Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోలివింగ్‌: పరిచయమే లేకపోయినా ఒకే చోట అద్దెకు.. వంట గది, పడక గది అన్నీ షేరింగ్

webdunia
శనివారం, 27 జులై 2019 (22:07 IST)
భారత యువత ముఖ్యంగా 1981 నుంచి 96 మధ్య పుట్టినవాళ్లు 'ఇల్లు' అనే భావనకు కొత్త నిర్వచనం ఇస్తున్నారు. అదే 'కోలివింగ్'. ఈ జీవనంలో- పరిచయమే లేనివాళ్లు ఒకచోట అద్దెకు ఉంటూ, తమ వంటగదిని, పడకగదులను పంచుకుంటారు. 'కో లివింగ్ స్పేసెస్‌'లో పార్టీలు లాంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాయి ఈ సదుపాయాన్ని కల్పించే సంస్థలు.

 
2022 నాటికి దేశంలో కో లివింగ్ స్పేసెస్ వ్యాపారం దాదాపు 14 వేల కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా. 'కో లివింగ్‌'పై బెంగళూరు నుంచి బీబీసీ ప్రతినిధి జో థామస్ అందిస్తున్న కథనం ఇది. 'కోలివింగ్'ను ఫ్లాట్ షేరింగ్ కాన్సెప్ట్‌కు తర్వాతి స్థాయిగా చెప్పుకోవచ్చు. ఈ జీవనంలో చాలా వెసులుబాటు ఉంటుంది. కనీసం ఆరు రోజుల నుంచి నెలలపాటు ఈ స్పేసెస్‌లో నివాసం ఉండొచ్చు. ఉద్యోగ రీత్యా తరచూ నగరాలు మారే యువతకు ఇది అనువుగా ఉంటోంది.

 
దిల్లీ నుంచి బెంగళూరుకు బదిలీ అయ్యి, ఇక్కడ ఓయో ఆధ్వర్యంలోని కోలివింగ్ స్పేస్‌లో ఉంటున్న ఉద్యోగిని తనూ నయ్యర్‌ బీబీసీతో మాట్లాడుతూ- ఈ కాన్సెప్ట్‌లో వెసులుబాటు గురించి చెప్పారు. "బెంగళూరులో ఏదైనా ఫ్లాట్ అద్దెకు తీసుకోవాలంటే సెక్యూరిటీ డిపాజిట్‌ కింద కనీసం పది నెలల అద్దెను ముందుగా చెల్లించాలి. ఇది నేను ఎదుర్కొన్న సమస్య. కోలివింగ్ స్పేస్‌లో అయితే అంత డబ్బు కట్టాల్సిన అవసరం లేదు. పైగా అవసరమైనన్ని రోజులే ఇందులో ఉండొచ్చు" అని తనూ నయ్యర్ తెలిపారు.

 
ఈ తరహా జీవనం ముందు నుంచే ఉనికిలో ఉంది. పేయింగ్ గెస్ట్ లేదా పీజీలుగా పేరుగాంచిన ఈ ఇళ్లలో రూంలను అద్దెకిస్తూ భోజన వసతి కల్పిస్తారు. కానీ అద్దెకుండే వాళ్లకు ఎక్కువ స్వేచ్ఛ ఉండదు. ఈ వ్యాపారం పద్ధతి ప్రకారం కూడా ఉండదు. ఈ గదుల్లో చాలా షరతులుంటాయి. స్నేహితులు, ఆహారం విషయంలో అంత అనుకూలంగా ఉండవు. యజమానిని బట్టి కూడా నిబంధనలు మారిపోతుంటాయి.

 
కో లివింగ్ స్పేసెస్‌ నిలకడగా మెరుగైన సేవలను అందిస్తుండటంతో ఈ యాప్‌లు యువ వినియోగదారులను బాగా ఆకర్షిస్తున్నాయి. దేశంలోని యువతీయువకులు ముందు తరాల వారికన్నా ఎక్కువ కాలం అద్దె ఇళ్లలో ఉండనున్నారు. మెరుగైన వసతుల కోసం వీరు ఎక్కువ చెల్లించడానికైనా వెనుకాడబోరు.

 
కోలివింగ్ స్పేస్‌లను కల్పిస్తున్న ఓయో, లెమన్ ట్రీ, నెస్ట్ అవే, జోలో లాంటి సంస్థలు, విదేశీ మదుపరులను కూడా బాగా ఆకర్షిస్తున్నాయి. భారత్‌లో ఈ మార్కెట్ బాగా ఎదగొచ్చని మదుపర్లు భావిస్తున్నారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేవాళ్లకు చాలా సవాళ్లు ఎదురవుతున్నాయి.

 
'రెడ్ సీర్' కన్సల్టింగ్ డైరెక్టర్ ఉజ్వల్ చౌధ్రీ బీబీసీతో మాట్లాడుతూ- "కొందరు ఇన్వెస్టర్లు ఈ రంగాన్ని వృద్ధి చేసేందుకు భారీగా వెచ్చిస్తున్నారు. దీని మూలంగా ఈ వ్యాపారంలో రోజువారీ నిర్వహణకు చాలా డబ్బు అవసరమవుతోంది. ఇలా చేయడం దీర్ఘకాలంలో అనువైంది కాదు" అని అభిప్రాయపడ్డారు.

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

వరలక్ష్మీ వ్రతం గోడ‌ప‌త్రిక‌లు ఆవిష్క‌ర‌ణ‌