Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వీసాలు లేకుండా భారతీయులు అమెరికాలో ఎలా అడుగుపెడుతున్నారు?

visa
, శుక్రవారం, 12 ఆగస్టు 2022 (15:50 IST)
ఇటీవల అమెరికాలోని ఓ కోర్టు ఎదుట నలుగురు గుజరాతీ యువకులను అమెరికా పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ నలుగురూ ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ (ఐఈఎల్‌టీఎస్) పరీక్షలో ఉత్తీర్ణులైనట్లు చెబుతున్నారు. కానీ, జడ్జి ప్రశ్నలు అడిగినప్పుడు వీరు ఇంగ్లిష్‌లో ఎలాంటి సమాధానాలు చెప్పలేకపోయారు. ఈ గుజరాతీ యువకుల దగ్గర ఐఈఎల్‌టీఎస్‌లో మంచి స్కోర్ సాధించినట్లు సర్టిఫికేట్లు ఉన్నాయి. కానీ, వీరు ఇంగ్లిష్‌ను అర్థం చేసుకోవడంలోనూ విఫలం అవుతున్నారని అధికారుల దర్యాప్తులో తేలింది.

 
వీరు సెయింట్ రేజిస్ నది గుండా కెనడా నుంచి అమెరికాలోకి ప్రవేశించబోయారు. అయితే, నదిపై వెళ్తుండగా వీరి పడవ ఒక్కసారిగా మునిగిపోయింది. దీంతో అమెరికా పోలీసులు వీరిని కాపాడారు. ఆ తర్వాత వీరికి ఇంగ్లిష్‌పై కనీస అవగాహన కూడా లేదని గుర్తించారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇదేమీ తొలిసారి కాదు. నిత్యం ఇలాంటి కేసులు వస్తూనే ఉంటాయి. కొన్ని నెలల క్రితం గుజరాత్‌లోని దింగుచా గ్రామానికి చెందిన ఒక కుటుంబం ఇలానే అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించేందుకు విఫలయత్నం చేసింది. అమెరికాకు వెళ్లే అందరినీ మనం ఇదే కోణంలో చూడాల్సిన పనిలేదు. అయితే, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు, అసలు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడం ఎలా? అనే అంశంపై చర్చ జరుగుతుంటుంది.

 
ఎలా మొదలుపెడతారు?
భారత్‌లో గుజరాత్‌తోపాటు చాలా రాష్ట్రాలకు చెందిన ప్రజలు అమెరికాకు అక్రమ మార్గాల్లో ఎప్పటినుంచో వెళ్తున్నారు. అయితే, అక్కడకు వెళ్లిన మొదటి కొన్ని నెలలు వీరికి చాలా సాయం అవసరం ఉంటుంది. ఇలా అక్రమ మార్గాల్లో అమెరికాకు పంపిస్తున్న కొందరు ట్రావెల్ ఏజెంట్లతో బీబీసీ మాట్లాడింది. పోలీసులు కేసులు పెడతారనే భయంతో వీరు తమ వివరాలను బహిర్గతం చేయడానికి సుముఖత వ్యక్తంచేయలేదు. ‘‘మొదట అమెరికాకు సరిహద్దుల్లోని ఏదో ఒక దేశం వీసా సంపాదించాలని మా దగ్గరకు వచ్చే వారికి సూచిస్తాం’’ అని ఒక ట్రావెల్ ఏజెంట్ బీబీసీతో చెప్పారు.

 
‘‘ఒకసారి అమెరికాకు దగ్గరల్లోని ఏదో ఒక దేశం వీసా దొరికిన తర్వాత, వారు భారత్‌ను విడిచిపెట్టి అమెరికాలో ప్రవేశించడం తేలిక అవుతుంది’’అని ఆయన వివరించారు. ‘‘అయితే, ఇలా అమెరికాకు వెళ్లే వారు కాస్త ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సాధారణంగా ఖర్చయ్యే దాని కంటే ఈ మార్గంలో ఖర్చు కాస్త ఎక్కువే’’అని ఆయన చెప్పారు. ఇలానే దింగుజా గ్రామానికి చెందిన జగదీశ్‌భాయ్ పటేల్ కుటుంబం కెనడా గుండా అమెరికాలో అక్రమంగా ప్రవేశించాలని ప్రయత్నించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

 
‘‘ఇక్కడ ఉండేవారు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి అమెరికాకు వెళ్లాలని ప్రయత్నిస్తుంటారు. ఒక కుటుంబం అక్కడికి వెళ్లేందుకు మొత్తంగా రూ.కోటి కూడా ఖర్చుపెట్టేందుకు సిద్ధంగా ఉంటుంది’’అని దింగుచా గ్రామానికి చెందిన ఒక వ్యక్తి బీబీసీతో చెప్పారు. ‘‘డబ్బులు ఎందుకు ఎక్కువ ఖర్చు అవుతాయంటే అక్కడ ఉండే వారితోపాటు మధ్యవర్తులకు కూడా మనం కమీషన్ ఇవ్వాల్సి ఉంటుంది’’అని ఒక ట్రావెల్ ఏజెంట్ వివరించారు.

 
ప్రధాన మార్గాలు ఏవి?
ఎక్కువ మంది దక్షిణ సరిహద్దుల గుండా అమెరికాలో అడుగుపెట్టాలని చూస్తుంటారు. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం.. గత ఏడాది అక్టోబరు, నవంబరు, డిసెంబరులో మొత్తంగా 5 లక్షల మంది అమెరికాలో అడుగుపెట్టేందుకు ప్రయత్నించారు. మెక్సికో, గ్వాటెమాలా, హోండురాస్, ఎల్ సాల్వడార్‌ల గుండా ఎక్కువ మంది అమెరికాలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇక ఉత్తరం వైపు నుంచి చూస్తే కెనడాలోని ఆల్బెర్టా గుండా ఎక్కువ మంది అమెరికాలోకి ప్రవేశిస్తుంటారు. అమెరికాలో అక్రమంగా 15ఏళ్ల జీవించి గుజరాత్‌కు మళ్లీ వచ్చిన ఒక వ్యక్తితో బీబీసీ మాట్లాడింది.

 
‘‘మెక్సికన్ సరిహద్దు భారతీయులకు చాలా అనువుగా ఉంటుంది. నేను కూడా దాని గుండానే అమెరికాలోకి అడుగుపెట్టాను. అయితే, ఇక్కడ కొన్ని పనులున్నాయి. అందుకే మళ్లీ వచ్చాను’’అని ఆయన చెప్పారు. ఆయన కూడా తన పేరును వెల్లడించడానికి ఇష్టపడలేదు. ‘‘నేను వెళ్లేటప్పుడు మెక్సికోలో భారతీయులకు వీసా ఆన్ అరైవల్ సదుపాయం ఉండేది. దీంతో అక్కడకు వెళ్లి మేం వీసాలు తీసుకున్నాం. ఆ తర్వాత కొందరు గుజరాతీలతో కలిసి అమెరికాలో అడుగుపెట్టాం’’అని ఆయన చెప్పారు. అయితే, ఇప్పుడు మెక్సికో వీసా విధానాలు మారాయి. అక్కడకు వచ్చే భారతీయులకు వీసా తప్పనిసరి చేశారు.

 
మరోవైపు అమెరికా చుట్టుపక్కల దేశాల వీసాలకు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదని ఓ ట్రావెల్ ఏజెంట్ చెప్పారు. ‘‘కెనడా, మెక్సికో లాంటి దేశాల వీసాల కోసం మనం పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. అయితే, ఒకసారి అక్కడకు వెళ్లిన తర్వాతే అసలు పని మొదలవుతుంది’’అని ఆయన చెప్పారు. ‘‘అక్కడకు వెళ్లిన తర్వాత సరిహద్దులకు వెళ్లడంలో స్థానికులు సాయం చేస్తారు. సరిహద్దుల గుండా అమెరికాలోకి వెళ్లేందుకు అవసరమైన అన్నీ వారు సమకూరుస్తారు. ఆహారం, నీరు, బట్టలు అన్నీ ఇస్తారు’’అని ఆయన వివరించారు. ముఖ్యంగా అడవులు, ఎడారి గుండా ప్రయాణించి అమెరికాలోకి వెళ్లాల్సి ఉంటుందని ట్రావెల్ ఏజెంట్ వివరించారు.

 
జగదీశ్‌భాయ్ పటేల్ ఎలా వెళ్లారు?
దింగుచాకు చెందిన జగదీశ్‌భాయ్ కుటుంబం కూడా మొదట కెనడాకు వెళ్లింది. ‘‘మొదట వారు టొరంటో చేరుకున్నారు. అక్కడి నుంచి దక్షిణ ఒంటారియోలోని గడ్డకట్టిన సరస్సుల గుండా ప్రయాణించి అమెరికాలో అడుగుపెట్టాలని భావించారు’’అని బీబీసీలో ఒక వార్త ప్రచురించారు. అమెరికా సరిహద్దులకు కేవలం 12 మీటర్ల దూరంలోనే ఆ కుటుంబం మృతదేహాలు కనిపించాయి. చలి నుంచి రక్షణ కల్పించే వస్త్రాలు, బూట్లు కూడా వారు వేసుకున్నారు. అయితే, మైనస్ 35 డిగ్రీల ఉష్ణోగ్రతలో అవి పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. 2019లోనూ అమెరికా సరిహద్దు రాష్ట్రం ఆరిజోనా ఎడారిలో ఆరేళ్ల బాలిక గురుప్రీత్‌ కౌర్ మృతదేహం కనిపించింది.

 
తల్లి, సోదరితోపాటు గురుప్రీత్ కౌర్.. అమెరికాలోకి ప్రవేశించాలని ప్రయత్నించినట్లు సీఎన్ఎన్ వార్తా సంస్థ ఒక కథనం ప్రచురించింది. అమెరికా సరిహద్దు పోలీసు విభాగానికి గురుప్రీత్ కౌర్ మృతదేహం మాత్రమే దొరికింది. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ 2019లో విడుదలచేసిన నివేదిక ప్రకారం.. భారత్, క్యూబా, ఈక్వెడార్ లాంటి దేశాల నుంచి కూడా ఎక్కువగా వలసదారులు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారు. ఒక్క 2019లోనే భారత్‌కు చెందిన దాదాపు 8,000 మంది అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించారు. వీరిలో 7500 మంది దక్షిణం వైపు నుంచి రాగా.. కేవలం 339 మంది మాత్రమే ఉత్తర మార్గం నుంచి వచ్చారు. అంటే, అమెరికాకు అక్రమ మార్గంలో వెళ్లాలని భావించేవారిలో ఎక్కువ మంది దక్షిణ అమెరికా దేశాల మార్గాన్ని ఎంచుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

12 గంటలు కష్టపడి డ్యూటీ చేస్తే.. ఇలాంటి ఆహారం పెడతారా?