Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మెట్టుదిగని కేంద్రం.. బెట్టువీడని రైతులు - 8న భారత్ బంద్

Advertiesment
Bharat Bandh
, శనివారం, 5 డిశెంబరు 2020 (09:15 IST)
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. ఛలో ఢిల్లీ పేరిట చేపట్టిన ఈ ఆందోళన ప్రారంభమైన పది రోజులు గడుస్తున్నా అటు కేంద్ర ప్రభుత్వం గానీ, ఇటు రైతులు గానీ ఏమాత్రం బెట్టువీడటం లేదు. ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ సానుకూల ఫలితం ఏర్పడలేదు. దీంతో రైతులు ఆందోళన కొనసాగించాలని నిర్ణయించారు. అలాగే, ఈ నెల ఎనిమిదో తేదీన భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. 
 
కాగా, కేంద్రం తీసుకొచ్చిన కొత్త మూడు వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట శరాఘాతంగా మారుతాయని, కార్పొరేట్ వర్గాలకు మేలు చేకూర్చేలా ఉన్నాయని రైతులు ఆరోపిస్తూ ఈ ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన ప్రారంభమై దాదాపు 10 రోజులుగా దేశ రాజధాని చుట్టూ అన్ని ప్రాంతాల్లో మోహరించి నిరసనలు తెలియజేస్తున్నారు. 
 
దీంతో శుక్రవారం 35 రైతు సంఘాల నేతలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించడంతో పాటు, శనివారం కేంద్ర మంత్రులతో మూడవ విడత జరిగే చర్చలపై అనుసరించాల్సిన వైఖరిని కూడా చర్చించారు. అలాగే, డిసెంబరు 8వ తేదీన భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. 
 
భారత్ బంద్ విషయాన్ని మీడియాకు తెలిపిన భారతీయ కిసాన్ యూనియన్ ప్రధాన కార్యదర్శి లాఖోవాల్, శనివారం నాడు మోడీ ప్రభుత్వ దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని నిర్ణయించామని అన్నారు. 
 
ఇదిలావుండగా, ఆర్ఎస్ఎస్ అనుబంధ భారతీయ కిసాన్ సంఘ్ సైతం రైతులకు మద్దతు పలకడం గమనార్హం. దేశంలో కనీస మద్దతు ధరను రైతులకు అందించే వ్యవస్థను కొనసాగించాల్సిందేనని, అన్ని మండీల్లో ఇదే ధర ఉండాలని, ఆ విధంగా తాజా చట్టాల్లో మార్పులు చేయాలని కోరింది.
 
ఇక శుక్రవారం రైతు నిరసనలు మరింతగా ఉద్ధృతమయ్యాయి. ముఖ్యంగా టిక్రీ, గాజీపూర్, నోయిడా, సింఘూ సరిహద్దుల్లో కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలను హోరెత్తిస్తున్న రైతులు, చలిని సైతం లెక్కచేయకుండా అక్కడే నిద్రిస్తున్నారు. 
 
రైతుల నిరసనలతో న్యూఢిల్లీకి సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాల నుంచి ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఆగిపోగా, ప్రత్యామ్నాయ మార్గాల్లో నిత్యమూ విపరీతమైన ట్రాఫిక్ జామ్ నెలకుంటోంది. ఆందోళనలో పాల్గొని అనారోగ్యానికి గురవుతున్న రైతులకు పలు వైద్య సంఘాలు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేక వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'గ్రేటర్' పోరు ముగిసింది... ఎవరికెన్ని స్థానాలంటే... మేయర్ పీఠం ఎంఐఎంకా?