కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం కొన్ని ఫార్మా దిగ్గజ కంపెనీలు టీకాను తయారు చేశాయి. ఇందులో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒకటి. ఈ టీకాకు కోవిషీల్డ్ అనే పేరు పెట్టారు. ఈ టీకాను దేశంలో అత్యవసర పరిస్థితుల్లో వినియోగించడానికి అనుమతించాలని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) భారత ఔషధ నియంత్రణ మండలిని(డీసీజీఐ) కోరింది.
ఈ మేరకు సోమవారం దరఖాస్తును పంపించినట్టు ఎస్‌ఐఐ సీఈవో అదర్ పూనావాలా తెలిపారు. కొవిషీల్డ్ టీకాను ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ-అస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. భారత్‌లో కొవిషీల్డ్ టీకా ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్‌లో ఉన్నది.
అలాగే, మరో ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్ సంస్థ 'కొవాగ్జిన్' పేరుతో కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. దీన్ని కూడా అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ కేంద్ర డ్రగ్ రెగ్యులేటర్‌కు దరఖాస్తు చేసింది.
ఇప్పటికే సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే. కొవాగ్జిన్ టీకాను ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్ వైరాలజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సహకారంతో అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే టీకా మూడో విడత ట్రయల్స్‌లో జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 18 ప్రాంతాల్లో 22వేల మంది వలంటీర్లపై వ్యాక్సిన్ ప్రయోగిస్తున్నారు.
ఇప్పటికే తొలి, రెండో దశల్లో టీకా మెరుగైన ఫలితాలు రావడంతో డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా మూడో విడత ట్రయల్స్‌కు అనుమతి ఇచ్చింది. ట్రయల్స్ విజయవంతమైతే తర్వాత వ్యాక్సిన్‌కు ఆమోద ముద్ర వేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1.5 మిలియన్లకుపైగా జనం మహమ్మారికి బలయ్యారు. ప్రస్తుతం జనమంతా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలో పలు టీకాల అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి పలు దేశాలు అనుమతి ఇచ్చాయి. ఇటీవల ప్రధాని నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలోనూ ప్రధాని మోడీ కొన్ని వారాల్లో కొవిడ్ వ్యాక్సిన్ సిద్ధంగా ఉండవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలావుండగా యూకే, బహ్రెయిన్ ఫైజర్ టీకా అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేయగా.. ఆ దేశాలు ఆమోదించాయి.