Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సంక్రాంతి పండుగకు తెలుగువారు చేసే స్పెషల్ వంటకాల కథ

సంక్రాంతి పండుగకు తెలుగువారు చేసే స్పెషల్ వంటకాల కథ
, బుధవారం, 12 జనవరి 2022 (15:33 IST)
సంక్రాంతి పండుగ వ్యవసాయ ఆధారిత దేశంలో భూమికి, ప్రకృతికి చేతికొచ్చిన పంటతో కృతజ్ఞతలు తెలిపే పండుగ. కుటుంబమంతా ఒక్క చోటే చేరి పండుగను జరుపుకుంటారు. అయితే, ఈ మూడు రోజులూ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కొన్ని పిండివంటలను కచ్చితంగా వండుతారు. సంక్రాంతికి ప్రధానంగా వండే పిండి వంటలు ఏంటి?

 
సంక్రాంతి, ధనుర్మాసంలో వండుకునే పిండివంటల ప్రాశస్త్యం గురించి ఫుడ్ క్యూరేటర్ రాజేశ్వరి పూతలపట్టు, ఆయుర్వేదిక్ వైద్యుడు,, ఆహార చరిత్రపై పుస్తకాలు రచించిన డాక్టర్ జీవీ పూర్ణ చందు బీబీసీకి వివరించారు. భోగి మంటల్లో గతాన్ని, పేరుకుపోయిన చెత్తను తగులబెట్టి పండగ దీపాన్ని పెట్టడంతో సంక్రాంతి పండుగ మొదలవుతుంది. భోగి నాడు కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా శాకాహార వంటలు చేస్తే, రాయలసీమలో ఇడ్లీలు, పొట్టేలు మాంసం తింటారు. మినపప్పు, ఇడ్లీ నూక లేదా బియ్యంతో చేసిన ఇడ్లీలను ఆవిరి పై ఉడికించి పొట్టేలు మాంసంతో కలిపి తింటారు.

 
చక్కెర పొంగలి
శాకాహారులు చక్కెర పొంగలి లాంటి పిండి వంటలు వండుతారు. 12వ శతాబ్ధంలో శ్రీనాథుడి కాలం నుంచే చక్కెర పొంగలి లాంటి వంటకాలున్నాయని డాక్టర్ పూర్ణ చందు అంటారు. బెల్లం, నేయి, బియ్యం, పెసరపప్పు కలిపి చేసే చక్కెర పొంగలిలో పచ్చ కర్పూరం వేస్తె దానికొక పరిమళం సమకూరుతుందని అన్నారు. గ్రామాల్లో అయితే, సూర్యునికి ఎదురుగా కొత్త కుండకు పసుపు ఆకు తోరణంగా కట్టి, చెరుకు రసం, బెల్లంతో కలిపి పొంగలి చేస్తారు. కొత్తగా పండిన చెరుకు, బియ్యం, పసుపు తోరణం ఆ పొంగలికి రుచిని తీసుకొస్తాయని అంటారు.

 
తెలుగు నేల పై తొలిగా పండించిన పంటల్లో పెసర కూడా ఒకటని, దీనికున్న ప్రాచీనత కారణంగా ఈ వంటకం పండుగల వేళ ప్రసిద్ధి చెందినదని డాక్టర్ పూర్ణ చందు అన్నారు. భోగి నాడు వండే పొంగలిలో పాలు వేయరు. చక్కెర వాడకం క్రీస్తు పూర్వం 8వ శతాబ్ధంలో భారతదేశంలోనే మొదలయిందని కొన్ని చైనా గ్రంథాలు చెబుతున్నాయి. గుప్తులు, బౌద్ధ సన్యాసుల పాలనా కాలం నుంచి పంచదారను స్ఫటిక రూపంలో కనిపించడం మొదలయింది. 4వ శతాబ్ధంలో తెలుగు వారు చెరకును పండించినట్లు కాళిదాసు పద్యాల్లో కనిపిస్తుంది.

 
కటు పొంగలి
మిరియాలు, ఇంగువ, జీలకర్ర వేసి చేసే కటు పొంగలి కూడా శీతాకాలంలో ఆరోగ్యానికి మేలని ఆయుర్వేదం చెబుతోంది. అందుకే వీటిని ధనుర్మాసంలో ఆలయాల్లో కూడా ప్రసాదాలుగా పెడతారని అంటారు. తెలుగు నేలమీద అతి ప్రాచీనకాల౦లోనే ప౦డి౦చిన తొలి పప్పు ధాన్యాలలో పెసర ఒకటి. ఈ పదాలన్ని౦టికీ ఆఫ్రోఏసియాటిక్ భాషా మూలాలు ఉన్నాయనిపిస్తు౦ది. నైలూ ను౦చి కృష్ణదాకా సాగిన ద్రావిడుల ప్రయాణానికి ఈ పెసలు ఒక సాక్ష్య౦ కావచ్చని డాక్టర్ పూర్ణ చందు వివరించారు.

 
పులిహోర
పండుగ నాడు సాధారణంగా తెలుగు వారి ఇళ్లల్లో కనిపించే మరో వంటకం పులిహోర. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు చేదు కలిపిన ఆరు రుచులను మేళవించి చేసే పులిహోర శరీరంలో వాత, పిత్త, కఫ దోషాలను సమస్థితిలో ఉంచుతుంది. తీపి కోసం బెల్లం, పులుపు కోసం చింతపండు, ఉప్పు, కారం, చేదు కోసం ఆవ, మెంతి పిండిని కూడా చేర్చి వండుతారు. ఇది జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. వేరు శనగ, జీడిపప్పు లాంటివి చేర్చడం అదనపు రుచిని తెస్తుందని చెబుతారు. శ్రీనాథుడు రచించిన కావ్యాల్లో కూడా పులిహోర ప్రస్తావన ఉందని చెబుతారు. దీనికి 800 సంవత్సరాల పూర్వ చరిత్ర కూడా ఉంది. కాకపొతే, వీటిని నిర్ధారించేందుకు కచ్చితమైన సాహిత్యాధారాలు లేవని డాక్టర్ పూర్ణ చందు అన్నారు.

 
అరిసెలు
15వ శతాబ్ధపు వైద్య గ్రంథంలో వరి గురించి ప్రస్తావన ఉంది. బియ్యం నానబెట్టి పిండి చేసి దాంట్లో బెల్లం పాకం కలిపి చేసిన చలిమిడి లాంటి పదార్ధాన్ని నూనెలో వేపి అరిసెలు తయారు చేస్తారు. అరిసి అంటే తెలుగులో వారి బియ్యం అని అర్ధం. ఇది త్వరగా జీర్ణమయ్యే స్వభావం కలిగి ఉండదు. అరిసె తిన్నాక ధనియాలు, జీలకర్ర, శొంఠి ని సమభాగాలుగా తీసుకుని అందులో తగినంత ఉప్పు కలిపి , చెంచా పొడిని నీటిలో కలిపి తాగితే, జీర్ణ సమస్యలు ఉండవని డాక్టర్ పూర్ణ చందు చెప్పారు. సంక్రాంతి పండుగకు అరిసె ఒక ప్రతీక అని అంటారు.

 
గుమ్మడికాయ కూర
సంక్రాంతి నాడు చాలా ప్రాంతాల్లో గుమ్మడికాయ కూరను బెల్లంతో కలిపి వండుతారు. బ్రాహ్మలకు కూడా గుమ్మడి దానం ఇస్తారు. కొన్ని ప్రాంతాల్లో, గుమ్మడి పులుసు చేస్తారు. దీనినే దప్పళం అని పిలుస్తారు. బాపు దర్శకత్వం వహించిన పెళ్లి పుస్తకం సినిమా పాటలో "వేడి వేడి అన్నం మీద పప్పు, కాచిన నేయి, పప్పు దప్పళం కలిపి కొట్టడం" అంటూ దప్పళం ప్రస్తావన కనిపిస్తుంది. ఇవి కాకుండా కొన్ని ప్రాంతాల్లో సంక్రాతి నాడు అవిసె ఆకు, కందిపప్పు, కొబ్బరితో కూర చేస్తారు. ముఖ్యంగా రాయలసీమలో ఈ వంటకాలు కనిపిస్తాయి. తెలుగువారి ఆహారపు అలవాట్ల గురించి 15వ శతాబ్దానికి చెందిన భావమిశ్ర లఘుత్రాయి అనే కావ్యంలో ప్రస్తావించినట్లు డాక్టర్ పూర్ణ చందు తెలిపారు. ఆయన రచనల్లో కూర, పప్పు లాంటి పదార్ధాలు కనిపిస్తాయి.

 
కలగూర
చిక్కుడుకాయ, చిలగడ దుంప, వంకాయ, అరటికాయ టమాటోతో కలిపి కలగూర వండుతారు. ఇవన్నీ ఈ కాలంలో పండే పంటలు. వీటినన్నిటినీ ఆహారంగా తీసుకునేందుకు ఈ పద్ధతి పెట్టి ఉంటారని రాజేశ్వరి అభిప్రాయపడ్డారు. సంక్రాంతి నాడు పూర్వీకులకు కూడా ఆహారం సమర్పించి, కొత్త బట్టలు పెట్టి ప్రార్ధనలు చేస్తారు.

 
రాగి అట్లు లడ్డూలు
రాగి పిండి, బెల్లం, డ్రై ఫ్రూట్స్, నేయి కలిపి రాగి లడ్డూలు చేస్తారు. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయని అంటారు. ఆయా ప్రాంతాల్లో పండే పంటలే పిండి వంటలకు కూడా మూలం అని రాజేశ్వరి అంటారు.

 
పబ్బిళ్లలు లేదా చెక్కలు
కారంగా ఉండే చెక్కలను వరిపిండిను ఉడికించి అందులో జీలకర్ర, కరివేపాకు లాంటి పదార్ధాలను చేర్చి తయారు చేస్తారు. వీటిని రాయలసీమ ప్రాంతంలో పల్లీలు, ఎండుమిర్చి వేసి చేస్తే, తెలంగాణలో పచ్చిమిర్చి వేసి చేస్తారు.

 
బొబ్బట్లు/ఓళిగలు
మైదా, శనగపప్పు కలిపి చేసే తీపి పదార్ధాలను బొబ్బట్లు లేదా ఓళిగలని అంటారు. వీటిని కూడా పండుగ సమయంలో చేస్తూ ఉంటారు.

 
నువ్వు ఉండలు
నువ్వులు, బెల్లం కలిపి సంక్రాంతి సమయంలో నువ్వు ఉండలు, చక్కీలు చేస్తారు. ఇవి తిని తీపి మాటలు మాట్లాడమని చెబుతూ ఉంటారు. వీటిని పంచడం ద్వారా వారి గతాన్ని మర్చిపోయి, వారి జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టాలని ఆశిస్తారు. వీటికి వైద్యపరంగా కూడా శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయనే కారణంతో తినమని చెబుతారు. నల్ల నువ్వులతో లడ్డూలు కూడా చేస్తారు.

 
కళ్యాణి చాళుక్య రాజు సంస్కృతంలో రచించిన మానసోల్లాసంలో చాలా వరకూ పండగ వంటల ప్రస్తావన కనిపిస్తుంది. శ్రీ నాధుడు 11 - 12వ శతాబ్ధంలో రచించిన కావ్యాల్లో చాలా తెలుగు పిండివంటల ప్రస్తావన వస్తుందని డాక్టర్ పూర్ణ చందు చెప్పారు. తెనాలి రామకృష్ణుడు, కృష్ణ దేవరాయలు కూడా తమ కావ్యాల్లో చాలా రకాల ఆహార పదార్ధాలను ప్రస్తావించారని వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలకు 3 గంటలు కాదు.... 40 నిమిషాల్లోనే....