Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనావైరస్ వ్యాక్సిన్: గురజాడ కవిత చదివిన ప్రధానమంత్రి మోదీ

కరోనావైరస్ వ్యాక్సిన్: గురజాడ కవిత చదివిన ప్రధానమంత్రి మోదీ
, శనివారం, 16 జనవరి 2021 (12:56 IST)
కరోనావైరస్‌కు కళ్లెం వేయడమే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా తొలి దశ టీకాల కార్యక్రమాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా 3,006 కేంద్రాల్లో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ కేంద్రాలన్నింటినీ వర్చువల్‌గా అనుసంధానించారు. తొలి రోజు శనివారం ఒక్కో కేంద్రంలో వంద మందికిపైగా టీకాలు తీసుకోనున్నారు. ఈ వ్యాక్సినేషన్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద టీకాల కార్యక్రమంగా అభివర్ణిస్తున్నారు.

 
‘దేశమంతా ఎదురుచూసిన రోజు ఇది’
వ్యాక్సినేషన్ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ''ఈ రోజు కోసం మనం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాం. వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? అని ప్రశ్న ఎప్పటినుంచో మనల్ని తొలచేస్తుండేది. ఇప్పడు టీకా వచ్చేసింది. చాలా తక్కువ సమయంలోనే పరిశోధకులు టీకాను అభివృద్ధి చేశారు. దీని కోసం రాత్రి, పగలు తేడా లేకుండా పరిశోధకులు కష్టపడ్డారు'' అని మోదీ అన్నారు.

 
''ఒకటి కాదు.. రెండు మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సీన్లను పరిశోధకులు సిద్ధం చేశారు. కరోనావైరస్ సోకే ముప్పు ఎక్కువగా ఉండేవారికి మొదట ఈ వ్యాక్సీన్లు ఇస్తాం. వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి మొదట వ్యాక్సీన్లు ఇస్తాం. వైద్య సిబ్బంది ప్రైవేటులో ఉన్నా.. ప్రభుత్వంలో పనిచేస్తున్నా.. అందరికీ ఈ వ్యాక్సీన్ ఇస్తాం'' అని మోదీ స్పష్టం చేశారు.

 
‘చరిత్ర సృష్టిస్తున్నాం’
''చరిత్రలో ఇంత భారీ స్థాయిలో ఎప్పుడూ టీకాలు వేయలేదు. 3 కోట్ల కంటే తక్కువ జనాభా ఉండే దేశాలు వందకుపైనే ఉన్నాయి. కానీ భారత్ తొలి దశలోనే మూడు కోట్ల మందికి టీకాలు వేస్తోంది. రెండో దశలో ఈ సంఖ్యను 30 కోట్లకు తీసుకెళ్తాం. తొలి డోసు టీకా తీసుకున్న తర్వాత మాస్క్ పెట్టుకోకపోవడం, సామాజిక దూరం పాటించకపోవడం లాంటి తప్పులు చేయొద్దు. ఎందుకంటే రెండో డోసు టీకా తీసుకున్న తర్వాతే పూర్తి రక్షణ లభిస్తుంది. వ్యాక్సీన్ రెండు డోసులు పూర్తిగా వేసుకోవడం చాలా ముఖ్యం. రెండు డోసుల మధ్య ఒక నెల రోజుల వ్యవధి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు'' అని మోదీ చెప్పారు.

 
మోదీ భావోద్వేగం
''ఈ కరోనావైరస్ మనుషుల మధ్య దూరాన్ని పెంచింది. పిల్లల్ని దూరం చేసుకొని తల్లులు ఏడ్చారు. ఆసుపత్రుల్లో చేర్పించిన వృద్ధులను కలవలేకపోయాం. కరోనాతో మరణించిన వారికి సరిగా అంతిమ వీడ్కోలు కూడా చెప్పలేకపోయాం' అన్నారు ప్రధాని. కరోనావైరస్ వ్యాప్తి నడుమ ఆరోగ్య సేవల సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్ల ఇబ్బందుల గురించి మాట్లాడుతూ మోదీ భావోద్వేగానికి గురయ్యారు.

 
‘దేశ మంటే మట్టి కాదోయి దేశమంటే మనుషులోయి’
మోదీ తన ప్రసంగంలో తెలుగు కవి గురజాడ అప్పారావు కవితను చదివారు. ‘సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి తోడుపడవోయి.. దేశమంటే మట్టి కాదోయి.. దేశమంటే మనుషులోయి’’ అని గురజాడ చెప్పిన మాటలను మోదీ గుర్తు చేశారు.

 
వుహాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చాం’
''కరోనావైరస్‌పై పోరాటంలో మనం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచాం. మొదట కరోనావైరస్ చెలరేగిన చైనాలోని వూహాన్‌లో చిక్కుకుపోయిన తమ పౌరులను చాలా దేశాలు అలానే వదిలిపెట్టేశాయి. కానీ భారత్ అలా చేయలేదు. వందే భారత్ మిషన్‌ కింద భారత్‌తోపాటు ఇతర దేశాల వారిని మేం వూహాన్ నుంచి వెనక్కి రప్పించాం' అని మోదీ గుర్తు చేశారు.

 
‘‘వ్యాక్సీన్లు ఇచ్చే ప్రక్రియ మొదలైంది కదా అని.. మాస్క్‌లు వేసుకోవడం, సామాజిక దూరం పాటించడం లాంటి కోవిడ్ ప్రోటోకాల్స్‌ను పక్కన పెట్టేయకూడదు. ఇప్పుడు మనమంతా ఒక ప్రమాణం చేయాలి. వ్యాక్సీన్ వచ్చినా కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తామని మాట ఇవ్వాలి’’ అని ప్రజలను కోరారు.

 
తెలంగాణలో
హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ ప్రక్రియల్లో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. తెలంగాణలో మొదటి టీకాను గాంధీ ఆసుపత్రి సఫాయీ కర్మచారి ఎస్.కృష్ణమ్మకు వేశారు. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకాల వ్యాక్సీన్ కోవిషీల్డ్‌తోపాటు భారత్ బయోటెక్ వ్యాక్సీన్ కోవాగ్జిన్‌ను కూడా సరిపడా స్థాయిల్లో దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు ఇప్పటికే తరలించామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ శుక్రవారం స్పష్టంచేశారు. ఈ రెండు టీకాలకు ఈ నెల మొదటివారంలోనే అనుమతులు జారీచేశారు.

 
బీజేపీ నాయకులకు అనుమతి నిరాకరణ
వ్యాక్సినేషన్ సందర్భంగా హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి వచ్చిన బీజేపీ నాయకులను లోనికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసులు, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

 
ఆంధ్రప్రదేశ్‌లో..
ఆంధ్రప్రదేశ్‌లోనూ టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతోంది. విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి (జిజిహెచ్‌)‌లో ముఖ్యమంత్రి జగన్ మొదటి విడత వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే ఆరోగ్య శాఖ స్వీపర్ బి.పుష్పకుమారికి తొలి టీకా వేశారు. అనంతరం హెల్త్‌వర్కర్ నాగజ్యోతికి వ్యాక్సిన్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 332 కేంద్రాల్లో 3.87 లక్షల మందికి తొలిదశలో వ్యాక్సిన్‌ వేయనున్నారు.

 
విజయవాడలోని గన్నవరం వ్యాక్సిన్‌ స్టోర్‌ నుంచి అన్ని జిల్లాలకు వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు. శనివారం ఉదయం నుంచి ఆయా కేంద్రాల వద్ద నిర్ణయించిన మేరకు ఆరోగ్యశాఖలో పనిచేసే (ఫ్రంట్‌లైన్‌ వర్కర్‌లు) అందరికీ వ్యాక్సిన్‌ వేయనున్నారు. ఒక్కోకేంద్రం వద్ద రోజుకు 100 మందికి చొప్పున మొత్తం రోజుకు 33,200 మందికి వ్యాక్సిన్‌ వేసేలా చర్యలు చేపట్టారు. మొదటి డోసు టీకా ప్రక్రియ సుమారు 15 రోజుల పాటు కొనసాగుతుంది.

 
ఆ తర్వాత 28 రోజులకు రెండో డోసు ఇస్తారు. ఇప్పటి వరకూ రాష్ట్రానికి 4.7 లక్షల కోవిషీల్డ్, 20 వేల కోవాక్సిన్‌ టీకా డోసులు వచ్చాయి. ప్రతి సెంటర్‌ వద్ద డాక్టర్‌ పర్యవేక్షణ ఉంటుంది. ప్రతి సెంటర్‌లో ఆరుగురు సిబ్బంది పనిచేస్తారు. వ్యాక్సిన్‌ వేసిన తర్వాత ఎవరిలోనైనా దుష్ప్రభావాలు కనిపిస్తే వారికి తక్షణమే వైద్యసేవలు అందించేందుకు ప్రతి బోధనాసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు

 
విజయవాడతో పాటు రాష్ట్రంలోని విశాఖ, ఇతర ప్రాంతాల్లోనూ వ్యాక్సినేషన్‌ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి జిల్లాలోనూ 30 వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 17 కోల్డ్ స్టోరేజ్‌లలో వ్యాక్సిన్‌ను భద్రపరిచారు.

 
జులై నాటికి 30 కోట్ల మందికి
వ్యాక్సీన్ వేసుకునేందుకు రిజిస్ట్రేషన్‌ కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్ ‘‘కోవిన్’’ను కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. దీని పనితీరును హర్షవర్ధన్ సమీక్షించారు. ఈ యాప్‌లో వ్యాక్సినేషన్‌కు సంబంధించిన డేటా, గణాంకాలు నమోదవుతాయని... వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఆరోగ్య సిబ్బందికి సంబంధించి డేటాబేస్ కూడా రూపొందిస్తామని ఆయన చెప్పారు. ప్రాధాన్య క్రమం ప్రకారం మొదట మూడు కోట్ల మంది ఆరోగ్య సేవల సిబ్బందికి, ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సీన్ వేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది.

 
ఆ తర్వాత 50 ఏళ్లకు పైబడిన వారికి, 50 ఏళ్ల లోపు వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారికి వ్యాక్సీన్ వేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. భారత్‌లో అలాంటి వారు 27 కోట్ల మంది ఉన్నారని వెల్లడించింది. ఈ ఏడాది జులై నాటికి 30 కోట్ల మందికి కోవిడ్-19 టీకాలు వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెస్ట్ సీఎంల లిస్ట్‌లో ఏపీ సీఎం జగన్‌కు మూడో స్థానం.. ప్రధాని మోదీ కూడా..