రోజూ బ్రెడ్, చీజ్ మాత్రమే తింటున్నారు. వాటి వాసనను మాత్రమే ఆమె భరించగలుగుతున్నారు. ‘‘నాలో శక్తి అంతా నశించింది. శరీరమంతా నొప్పులుగా అనిపిస్తున్నాయి. ఈ సమస్య నన్ను మానసికంగా ఎంతో ఇబ్బందిపెడుతోంది. చాలా రోజులు ఏడుస్తూ గడుపుతున్నా’’ అని క్లేర్ చెప్పారు. ‘‘అనోస్మియా (వాసన చూసే సామర్థ్యం లేకపోవడం)తోనూ నేను నా సాధారణ జీవితం కొనసాగించగలిగా. ఆహారం, పానీయాలు తీసుకోగలిగా. అలా ఉండిపోయినా, పరిస్థితి బాగుండేది’’ అని ఆమె అన్నారు.

 
ఇలాంటి సమస్యను తాను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదని క్లేర్‌కి ఆమె వైద్యుడు చెప్పారు. దీంతో ఆందోళనతో తన సమస్య గురించి మరింత సమచారం కోసం ఆమె ఇంటర్నెట్‌లో వెతికారు. వాసన సామర్థ్యం కోల్పోయిన వారి కోసం నడుస్తున్న అబ్సెంట్ అనే సంస్థ నిర్వహిస్తున్న ఫేస్‌బుక్ గ్రూప్ ఆమెకు కనిపించింది. ‘‘పారోస్మియా ఉన్న వాళ్లు తమకు ఏదో కుళ్లిపోయినట్లు, చనిపోయినట్లు, మలాన్ని తలపించేలా వాసనలు వస్తున్నాయని చెబుతున్నారు’’ అని అబ్సెంట్ వ్యవస్థపాకురాలు క్రిస్సీ కెల్లీ చెప్పారు.

 
ఆ దుర్గంధాలను ఇదివరకు ఎప్పుడూ ఎదుర్కోని కారణంగా చాలా మంది మాటల్లో వర్ణించలేకపోతున్నారు. కరోనావైరస్ సోకినవారిలో దాదాపు 65 శాతం మంది వాసన సామర్థ్యం కోల్పోతుండగా, వారిలో 10 శాతం మందికి పారోస్మియా, ఫాంటోస్మియా (లేని వాసన రావడం) వంటి సమస్యలు వస్తున్నాయి. ఈ లెక్కన ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకిన 10 కోట్ల మందిలో 65 లక్షల మందికి ఈ తరహా పారోస్మియా సమస్య వచ్చి ఉండే అవకాశాలు ఉన్నాయి.

 
రీడింగ్ యూనివర్సిటీ‌లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ జేన్ పార్కర్ పారోస్మియా గురించి కరోనావైరస్ సంక్షోభం రాకముందు నుంచీ అధ్యయనం చేస్తున్నారు. వస్తువులో ఉండే వివిధ పదార్థాల్లో ఇబ్బందికరమైన వాసనను వెలువరిచే కొన్నింటి వాసనను మాత్రమే గ్రహించగలగుతుండటం వల్ల పారోస్మియా వస్తుందన్నది కొందరు ప్రతిపాదిస్తున్న సిద్ధాంతం.
ఉదాహరణకు కాఫీలో సల్ఫర్ మిశ్రమాలు ఉంటాయి. దానితోపాటు కాఫీలో ఉండే మిగతా పదార్థాలన్నీ కలిసి మంచి వాసనను ఇస్తాయి. కానీ, విడిగా ఒక్క సల్ఫర్ వాసననే గ్రహించగలిగితే, అది ఇబ్బందికరంగా ఉంటుంది.

 
అబ్సెంట్ ఫేస్‌బుక్ గ్రూప్‌లో ఉన్నవారితో కలిసి జేన్ పార్కర్ బృందం పనిచేసింది. మాంసం, ఉల్లిగడ్డలు, వెల్లుల్లి, చాకోలేట్, కాఫీ, కూరగాయలు, పండ్లు, కుళాయి నీళ్లు, వైన్‌ల నుంచి పారోస్మియా ఉన్నవారికి ఇబ్బందికర వాసనలు వస్తున్నాయని గుర్తించింది. ఆల్మండ్, చెర్రీలు మినహా మరేదీ కొందరికి మంచి వాసన ఇవ్వడం లేదని తెలుసుకుంది. పారోస్మియా ఉన్నవారికి వాసన చాలా సేపు ఉంటుందని కూడా జేన్ పార్కర్ బృందం గుర్తించింది. అంటే, కాఫీ వాసన చూసినప్పుడు సాధారణ వ్యక్తులకు కొన్ని క్షణాలపాటు ముక్కులో ఆ వాసన తగులుతుంది. అదే, పారోస్మియా ఉన్నవారిలో అది కొన్ని గంటలు, రోజులపాటు కూడా ఉంటోంది.

 
గ్లోబల్ కన్సార్షియం ఫర్ కోమోసెన్సరీ రీసెర్చ్ సంస్థ బ్రిటన్ విభాగం లీడ్‌గా పనిచేస్తున్న బారీ స్మిత్ పారోస్మియా గురించి మరో ఆసక్తికర విషయం వెల్లడించారు. ‘‘కొందరికి బాత్రూంలో వచ్చే వాసనలు బాగా అనిపిస్తున్నాయి. అంటే, తిండి వాసన దుర్గంధంలా... మలవ్యర్థాల వాసన మంచి వాసనలాగా మారిపోయాయి’’ అని ఆయన చెప్పారు.

 
‘‘ముక్కులో ఉండే వాసన గ్రాహకాల నుంచి మెదడులో వాటిని గుర్తించే భాగానికి సంకేతాలను చేరవేసే నాడీ కణాలు దెబ్బతినడం వల్ల ఈ సమస్య వస్తుండొచ్చు. ప్రమాదంలోగానీ, ఇన్ఫెక్షన్ వల్ల గానీ ఇలా అవి దెబ్బతిని తిరిగి కోలుకునే క్రమంలో తారుమారుగా తప్పుడు స్థానంతో అవి అనుసంధానమవుతున్నాయేమో. అందుకే మంచివి చెడ్డగా, చెడ్డవి మంచిగా వాసన వస్తున్నట్లు మెదడు గుర్తిస్తుంది ’’ అని ఆయన అన్నారు.

 
సమయం గడిచినకొద్దీ ఈ సమస్య దూరమవ్వచ్చని, అయితే ఎంత సమయం పడుతుందన్నది చెప్పలేమని జేన్ పార్కర్ అంటున్నారు. ‘‘కోవిడ్-19 కన్నా ముందు కొద్ది మందికే ఈ సమస్య ఉంది. అందుకే దీనిపై పెద్దగా అధ్యయనాలు జరగలేదు. ఇప్పుడు చేయాలన్నా కొన్నేళ్లు పడుతుంది’’ అని ఆమె అన్నారు. ‘స్మెల్ ట్రెయినింగ్’ పద్ధతి ద్వారా సమస్యను కొంత మేర తగ్గించవచ్చని అబ్సెంట్ సంస్థ చెబుతోంది. క్లేర్ ఈ పద్ధతి ప్రయత్నించి చూస్తున్నారు.

 
ఈ పద్ధతిలో కొన్ని ఎంపిక చేసిన మొక్కల నుంచి తీసిన నూనెల వాసన చూపించి, వాటి గురించి ఆలోచించమని బాధితులకు సూచిస్తారు. ఇలా తనకు నిమ్మ, నీలగిరి లాంటి వాసనలు తిరిగి బాగా అనిపించడం మొదలైందని... అయితే గులాబీ వాసన మాత్రం తెలియడం లేదని క్లేర్ చెప్పారు. పారోస్మియా బాధితుల్లో కొందరు తమకు దుర్గంధం రాని ఆహార పదార్థాలను ఎంచుకుని, తినడం మొదలుపెట్టారు. బ్రిటన్‌లోని వెస్ట్ యార్క్‌షైర్‌కు చెందిన క్రిస్టీ, లారా ఇదే పని చేస్తున్నారు.

 
‘‘కొందరు ఎలాగోలా తినేయమని మాకు చెబుతుంటారు. కానీ, కంపు కొడుతున్న ఆహారాన్ని తినడం చాలా కష్టం. ఒకవేళ తిన్నా, మరుసటి మూడు రోజులు నా చెమట కూడా అలాగే వాసన వస్తుంది. అస్సలు భరించలేను’’ అని క్రిస్టీ అన్నారు. శాకాహారం తింటే పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని ఆమె చెప్పారు. ‘‘మాంసం నుంచి వాసన దారుణంగా వస్తోంది. దాన్ని పూర్తిగా మానేశాం. మాకు సౌకర్యంగా ఉన్నవాటితోనే వివిధ వంటకాలు చేయడం తెలుసుకుంటున్నాం. మా పరిస్థితికి తగ్గట్లు మేం మారిపోతున్నాం. కొన్నేళ్లపాటు మేం ఇలాగే ఉండాల్సి కూడా రావొచ్చు’’ అని క్రిస్టీ చెప్పారు.

 
వాసన సామర్థ్యాన్ని కోల్పోవడాన్ని చాలా మంది పెద్ద విషయంలా చూడరని... కానీ, మానసిక ఆరోగ్యం, జీవనశైలిపై దాని ప్రభావం చాలా ఉంటుందని బారీ స్మిత్ అన్నారు. ‘‘వాసన చూసే సామర్థ్యం కోల్పోయినప్పుడే మన అనుభూతుల్లో దాని పాత్ర ఎంత ప్రధానమో మనం గుర్తిస్తాం. మానవ సంబంధాలు, ఆనందాలు, జ్ఞాపకాలు అన్నీ వాసనల చుట్టూ ఏర్పడతాయి’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చించాకే సాగు చట్టాలకు ఆమోదం : రాష్ట్రపతి