ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతు సంఘాలు మంగళవారం భారత్ బంద్‌ను పాటిస్తున్నాయి. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ బంద్ జరుగనుంది. ఈ బంద్‌కు మొత్తం 24 పార్టీలు పిలుపునిచ్చాయి. ఇందులో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, డీఎంకే, ఆర్జేడీ, శివసేన, సమాజ్‌వాదీ పార్టీ, టీఎంసీ, టీఆర్ఎస్, ఎంఐఎం, శిరోమణి అకాలీదళ్ తదితర పార్టీలు ఉన్నాయి.
ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేలా బంద్‌ను నిర్వహిస్తున్నారు. కాగా, రైతు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం జరుపుతున్న చర్చలు కొలిక్కి రావడం లేదు. ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకపోవడంతో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. రైతు సంఘాలతో ప్రభుత్వం రేపు మరోమారు చర్చలు జరపనుంది.
నిజానికి ఈ వివాదాస్పద కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఛలో ఢిల్లీ పేరుతో ఆందోళన చేపట్టారు. ఇది నేటికి 13వ రోజుకు చేరుకుంది. ఈ ఆందోళనకు దేశం నలుమూలల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది.
ఈ క్రమంలోనే రైతు సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు బంద్‌ను విజయవంతం చేయటానికి రంగంలోకి దిగాయి. రాష్ట్రంలో అధికారపక్షమైన తెరాస కూడా భారత్ బంద్‌లో పాల్గొనాలని నిర్ణయించటం, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పిలుపునివ్వటంతో ప్రాధాన్యాన్ని సంతరించుకొంది.
మరోవైపు, విజయవాడలోనూ భారత్ బంద్ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ బస్సులు బస్టాండ్‌లకే పరిమితమయ్యాయి. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై ఆందోళనకారులు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. రాస్తారోకోలో సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పాల్గొన్నారు. మరోవైపు బస్సులు రోడ్లపైకి రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.