Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్: 'గుడిసె' ఉన్నట్లుండి సినిమా షూటింగ్ స్పాట్ ఎలా అయింది?

ఆంధ్రప్రదేశ్: 'గుడిసె' ఉన్నట్లుండి సినిమా షూటింగ్ స్పాట్ ఎలా అయింది?
, శనివారం, 15 జనవరి 2022 (19:25 IST)
తూర్పు కనుమల వెంబడి అనేక పర్యాటక కేంద్రాలున్నాయి. పెద్ద సంఖ్యలో టూరిస్టుల తాకిడి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. కానీ దశాబ్దం క్రితం ఆ పేరు కూడా ఎవరూ వినని ఓ కొండ ప్రాంతం ఇప్పుడు పర్యాటకులతో పోటెత్తుతోంది. తగిన సదుపాయాలు లేకపోయినా, అనేక అవస్థలు పడుతూనే జనం తరలివస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు మార్గం అత్యంత దుర్భంగా ఉన్నప్పటికీ అనేక కొండలు దాటేందుకు జనం వెనుకాడడం లేదు.

 
అందుకే, ఇప్పుడు గుడిసె పెద్ద పర్యాటకక్షేత్రంగా మారుతోంది. విశాలమైన గ్రాస్ ల్యాండ్స్ లో గడిపేందుకు ఎక్కువ మంది ప్రాధాన్యమివ్వడంతో గుడిసె ప్రాంతం వారాంతాల్లో కిటకిటలాడుతోంది.ఇంతకీ గుడిసె ఎక్కడుంది, దానికంత ప్రాధాన్యం ఎలా వచ్చిందన్నది ఆసక్తికరం.

 
స్వతంత్రానికి పూర్వమే దీనిని గుర్తించారు
తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి మండలానికి అనేక సంవత్సరాలుగా పర్యాటకరంగంలో గుర్తింపు వచ్చింది. నిత్యం వందల మంది టూరిస్టులు ఈ కుగ్రామానికి రావడంతో ఇప్పుడు మారేడుమిల్లి రూపురేఖలు మారిపోతున్నాయి. ఆదివాసీ గిరిజన గ్రామం క్రమంగా ఆధునికతను సంతరించుకుంటోంది. మారేడుమిల్లి సమీపంలో జలతరంగిణి వంటి వాటర్ ఫాల్స్, పాములేరు వాగు ప్రాంతాల్లో పర్యాటకులు ఎక్కువగా సేదతీరేవారు.

 
కానీ ఇప్పుడు మారేడుమిల్లి మండల కేంద్రం నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘గుడిసె’కి పర్యాటక శోభ మొదలయ్యింది. అందులోనూ అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకూ సహజంగా పర్యాటకంగా సానుకూల వాతావరణం కాబట్టి అనేక మంది ఈరోజుల్లో గుడిసెకు తరలివెళుతున్నారు. పుల్లంగి పంచాయతీ పరిధిలో ఉండే గుడిసె గ్రామానికి సమీపంలో కొండలపై భూభాగం చదునుగా ఉండడం, ఏపుగా పెరిగిన గడ్డితో విశాలమైన గ్రాస్ ల్యాండ్స్ అందంగా కనిపించడంతో పర్యాటకులను ఆకర్షించింది. కానీ, స్వతంత్రానికి పూర్వమే బ్రిటీష్ వారు ఈ గుడిసె గ్రామాన్ని హిల్ స్టేషన్‌గా మార్చే యత్నం చేశారు. గుడిసె ని ఎయిర్ స్ట్రిప్‌గా మార్చేందుకు ప్రణాళికలు రచించారు. అయితే ఆ తర్వాత అనేక కారణాలతో దానిని విరమించుకున్నట్టు పుల్లంగి పంచాయతీ రికార్డులు చెబుతున్నాయి.

 
ప్రకృతిలో సేద తీరేందుకే
పుల్లంగి పంచాయతీ ఒకనాడు బ్రిటీష్ వారికి క్యాంప్‌గా ఉండేది. శీతల వాతావరణం ఉండడంతో బ్రిటీష్‌ అధికారులు ఎక్కువ కాలం గడిపేవారు. చరిత్ర పరిశోధకులు హైమన్ డార్ఫ్ కూడా పుల్లంగి ప్రాంతాన్ని ప్రస్తావించారు. ఈ ప్రాంతంలో ఉండే గిరిజన తెగల గురించి పరిశోధన చేశారు.పుల్లంగి పంచాయతీ పరిధిలోనే గుడిసె గ్రామం ఉంటుంది. గ్రామానికి వెళ్లే దారిలో కొండలపై ఉన్న ప్రాంతం ఇప్పుడు పర్యాటకులకు కేంద్రం అవుతోంది. అక్కడి హిల్ స్టేషన్‌ని ‘గుడిసె’గా పిలుస్తున్నారు. ఏటవాలు కొండల నుంచి లోయలను చూడడం, వంపులు తిరిగిన కొండల్లో ప్రయాణాలు, అందమైన సూర్యోదయం, సూర్యాస్తమయాల కోసం గుడిసె ప్రాంతానికి తరలివస్తున్నట్టు పర్యాటకులు చెబుతున్నారు.

 
క్యాంపింగ్ అనుభూతి కోసం...
"పట్టణ ప్రాంతాల్లో చాలామంది రోజువారీ జీవితాలతో అలసిపోయి ఉంటారు.అలాంటి వారందరికీ గుడిసె కొండలు కావాల్సినంత ఉపశమనంగా ఉన్నాయి. పూర్తిగా ప్రకృతితో నిండిన సహజ వాతావరణంలో క్యాంపింగ్ వేసుకుని ఓ రాత్రంతా గడిపేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. కొండలపై ఏమీ దొరకవు. కాబట్టి చివరకు క్యాంప్ ఫైర్ వేసుకునే పుల్లల నుంచి మంచినీటి సహా ప్రతీ వస్తువు కింద నుంచే తీసుకుని వస్తుంటారు’’ అని స్థానికంగా ట్రావెల్స్ సంస్థను నడిపే వెంకట్ చెబుతున్నారు.

 
రంపచోడవరం కేంద్రంగా క్యాంపింగ్ ఏర్పాట్లతో పాటు ట్రావెల్స్, ఫుడ్ సహా పర్యాటకులకు అన్నీ అందించే సంస్థను వెంకట్ నిర్వహిస్తున్నారు. ‘‘క్యాంపింగ్ తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ మేము సమకూరుస్తున్నాము. గడిచిన రెండేళ్లలో పర్యాటకుల రాకపోకలతో సందడిగా మారింది. గతంతో పోలిస్తే ఐదు, పది రెట్లు ఎక్కువగా ఇప్పుడు టూరిస్టులు వస్తున్నారు’’ అని వెంకట్ అన్నారు. ఇంజనీరింగ్ చదివిన తనతో పాటుగా అనేక మందికి ఈ గుడిసె టూరిజం ఉపాధి అవకాశంగా మారిందని, తనతో పాటు గుడిసె ప్రాంతంలో ఈ టూరిజం కారణంగాసుమారు 200 మందికి ఉపాధి దొరుకుతోందని వెంకట్ తెలిపారు.

 
రాత్రంతా గడపడమే ఆనందం
"గుడిసె కి సాయంత్రం సూర్యాస్తమయం లోపు చేరుకుని, రాతంత్రా అక్కడే గడపడంలోనే ఆనందం ఉంటుంది. అందుకే శనివారం సాయంత్రాలు గుడిసె కొండ ప్రాంతం వేలమందితో కళకళలాడుతోంది. క్యాంప్ ఫైర్లు, మ్యూజిక్ హోరుతో మారుమ్రోగుతుంది. వందల వాహనాల రద్దీ ఉంటుంది. మేమయితే రెండేళ్లుగా ఏటా రెండు మూడుసార్లు ఫ్రెండ్స్ తో వస్తున్నాము’’ అని విశాఖపట్నానికి చెందిన సూర్యతేజ్ బీబీసీతో అన్నారు.

 
తేజతో పాటుగా ఆయన బ్యాచ్‌కి చెందిన 12 మంది గుడిసె కి టూ వీలర్స్ మీద బయలుదేరి వచ్చారు. శనివారం ఉదయాన్నే విశాఖలో బయలుదేరి ఆ సాయంత్రినికి గుడిసెకి చేరుకున్న ఈ టీమ్ సభ్యులు, ఆదివారం మధ్యాహ్నం వరకూ మారేడుమిల్లి పరిసరాలు చూసుకుని మళ్లీ రాత్రికి విశాఖ చేరుకుంటామని తెలిపారు.

 
ప్రయాణం ఇబ్బందే
"గుడిసె కొండలపై ప్రకృతి ఎంత ఆనందాన్నిస్తుందో.. అక్కడికి చేరడానికి ప్రయాణం మాత్రం అంత కష్టంగా ఉంటోంది. మేము వచ్చే దారిలో చాలా వాహనాలు ఆగిపోతున్నాయి. పర్యాటకులు చాలా కష్టపడుతూ పైకి వస్తున్నారు. చాలామందికి అవగాహన లేక సాధారణ వాహనాల్లో బయలుదేరుతున్నారు. కొందరు ఉత్సాహవంతులు ట్రెక్కింగ్ చేస్తూ నడకదారిలో వస్తున్నారు గానీ వాహనాలతో వచ్చే వారు మాత్రం పక్కా ఫిట్నెస్‌తో ఉన్న పెద్ద ఎస్‌యూ‌వీ లు లేదా సరుకు రవాణా చేసే వాహనాలనే తెచ్చుకోవాలి’’ అని కాకినాడకు చెందిన పి.లక్ష్మి అనే యువతి బీబీసీతో అన్నారు.

 
గుడిసె వచ్చేందుకు మారేడుమిల్లి వరకూ రోడ్డు బాగానే ఉంది. ఆ తర్వాత ఆకుమామిడి కోట వరకూ సాధారణ వాహనమే అయినా సమస్య ఉండదు. ఆ తర్వాత కొండలు ఎక్కాల్సి ఉంటుంది. ఘాట్ రోడ్డు కూడా సవ్యంగా లేదు. రాళ్లు లేచి, గోతులతో అస్తవ్యస్తంగా ఉంటుంది. చిన్నపాటి ఆదమరపు కూడా పెద్ద ప్రమాదానికి దారితీసే రోడ్డులో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాబట్టి అతి జాగ్రత్తతో సరైన వాహనాలు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

 
మారేడుమిల్లి నుంచి ప్రైవేటు వాహనాలున్నాయి. అందులో నిత్యం ఈ రోడ్డులో ప్రయాణించే అలవాటున్న డ్రైవర్లు కావడంతో వాహనాల రవాణా కొంత జోరుగానే సాగుతోంది. సినిమా వాళ్లు కొంత బాగు చేశారు. గుడిసె ప్రాంతంలో ఇటీవల పలు తెలుగు సినిమా షూటింగ్లు జరుగుతున్నాయి. 2021లోనే అల్లు అర్జున్ పుష్ప, చిరంజీవి ఆచార్య సినిమాలు ఇక్కడ చిత్రీకరించారు. శేషాచలం కొండల్లో ఎర్రచందనం రవాణా అంటూ తూర్పు కనుమల్లోని గుడిసె ఘాట్ రోడ్డు చూపించి మెప్పించడం పుష్ప సినిమా ప్రత్యేకత. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా అల్లు అర్జున్ సహా ఇతరుల రాకకోసం రోడ్డు కొంత బాగు చేశారు. ఆ తర్వాత మళ్లీ వర్షాలకు దెబ్బతిన్నట్టు కనిపిస్తోంది.

 
"సినిమా యూనిట్లు కొంత ప్రయత్నం చేశాయి. 2016లో గుడిసె వాసుల కోసం అప్పటి ప్రభుత్వం కూడా కొంత మేరకు రోడ్డు నిర్మించింది. మిగిలిన రోడ్డు కూడా బాగుచేస్తేనే పర్యాటకులకు ఉపయోగం’’ అని పుల్లంగి కి చెందిన చెదల ఆదిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఇటీవల ప్రభుత్వం గుడిసె వెళ్లే వారి నుంచి కొంత రుసుము వసూలు చేసి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించిందని, ఐటీడీఏ అలాంటి ప్రయత్నం చేసినా ఉపయోగం ఉంటుందని ఆయన అన్నారు.

 
‘పర్యావరణాన్ని కాపాడాలి’
‘‘పాపికొండల టూర్ ఆగిపోవడంతో..గుడిసె కి టూరిస్టుల తాకిడి పెరిగింది. అయితే, సహస సిద్ధమైన వాతావరణానికి సమస్య వస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాలు ఇష్టారాజ్యంగా వాడేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది ఇటు రావచ్చు. అందుకు తగ్గట్టుగా ప్లాస్టిక్ వినియోగం సహా ఇతర ఆంక్షలను ఇప్పటి నుంచే అమలు చేయాలి" అంటున్నారు రంపచోడవరానికి చెందిన జర్నలిస్టు పి.పండు. 2019లో జరిగిన బోటు ప్రమాదంతో పాపికొండల పర్యాటకం నిలిచిపోయింది. ఇటీవల మళ్లీ దానిని ప్రారంభించారు. కానీ గడిచిన రెండేళ్లలో అనేక మందికి గుడిసె ప్రత్యామ్నాయంగా మారడంతో ఈ కాలంలో గుడిసె గ్రాస్‌ల్యాండ్స్‌కి ఆదరణ పెరిగిందనేది స్థానికుల వాదన.

 
"గుడిసె పర్యాటక కేంద్రంగా మారడం స్థానికులకు కొంత మేలు చేస్తుంది. దానికి తగ్గట్టుగా పుల్లంగి పంచాయతీ అభివృద్ధికి టూరిజం ఆధారంగా నిధులు సమీకరించే ప్రయత్నాలు చేస్తున్నాం. గ్రాస్‌ల్యాండ్స్‌ని పరిరక్షించడం, రోడ్లు సహా ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం’’ అని రంపచోడవరం ఐటీడీఏ అధికారి ప్రవీణ్ ఆదిత్య బీబీసీకి తెలిపారు. ప్రభుత్వం ఈ పర్యాటక క్షేత్రాన్ని అందరికీ అనువుగా మార్చేందుకు శ్రద్ధపెడితే ఏపీలో టూరిజం అభివృద్ధికి కొత్త అవకాశాలనిస్తుంది. అదే సమయంలో పుల్లంగి సమీపంలో నివసించే గిరిజన ప్రాంత యువతకు ఉపాధి మార్గం అవుతుంది. దానికి అనుగుణంగా ఉత్సాహవంతులను తీర్చిదిద్దడం, ఇతర ప్రయత్నాలకు చొరవ చూపాల్సి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సచిన్ జోషికి ఈడీ షాక్: రూ.410 కోట్ల ఆస్తి జప్తు